Sweets Time: ఏ టైమ్‌లో స్వీట్లు తినడం మంచిది కాదు, తీపి పదార్థాలు తినేందుకు ఉత్తమ సమయం ఏది?
15 September 2024, 8:00 IST
- Sweets Time: స్వీట్లంటే ఎంతో మందికి ఇష్టం. కానీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తింటే మాత్రం ఆరోగ్యానికి హాని తప్పదు. ఏ సమయంలో స్వీట్లు తినకూడదో, ఏ సమయంలో తినవచ్చో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి.
స్వీట్లు ఏ సమయంలో తినకూడదు?
తీపి ఆహారాన్ని ఇష్టపడని వారు ఎవరుంటారు. రోజులో ఎన్నో సార్లు స్వీట్లు తినాలన్న కోరిక పుడుతుంది. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. అలా తింటే సమస్యలు తప్పవు. కొంత మందికి భోజనం తిన్న తర్వాత తీపి ఆహారం తినాలన్న కోరికలు ఉంటాయి. కొంతమంది ప్రతి భోజనం తర్వాత రెండు మూడు స్వీట్లు తింటూ ఉంటారు. కానీ అలా భోజనం చేశాక స్వీట్లు తినవచ్చా లేదా అన్నది ఆలోచించరు.
తీపి ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా దీన్ని కొన్ని సమయాల్లో తినడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. మీకు తీపి తినాలన్న కోరికలు ఎక్కువగా ఉంటే, స్వీట్లు తినడానికి సరైన సమయాన్ని తెలుసుకోవాలి. అలాగే స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల జరిగే నష్టాలను తెలుసుకోవాలి.
స్వీట్లు తినడానికి ఉత్తమ సమయం ఏది?
వ్యాయామానికి 30 నిమిషాల ముందు స్వీట్లు తినడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాయామానికి ముందు స్వీట్లు తింటే వెంటనే క్యాలరీలు కరిగిపోతాయని నమ్ముతారు. అలాగే మధ్యాహ్న సమయంలో స్వీట్లు కూడా తినవచ్చు. అయితే భోజనం చేశాక మాత్రం స్వీట్లు తినకూడదు. మధ్యాహ్నం వేళ భోజనం చేసిన రెండు మూడు గంటల సమయం తరువాత స్వీట్లు తినడం మంచిది. దీని వల్ల రక్తంలో చక్కెర పెరుగుదల నెమ్మదిగానే ఉంటుంది. అయితే మధుమేహు రోగులు మాత్రం తినకూడదు.
స్వీట్లు తినడానికి చెత్త సమయం ఏమిటి?
స్వీట్లు తినడానికి రోజులో చెత్త సమయం రాత్రి భోజనం తరువాత సమయం.ముఖ్యంగా పడుకునే ముందు స్వీట్లు తినడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో తినడం వల్ల అదనపు కేలరీలను బర్న్ చేయడానికి మీకు సమయం ఉండదు, ఇది కొవ్వుగా పేరుకుపోవడానికి దారితీస్తుంది.
ఎక్కువ చక్కెర నిండిన స్వీట్లను తినడం వల్ల ప్రజలు ఎక్కువ కేలరీలను శరీరానికి అందిస్తారు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అధిక బరువు ఉండటం వల్ల గుండె సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
డయాబెటిస్ బారిన పడిన వారు మాత్రం స్వీట్లను తినకుండా ఉంటేనే మంచిది. సాధారణ వ్యక్తుల్లో కూడా కూడా స్వీట్లు తిన్నాక రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చు తగ్గులు వస్తాయి. ఇది డీహైడ్రేషన్ సమస్యకు దారి తీస్తుంది. శరీరంలో చేరిన అదనపు గ్లూకోజ్ ను బయటకు పంపేందుకు మూత్రపిండాలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఇలా చక్కెరతో చేసిన స్వీట్లు తినడం వల్ల శరీరంలో ప్రతి అవయవం ఏదో రకంగా ప్రభావితం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు పంచదారతో చేసిన ఆహారాలు తినకపోతేనే మంచిది. పంచదారకు బదులు బెల్లాన్ని వాడడం ఉత్తమం. బెల్లం ద్వారా ఇనుము అందుతుంది. రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.