తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Foot Care Tips । చలికాలం పాదాల సంరక్షణ కోసం ఇలా చేయండి!

Winter Foot Care Tips । చలికాలం పాదాల సంరక్షణ కోసం ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu

14 November 2022, 10:35 IST

    • Winter Foot Care Tips: చలికాలంలో పాదాలను ఎలా సంరక్షించుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం, చూడండి. 
Winter Foot Care Tips
Winter Foot Care Tips (Pixabay)

Winter Foot Care Tips

చలికాలం మొదలైందంటే చాలా మంది తమ చర్మం గురించి ఆందోళన చెందుతుంటారు. ఈ సీజన్‌లో తక్కువ తేమ, కఠినమైన చలి గాలులు, పొడి వాతావరణం వంటి పరిస్థితులు చర్మం నుండి తేమను దూరం చేస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది, చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయి. ముఖం, పెదాలు, అరికాళ్లపై పగుళ్లు ఏర్పడతాయి. ఇవి మంట, నొప్పిని కలిగిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చాలా తీవ్రమవుతుంది.

చాలామంది అరికాళ్ల పగుళ్లను తేలికగా తీసుకుంటారు. కానీ ఇది వీలైనంత త్వరగా నయం చేసుకోవాలి. చర్మంపై పగుళ్లు ఉంటే ఆ మార్గం గుండా అనేక హానికర సూక్ష్మ జీవులు శరీరంలోకి ప్రవేశించడానికి ఎంట్రీ పాస్ లభించినట్లే. ఇది అనేక ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. సాధారణంగా కాళ్ల పగుళ్లు తీవ్రమైనపుడు అది సైల్యూలైటిస్ అనే ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. దీంతో కాళ్లలో నీరు చేరి వాపుపెరుగుతుంది, నడవటానికి కష్టమవుతుంది. డాక్టర్లు ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని సర్జరీ చేసి కోసేస్తారు. కాబట్టి చికిత్స కంటే నివారణ ముఖ్యం అని నిపుణులు అంటారు.

Winter Foot Care Tips- చలికాలం పాదాల సంరక్షణ

ఇంట్లో ఉండే హాయిగా ఆయిల్ మసాజ్, మాయిశ్చరైజింగ్ వంటివి చేసుకుంటే చర్మం, పాదాలు మృదువుగా మారతాయి. చలికాలంలో పాదాలను ఎలా సంరక్షించుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం, చూడండి.

పాదాలకు టబ్ బాత్

ఒక టబ్ తీసుకొని అందులో గోరు వెచ్చని నీటిని నింపి. ఆ నీటిలో కొద్దిగా షాంపూ, నిమ్మరసం కలపండి. ఈ నీటిలో మీ పాదాలను 15 నుంచి 20 నిమిషాల పాటు ముంచండి. ఆ తర్వాత క్లీనింగ్ బ్రష్ , ప్యూమిస్ స్టోన్ తో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కాటన్ గుడ్డతో మీ పాదాలను తుడవండి.

ఆయిల్ మసాజ్

మీరు పాదాల పగుళ్లతో ఇబ్బంది పడితే, ప్రభావిత భాగంలో ఆలివ్ నూనెను అప్లై చేసి, మెత్తగా మర్ధన చేయండి. ఈ ఆలివ్ ఆయిల్ చర్మానికి ఆక్సిజన్ సరఫరాను పెంచడంలో, చర్మ కణాలను సజీవం చేయడంలో సహాయపడుతుంది. లేదా గోరువెచ్చని కొబ్బరినూనెతో అయినా పాదాలను మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీకు హాయిగా ఉంటుంది, రాత్రిళ్లు మంచి నిద్రను కూడా కలిగిస్తుంది.

మాయిశ్చరైజేషన్

చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడానికి మీ పాదాలకు సున్నితమైన మాయిశ్చరైజర్ ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల చలికాలంలో చర్మం పొడిబారకుండా, పాదాల పగుళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. అలాగే సమృద్ధిగా నీరు తాగి హైడ్రేటెడ్ గా ఉండాలి.

కాటన్ సాక్స్ ధరించండి

కాటన్ సాక్స్ ధరించడం ద్వారా కఠినమైన వాతావరణం, కాలుష్యం, దుమ్ము నుండి మీ పాదాలను రక్షించుకోండి. కాటన్ సాక్స్ కూడా గాలి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి , అందువల్ల మీ పాదాల నుంచి దుర్వాసన వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.