Instagram reel : రీల్స్ కోసం నడిరోడ్డు మీద ‘కిడ్నాప్’ ప్లాన్- చివరికి సీన్ రివర్స్..
Kidnap reel : నేటి యువతలో ఇన్స్టాగ్రామ్ 'రీల్' వ్యసంగా మారిపోయింది. తాజాగా కొందరు, ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సేషన్ సృష్టించేందుకు కిడ్నాప్ రీల్‌ని ప్లాన్ చేశారు. నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. చివరికి, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సెషన్ సృష్టించేందుకు ఇటీవలి కాలంలో చాలా మంది చాలా వింత, విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కొందరు.. నడిరోడ్డు మీద 'కిడ్నాప్' ప్లాన్ చేశారు. చివరికి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
యూపీ ముజఫర్ నగర్‌లోని ఖతౌలీ ప్రాంతానికి సంబంధించిన ఓ వీడియో ఈ వారం వైరల్‌గా మారింది. స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తమ వాహనాన్ని ఆపారు. చాట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని వేగంగా అతని ముఖాన్ని గుడ్డతో కప్పేశారు. ఆ వ్యక్తి స్పృహ కోల్పోయినట్టు నటించారు. చివరికి, అతడిని బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు.
ఈ ఘటనను అప్పటివరకు నిలబడి చూస్తున్న కొందరు స్థానికులు, బైక్‌ని అడ్డుకున్నారు. కిడ్నాపర్లలో ఒకరు బైక్‌ను నడపడానికి ప్రయత్నిస్తుండగా ఓ స్థానికుడు వారితో వాగ్వాదానికి దిగడం కూడా క్లిప్ లో కనిపించింది.
అప్పుడే అసలు విషయం బయటపడింది! ఇదంతా ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం చేసినట్టు కిడ్నాపర్లుగా నటించిన వారు స్థానికులకు చెప్పారు. ఆ వెంటనే సమీపంలోని కెమెరాను చూపించారు. అది నిజం కిడ్నాప్ కాదని తెలుసుకున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చివరికి నవ్వుతూ వెళ్లిపోయారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోని ఇక్కడ చూసేయండి..
ఈ ఘటనకు సంబంధించిన క్లిప్‌ను బ్యాక్ గ్రౌండ్ లో మీర్జాపూర్ టీవీ షో థీమ్ సాంగ్‌తో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే ఈ ఘటనపై చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీల్ కోసం ఇలాంటివి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రీల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
“వీళ్లని తీసుకెళ్లి జైలులో పెట్టాలి. శిక్ష వేయాలి,” అని చాలా మంది కామంట్లు పెడుతున్నారు.
ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. కిడ్నాప్ రీల్ చేసిన మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు.
“ఖతౌలీ పట్టణంలోని ఓ బహిరంగ ప్రదేశంలో ముగ్గురు బాలురు ఫేక్ కిడ్నాప్‌ను చిత్రీకరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. ఇప్పుడు ఈ వీడియోలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేశాము,” అని పోలీసులు తెలిపారు.
ఇన్స్టాగ్రామ్ పిచ్చిలో యువత..!
ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా యువత ఇన్స్టాగ్రామ్ లైక్స్, ఫాలోవర్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పూణెకి చెందిన కొందరు.. ఓ యువతి, ఓ అబ్బాయి చేయి సాయంతో కొండపై నుంచి గాలిలో వేలాడిన ఘటన సర్వత్రా చర్చకు దారితీసింది. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటున్నాయి.
మరి వీటిపై మీ ఒపీనియన్ ఏంటి?
సంబంధిత కథనం