Train Journey: పిల్లలతో కలిసి మీరు ట్రైన్ జర్నీ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మర్చిపోకండి
27 October 2024, 9:30 IST
పిల్లలతో కలిసి ట్రై జర్నీ అంత సులువు కాదు. సాధారణంగా ఇంట్లో అటు.. ఇటూ తిరిగే పిల్లలు ఒకే బోగిలో అది కూడా మన బెర్తు వద్దే కూర్చుని ఉండాలంటే చాలా కష్టం.
పిల్లలతో ట్రైన్ జర్నీ
మనలో చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రతి ఒక్కరికీ ఆ ప్రయాణంలో ఏదో ఒక కొత్త అనుభవం ఎదురువుతూనే ఉంటుంది. కొంత మంది రైలుఎక్కగానే తమ బెర్త్ చూసుకుని నిద్రపోతారు. మరికొంత మంది బోగిలో తమ చుట్టూ ఉన్న వారితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది ఫోన్‌లు చూసుకుంటూ ఉంటారు. అయితే.. ఎక్కువ మోసాలు రైలు ప్రయాణాల్లోనే జరుగుతుంటాయి. కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మరీ ముఖ్యంగా పిల్లలతో కలిసి ప్రయాణించే సమయంలో వారిపై ఓ కన్నేసి ఉంచాలి.
పిల్లలతో కలిసి జర్నీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- రైలు ఎక్కేటప్పుడు, ఎక్కిన తర్వాత మీ బిడ్డ సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోండి. రైలు బయల్దేరే వరకూ మీతో పాటు సీట్లో కూర్చునేలా చూసుకోండి.
- బోగిలో ఉన్నంతసేపు మీ బిడ్డపై ఓ కన్నేసి ఉంచండి. ముఖ్యంగా రైలు కదలడం ప్రారంభించిన తర్వాత పిల్లలు లేచి ఒంటరిగా పరిగెత్తకుండా చూసుకోండి.
- పిల్లలు ఆడుకుంటూ బోగి డోర్ దగ్గరకు లేదా అపరిచితుల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి.
- ఒకవేళ మీ పిల్లవాడు మరీ అల్లరిగా ఉండి.. బోగిలో ఇటూ అటూ తిరుగుతుంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పిల్లోడి జేబులో మీ కాంటాక్ట్ నంబరు, అడ్రస్ పేపర్ ఉంచండి.
- ఒకవేళ తప్పిపోతే.. మిమ్మల్ని ఎలా సంప్రదించాలో పిల్లవాడికి ముందుగానే నేర్పండి. ఎమర్జెన్సీ కాల్ చేయడానికి అవసరమైన మొబైల్ నెంబరును పిల్లలు గుర్తుంచుకునేలా అలవాటు చేయండి.
- అపరిచిత వ్యక్తులతో మాట్లాడటం, వాళ్లు ఇచ్చే తినుబండారాలు తినడం వల్ల కలిగే నష్టాలేమిటో పిల్లలకు అర్థమయ్యేలా వివరించండి.
- మీ పిల్లలను అపరిచిత వ్యక్తులకి అప్పగించడం లేదా వారి చేతులకి ఇవ్వడంపై పునరాలోచించండి. కేవలం కాసేపు ప్రయాణంలో ఎవరిపైనా అతి నమ్మకం మంచిది కాదు.
- మీరు రాత్రిపూట నిద్రపోయే సమయంలో మీ పక్కనే మీ పిల్లాడిని పడుకోబెట్టుకోండి. అప్పర్ బెర్తులో అయితే మరింత జాగ్రత్త తీసుకోవాలి. నిద్రలో మీ పిల్లాడు పొరపాటున నిద్రలేచి కిందకి రావాలని ప్రయత్నిస్తే కిందపడే ప్రమాదం ఉంది. కాబట్టి.. అప్రమత్తంగా ఉండండి
- ఒకవేళ లోయర్ బెర్తులో అయితే.. మరీ అతి నిద్ర మంచిది కాదు. పిల్లలను కిడ్నాప్ చేసే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి.. అనుక్షణం అప్రమత్తంగా ఉండండి
- ట్రైన్ జర్నీ ముగిసి.. దిగే సమయంలోనూ పూర్తిగా రైలు ఆగే వరకూ నిరీక్షించండి. హడావుడిగా పిల్లలను కిందకు దించడం లాంటివి చేయకండి.
పరిస్థితులు అదుపు తప్పితే?
పిల్లలను కిడ్నాప్ చేయడం, నగదు దోచుకోవడం, అపరిచిత వ్యక్తులు అందించే ఆహారం, పానీయాలు తింటే వచ్చే ఇబ్బందులు, కలిగే ప్రమాదాల గురించి రైల్వే శాఖ హెచ్చరిక సందేశాన్ని కూడా తరచూ జారీ చేస్తుంటుంది. పరిస్థితి ఏదైనా మీకు అదుపు తప్పినట్లు అనిపిస్తే వెంటనే భారతీయ రైల్వే ఎక్స్ ఖాతాను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేయవచ్చు లేదా సహాయం కోసం 139కు కాల్ చేయవచ్చు. లేదంటే పోలీస్ కంట్రోల్ రూం 100, 112 నెంబర్లకు ఫోన్ చేయొచ్చు.