Green Chicken Recipe । ఆకుపచ్చనివి తింటే ఆరోగ్యకరం.. ఇదిగో గ్రీన్ చికెన్ రెసిపీ!
17 June 2023, 13:16 IST
- Green Chicken Recipe: రెగ్యులర్ గా చేసే కోడికూర కాకుండా, కాస్త కొత్తగా తినాలనుకుంటే ఆకుపచ్చ కోడికూర ట్రై చేయండి. హరియాలీ చికెన్ కర్రీ రెసిపీ ఈ కింద చదవండి.
Green Chicken Recipe
Non-veg Recipes: కోడికూర అంటే చాలా మందికి ఇష్టం, వారంలో ఎన్ని సార్లు తినేందుకైనా ఇష్టపడతారు. అయితే రెగ్యులర్ గా చేసే కోడికూర కాకుండా, కాస్త కొత్తగా తినాలనుకుంటే ఆకుపచ్చ కోడికూర ట్రై చేయండి. దీనినే హరియాలీ చికెన్ లేదా గ్రీన్ చికెన్ అంటారు. ఈ రుచికరమైన వంటకాన్ని తాజా ఆకుకూరలు, సుగంధ మూలికలు, సుగంధ ద్రవ్యాలను కలిపి చేస్తారు. కాబట్టి విభిన్న రుచిని కలిగి ఉంటుంది. ఇలా తినడం చాలా ఆరోగ్యకరం కూడా.
హరియాలీ చికెన్ కర్రీ రెసిపీ చాలా సులభం. కేవలం 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే దీనిని సిద్ధం చేయవచ్చు. ఈ రెసిపీలో ప్రధానమైనది పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలతో పేస్ట్ తయారు చేయడం. ఇదే పేస్ట్‌ను మీరు చికెన్ టిక్కా, కబాబ్‌లు, స్టైర్ ఫ్రై, పులావ్, బిర్యానీ మొదలైన వంటకాలను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. హరియాలీ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ కింద సూచనలను చదవండి.
Hariyali/Green Chicken Recipe కోసం కావలసినవి
- 350 గ్రాముల చికెన్
- 1/2 కప్పు పాలకూర
- 1 కప్పు కొత్తిమీర
- 1/2 కప్పు పుదీనా
- 4 పచ్చిమిర్చి
- 1/2 కప్పు జీడిపప్పు
- 1/2 కప్పు పెరుగు
- 1/4 కప్పు తాజా క్రీమ్
- 1 ఉల్లిపాయ
- 1 అంగుళం అల్లం
- 5 వెల్లుల్లి రెబ్బలు
- 1 స్పూన్ ధనియాల పొడి
- 1 స్పూన్ కారం పొడి
- 1/2 tsp జీలకర్ర పొడి
- 1/2 స్పూన్ గరం మసాలా
- 1/2 టీస్పూన్ పసుపు
- 1 టేబుల్ స్పూన్ నెయ్యి
- ఉప్పు రుచికి తగినంత
- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
హరియాలీ చికెన్ ఎలా తయారు చేయాలి
- ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. ఆపై దీనిని ఒక గిన్నెలో తీసుకొని కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపండి, 30 నిమిషాల పాటు మారినేట్ కోసం పక్కన పెట్టండి.
- ఇప్పుడు గ్రీన్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీని కోసం బ్లెండర్ జార్ లో పాలకూర, కొత్తిమీర ఆకులు, పుదీనా, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం, గరం మసాలా, పసుపు వేసి, అలాగే కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి.
- ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేడి చేయండి. ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆపై సిద్ధం చేసిన గ్రీన్ పేస్ట్ వేసి సుమారు 2-3 నిమిషాలు ఉడికించాలి.
- తర్వాత అందులో మారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. మూతపెట్టి 15-20 నిమిషాలు ఉడికించండి.
- పూర్తయిన తర్వాత, అందులో ఫ్రెష్ క్రీమ్ పోసి అన్నింటినీ బాగా కలపాలి. మరో 5 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
అంతే, హరియాలీ చికెన్ రెడీ. దీనిని ప్లెయిన్ రైస్, జీరా రైస్, రోటీ లేదా ఘీ రైస్‌తో తింటే కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది.