Pepper Chicken Gravy Recipe । ఈ కోడికూర దగ్గు, జలుబు నయం చేసే ఔషధం!
11 May 2023, 19:33 IST
- Pepper Chicken Gravy Recipe: దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారా? అయితే పెప్పర్ చికెన్ గ్రేవీని తినండి, దెబ్బకు మీ అనారోగ్యం మాయమవడం ఖాయం. రెసిపీ ఇక్కడ చూడండి.
Pepper Chicken Gravy
Recipe of the day: ఈరోజుల్లో ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు వర్షాలు. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా మంది జబ్బు పడుతున్నారు. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ జ్వరాలు ఎక్కువగా వేధిస్తున్నాయి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడేవారు చాలామందే ఉన్నారు. ఈ జాబితాలో మీరు కూడా ఉంటే ఇక్కడ మీకో ఔషధం ఉంది. అది మరేమిటో కాదు, కమ్మటి కోడికూర.
స్పైసీ బ్లాక్ పెప్పర్ చికెన్ గ్రేవీ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఈ స్పైసీ చికెన్ కర్రీ రుచి చాలా రుచికరమైనదే కాదు.. జలుబు, దగ్గు, శరీర నొప్పులను కచ్చితంగా తగ్గించగల మందు (Cold and Cough Remedy). దీనిని మీరు రోటీ, రైస్ లేదా ఇడ్లీ, దోశ దేనితో అయినా తినొచ్చు. ఈ కోడికూరను ఎలా చేయాలో ఇక్కడ సూచనలు చదవండి.
Pepper Chicken Gravy Recipe కోసం కావలసినవి
- చికెన్ - 500 గ్రాములు
- కొబ్బరి నూనె - ¼ కప్పు
- బిరియానీ ఆకు - 1
- ఉల్లిపాయలు - 2 పెద్దవి
- పచ్చిమిర్చి - 2 ముక్కలు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
- టొమాటోలు - 2
- పసుపు పొడి - 1 tsp
- మిరియాల పొడి - 2 tsp
- గరం మసాలా పౌడర్ - 2 స్పూన్
- రుచికి తగినంత ఉప్పు
- గార్నిషింగ్ కోసం కొత్తిమీర ఆకులు
గ్రైండింగ్ కోసం..
- నూనె - 1 స్పూన్
- సోంప్ - 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క - 1 కర్ర
- నల్ల మిరియాలు - 1 టేబుల్ స్పూన్
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ - 1 పెద్దది
పెప్పర్ చికెన్ గ్రేవీ తయారీ విధానం
- ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి , ప్రెషర్ కుక్కర్లో వేసి, కొన్ని నీళ్లు , కొద్దిగా ఉప్పు వేసి 2 నుండి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించి పక్కనపెట్టండి.
- ఆ తర్వాత ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. గ్రైండింంగ్ కోసం సూచించిన మసాలా దినుసులు వేసి వాటిని రోస్ట్ చేయండి. ఆపైన బ్లెండర్‌లో మిక్స్ చేయండి.
- ఇప్పుడు ఒక పాన్ మీద కొద్దిగా నూనెపోసి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆపైన వేయించిన ఉల్లిని, మసాలా దినుసులతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు ఒక కుండలో నూనె వేడి చేసి, అందులో ఉల్లిపాయలు, మిరపకాయలు, బిరియానీ ఆకు వేసి వేయించాలి, పైనుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి.
- ఇప్పుడు టొమాటోలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోని వేయండి, మెత్తగా ఉడికించాలి. ఆపైన గ్రౌండ్ మసాలా వేసి బాగా కలపాలి.
- ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి నూనె విడిపోయే వరకు ఉడికించాలి. చికెన్ కూడా వేసి కలపాలి, నూనె విడిపోయే వరకు మూతపెట్టి ఉడికించండి. గ్రేవీ కోసం అవసరం మేర నీరు పోసుకొని ఉడికించండి.
చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయండి. అంతే పెప్పర్ చికెన్ గ్రేవీ రెడీ.