తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation : అలాంటివారితో "నా చావు నేను సస్తా.. నీకెందుకు" అనడంలో తప్పేమి లేదు..

Thursday Motivation : అలాంటివారితో "నా చావు నేను సస్తా.. నీకెందుకు" అనడంలో తప్పేమి లేదు..

01 December 2022, 6:30 IST

google News
    • Thursday Motivation : మనకు పుట్టినరోజు వచ్చినప్పుడే కాదు.. రోజు రోజుకి వయసు పెరుగుతూనే ఉంటుంది. వయసు పెరిగే కొద్ది కొన్ని విషయాలపై క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏమి చేయాలి? ఎవరితో ఉండాలి? ఎలాంటివి భరించాలి అనే విషయంపై కూడా కచ్చితంగా క్లారిటీ వస్తుంది.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : కొన్నాళ్లుగా అనాలో.. ఎన్నో ఏళ్లుగా అనాలో తెలియదు కానీ.. ఓ క్లారిటీ అంటూ వచ్చాకా.. అర్థంలేని డ్రామాకి, నకిలీ వ్యక్తుల గురించి ఆలోచించే ఓపిక మనకు ఉండదు. ఎవరివరకో ఎందుకు కొన్నిసార్లు ఇంట్లో వాళ్లు కూడా మనతో అర్థం పర్థంలేని వాదనలకు దిగుతారు. అన్నివాళ్లకే తెలుసు అన్నట్లు.. మనకి ఏమి తెలియదు అన్నట్లు చెప్తారు. మేము చెప్పిన దారిలోనే వెళ్తేనే బాగుపడతావ్.. ఈ సమయంలో ఇలా చేయాలి.. ఆ సమయంలో అలా చేయాలని.. పెద్దరికం పేరుతో ఎన్నో సలహాలు ఇస్తారు. గ్రౌండ్​లో ఉండి ఆడేవాళ్లకే కదా.. అసలైన ప్రెజర్ ఉండేది. స్టేడియంలో కూర్చొన్ని ఈ బాల్ అలా ఆడాల్సింది.. ఆ బాల్ ఇలా పట్టుకోవాలని చెప్తే.. సరిపోతుందా?

పొరపాటున మీరు ఆటలో విన్ అయ్యారా? క్రెడిట్ అంతా వాళ్లే తీసేసుకుంటారు. నేను చెప్పాను కాబట్టే ఇలా ఆడారు. లేకుంటే.. ఓడిపోయేవాడు అని చెప్పుకుంటారు. ఓడిపోతే మాత్రం క్రెడిట్ అంతా మీకే ఇచ్చేస్తారు. రవ్వంత కూడా వాళ్లు తీసుకోరు. నేను చెప్పినట్లు ఆడలేదు కాబట్టే ఈరోజు ఓడిపోయాడు అని కనిపించినప్పుడల్లా క్లాస్ పీకుతారు. చాలామంది ఎలా ఉంటారంటే.. తమకే అన్ని తెలిసినట్లు బిహేవ్ చేస్తారు. అడగకుండానే సలహాలు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే.. వేరే ఊరు వెళ్లి.. కష్టపడి చదివి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నవాడు.. ఖాళీగా సొంత ఊర్లో కనిపిస్తే చాలు.. గేదేలు కాసుకునేవాడు కూడా సలహాలు ఇచ్చేస్తాడు. పాపం వాడు చెప్తేనే కానీ వీడికి జాబ్ చేయాలన్న కోరిక కూడా రాదు అనుకుంటారేమో.

ఇలాంటి పాయింట్ లెస్ సలహాలు, వివాదాల వల్లే చాలా మంది టాలెంట్ ఉన్నా.. ఏదొక చిన్న పని చేసుకుంటూ.. నచ్చిన పని చేయలేకపోయానే అని రోజూ బాధపడుతున్నారు. ఉద్యోగాలు దొరక్క ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ సలహాలు ఇచ్చేవాళ్లు అంతా ఓరోజు ఖాళీ చేసుకుని.. ఎవరికైతే సలహాలు ఇవ్వాలనుకుంటున్నారో.. వాడి లైఫ్​ని దగ్గరుండి చూస్తే అసలు బాధలేంటో వాళ్లకి అర్థమవుతాయి. ఫ్రీగా ఎవరికో సలహాలు ఇవ్వడం సులభమే. కానీ వాళ్ల లైఫ్​ని చూసినప్పుడేగా అసలు సమస్యలేంటో.. చదువున్నా, టాలెంట్ ఉన్నా ఎందుకు జాబ్​లు రావట్లేదో అర్థమయ్యేది.

ఒక్క ఉద్యోగం విషయంలోనే కాదు.. పెళ్లిళ్లంటూ.. పిల్లలంటూ.. వారి చదువులంటూ.. ఇలా ప్రతి విషయంలోనూ పక్కనోడి జీవితంలో వేలు పెట్టేవారు చాలామందే ఉంటారు. పోనీ వీళ్లు మనతోనే ఆగిపోతారా అంటే కాదు. మన పేరెంట్స్ వరకు వెళ్లిపోతారు. వాళ్లకు లేని డౌట్లు వీళ్లే పెంచేస్తారు. నీవల్ల మేము ఇలా అయిపోతున్నామని తల్లిదండ్రులు బాధపడతారు. కానీ నిజానికి ఈ పక్కనుండే వాళ్లు పెట్టిన ప్రెజర్​లకే ఫ్యామిలీలో వాళ్లకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవన్నీ చూసినవాళ్లు.. తట్టుకున్నవాళ్లకి.. ఒక వయసంటూ వచ్చాకా.. ఎవరైనా మంచి చెప్పినా వినాలని అనిపించదు. ఎందుకంటే ఎదుటి వాళ్ల మాట వినాలనే ఆశ కూడా తమలో ఉండదు కాబట్టి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా.. నా జీవితం నా చేతుల్లోనే ఉండాలనే తెగింపు వచ్చేస్తాది.

మీకు ఇలాంటి తెగింపు వస్తే తప్పేమి కాదు. పెద్దగా ఆలోచించకండి. మీరు కరెక్ట్​ అయిన ట్రాక్​లోనే ఉన్నారు. మీకు ఏమి చేయాలో.. ఎలా చేయాలో అనే విషయాలపై క్లారిటీ ఉంది. మీ కాళ్లపై మీరు నిలబడగలరు. మీ తెలివితేటలతో గొప్పవారు కూడా కాగలరు. ఎవరి మాట వినొద్దు.. మనిషి మాట అసలు వినొద్దు అని చెప్పము కానీ.. అర్థం పర్థం లేకుండా మాట్లాడేవారికి దూరంగా ఉండండి. ఇది మీకు, మీ బంగారు భవిష్యత్తుకు చాలా మంచిది. పోనీ మీరు ఎవరికైనా ఇలాంటి ఫ్రీ జ్ఞానం ఇస్తున్నారా? ఇప్పటికైనా వాటిని చెప్పడం ఆపేయండి. మీకు కూడా ఎనర్జీ సేవ్ అవుతుంది.

తదుపరి వ్యాసం