తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Eating: ఆయుర్వేదం ప్రకారం మామిడిపండ్లను తినాల్సిన పద్ధతి ఇది, ఇలా అయితేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది

Mango eating: ఆయుర్వేదం ప్రకారం మామిడిపండ్లను తినాల్సిన పద్ధతి ఇది, ఇలా అయితేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది

Haritha Chappa HT Telugu

11 May 2024, 17:00 IST

google News
    • Mango eating: వేసవిలో మామిడిపండ్లు అధికంగా దొరుకుతాయి. వీటిని ఆయుర్వేదం చెప్పిన ప్రకారం తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మామిడి పండ్లు ఎలా తింటే ఆరోగ్యం?
మామిడి పండ్లు ఎలా తింటే ఆరోగ్యం? (Pixabay)

మామిడి పండ్లు ఎలా తింటే ఆరోగ్యం?

Mango eating: వేసవిలో దొరికే మామిడి పండ్లను ‘పండ్ల రారాజు’గా పిలుస్తారు. వీటి రుచి అదిరిపోతుంది. అంతేకాదు మన శరీరానికి అవసరమైన పోషకాలతో ఇవి నిండి ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం మామిడిపండ్లలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు జీవశక్తిని కూడా అందిస్తాయి. మీరు మామిడి పండును ఇష్టపడే వారైతే అది ఎలా తినాలో కూడా తెలుసుకోవాలి. ఆయుర్వేద సూత్రాల ప్రకారం మామిడిపండును ఎలా తినాలో ఇక్కడ చెబుతున్నాము.

మామిడి పండ్లు ఎలా తింటే ఆరోగ్యం?

ఆయుర్వేదం ప్రకారం మామిడిపండ్లు బాగా పండిన తర్వాతే తినాలి. అది కూడా ఎలాంటి రసాయనాలు కలపకుండా సహజ పద్ధతిలో పండిన పండ్లను తినాలి. జీర్ణక్రియకు, శక్తి స్థాయిలు పెంచటానికి ఉదయం ఖాళీ పొట్టతో ఒక పండిన మామిడిని తినడం చాలా అవసరం. మామిడిపండును పాల ఉత్పత్తుల్లో కలిపి తినడం మానుకోవాలి. కొంతమంది పెరుగులో మామిడిపండును వేసి కలుపుకొని తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని రకాల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పాలు తాగిన వెంటనే మామిడిపండును తినడం లేదా పెరుగుతున్న వెంటనే మామిడిని తినడం చేయవద్దు. మామిడిపండ్లను ఇతర పండ్లతో కలపకుండా కేవలం ఒక్క పండుని తినండి. స్మూతీలు, సలాడ్లలో భాగం చేసుకొని ఇతర పండ్లతో కలిపి మామిడి పండ్లు తినడం మానుకోండి. మామిడి పండ్లు తినేటప్పుడు చాలా ప్రశాంతంగా కూర్చుని దాని రుచిని, సువాసనను ఆస్వాదిస్తూ తింటే మీ మానసిక ఆరోగ్యానికి కూడా ఆ వాసన ఎంతో సహకరిస్తుంది.

మామిడి పండులో విటమిన్ ఈ, బీటా కెరాటిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ రెండు చర్మం లోపల నుండి యవ్వన ఛాయలను మెరుగుపరుస్తాయి. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. అంటే చర్మంపై ముడతలు, గీతలు, మచ్చలు వంటివి రాకుండా కాపాడతాయి. అలాగే మామిడిపండు గుజ్జును ముఖానికి పట్టించడం వల్ల కూడా చర్మం తేమవంతంగా ఉంటుంది. ఇది మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది.

మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు మామిడిపండును రోజూ తింటే ఎంతో మంచిది. దీనిలో మూత్ర విసర్జన గుణాలు ఎక్కువ. అంటే శరీరం నుండి విషాన్ని, వ్యర్ధాలను బయటికి పంపడంలో ఎంతో సహాయపడతాయి. మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.

మామిడి పండ్లు తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ b6 అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే సెనోటోనిన్, డోపమైన్ వంటి ఆనంద హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది .కాబట్టి మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.

ఆయుర్వేదంలో మామిడిపండ్లను చలువ చేసే పండుగా పరిగణిస్తారు. వేసవి నెలల్లో శరీరంలోని వేడిని సమతుల్యం చేయడానికి ఈ మామిడిపండు సహకరిస్తుందని చెబుతారు. మామిడి పండ్లను తినడం లేదా మామిడిపండు రసాన్ని తాగడం వల్ల డీహైడ్రేషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతారు. అయితే తినే ముందు కచ్చితంగా అరగంట పాటు పండును నీళ్లలో నానబెట్టాలి. లేకుంటే వేడి చేసే అవకాశం ఉంది.

మామిడి పండ్లు తినేవారు బరువు త్వరగా తగ్గుతారు. మామిడిపండ్లలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఒక మామిడిపండు తిన్నాక పొట్ట నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. కాబట్టి మీరు ఇతర ఆహార పదార్థాలు తినరు. అలాగే మామిడి పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు పరిమితంగా ఉంటాయి. కాబట్టి ఇది ఆరోగ్యకరమైన పండుగా పరిగణించాలి.

రోగ నిరోధక శక్తిని పెంచడానికి మామిడి పండులోని విటమిన్ సి సహకరిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరంలో చేరిన ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కాబట్టి వేసవికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ ఇతర సీజనల్ వ్యాధులు తట్టుకోవాలంటే మామిడి పండ్లను తింటూ ఉండాలి.

మామిడి పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. మామిడిపండులో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని కూడా నివారిస్తాయి. ఇవి గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మామిడిపండ్లలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కంటిచూపును అందిస్తుంది. వయసు ముదిరిన కొద్ది వచ్చే కంటి జబ్బులను రాకుండా అడ్డుకుంటుంది. విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన చర్మాన్ని మన శరీరాన్ని కాపాడుతూనే ఉంటాయి.

టాపిక్

తదుపరి వ్యాసం