తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips: పిల్లల ముందు ఇంట్లో నోరుజారితే, మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త!

Parenting Tips: పిల్లల ముందు ఇంట్లో నోరుజారితే, మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త!

Galeti Rajendra HT Telugu

27 October 2024, 16:30 IST

google News
  • పిల్లల ముందు ఏ విషయం మాట్లాడాలి..? ఏ విషయం మాట్లాడుకోకూడదు? అనేది ఇప్పటికీ కొంత మంది తల్లిదండ్రులకి తెలియదు. అనాలోచితంగా, అసహనంలో పిల్లల ముందే నోరు జారుతుంటారు. 

పిల్లల ముందు నోరుజారొద్దు
పిల్లల ముందు నోరుజారొద్దు (PC: Canva)

పిల్లల ముందు నోరుజారొద్దు

ఇంట్లో తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి సహనం కోల్పోయి లేదా అనాలోచితంగా పెద్దలు నోరు జారితే అవి పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. చాలాసార్లు తెలిసో తెలియకో తల్లిదండ్రులు తమ పిల్లల ముందు చెడుగా ప్రవర్తిస్తుంటారు. పేరెంట్స్ చేసే పనులు, వారి మాటలు, ప్రవర్తనలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

పర్సనల్ విషయాలు గోప్యంగా

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ముందే పర్సనల్ విషయాల్ని బహిరంగంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలకి అన్ని విషయాల్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదు. కాబట్టి.. వారి ముందు వ్యక్తిగత విషయాలను చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ కష్టాలు, బాధలు పిల్లలు వింటే వాళ్లు అయోమయానికి గురవుతారు లేదా కలత చెందే ప్రమాదం ఉంది.

వాదించుకోవద్దు.. చేయి చేసుకోవద్దు

ఇంట్లో తల్లిదండ్రులు వాదనలు వింటే పిల్లలు సాధారణంగా భయపడతారు. కొంత మంది వాదన సమయంలో సహనం కోల్పోయి భాగస్వామిపై చేయి చేసుకుంటూ ఉంటారు. ఇది మీ పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మీ పిల్లలు మీ ప్రవర్తనను కాపీ కొట్టే అవకాశం ఉంది. స్నేహితులతోనే కాదు మీతోనూ వారు వాదనలకి దిగొచ్చు. కొట్టడం, తిట్టుకోవడం, వాదించుకోవడం తప్పు కాదేమో అని వారు భ్రమపడే ప్రమాదం ఉంది. కాబట్టి పేరెంట్స్ హుందాగా వ్యవహరించాలి.

చులకన చేస్తే గౌరవం పోతుంది

సాధారణంగా ఇంట్లో ఒకరిపై మరొకరు తరచూ విమర్శలు చేసుకోవడం సహజం. కానీ పిల్లల ముందు చులకన చేస్తూ భాగస్వామిని విమర్శించడం తప్పు. ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడటం లేదా చెప్పడం చేస్తే.. మీ పిల్లలపై మీకు ఉన్న గౌరవం పోతుంది. వారు కూడా మీ మాటలతో ప్రభావితమై.. నెగటివ్‌గా చెప్పడాన్ని అలవాటు చేసుకుంటారు.

ప్రేమని చూపించండి

ఇంట్లో మీ పిల్లల ముందు మీ భాగస్వామితో ప్రేమగా వ్యవహరించండి. అది మీ ఇంటి వాతావరణాన్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది. పిల్లలు కూడా మీతో అంతే ప్రేమగా వ్యవహరిస్తూ అనురాగాన్ని పంచుతారు. అలా కాకుండా మీ భాగస్వామి పట్ల అనుచితంగా, చిరాకు వ్యక్తం చేసినట్లు ప్రవర్తిస్తే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు.

బంధువుల గురించి జాగ్రత్త

మన పిల్లలే కదా అనే భ్రమలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ముందే తమ బంధువుల గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే.. ఆ బంధువులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ పిల్లలు వారి పట్ల గౌరవంగా వ్యవహరించరు. ఒకవేళ కారణం మీ బంధువులకి తెలిస్తే మీ బంధం దెబ్బతింటుంది. బంధువులు అందరూ ఇంతేనా? అనే భావన పిల్లల్లో కలిగితే చాలా ప్రమాదం కాబట్టి వారి ముందు జాగ్రత్తగా మాట్లాడాలి.

భయం, కంగారు చూపించొద్దు

పేరెంట్స్ చాలా ధైర్యవంతులు, బలమైన వారు అనే ఫీలింగ్‌లో పిల్లలు ఉంటారు. ఒకవేళ మీరు పిల్లల ముందు అధైర్యపడినా లేదా కంగారుపడినట్లు కనిపించినా వాళ్లలో అయోమయం మొదలవుతుంది. మిమ్మల్ని చూసి పిల్లలు భయపడ్డారంటే.. వాళ్లకి అది ఫోబియాగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి.. విషయం ఏదైనా.. మీరు పిల్లలు ముందు కంగారుపడొద్దు.

పిల్లలు అర్థం చేసుకునే విషయం అయితే.. వాళ్లకి అర్థమయ్యేలా వివరించి చెప్పండి. ఒకవేళ వాళ్లు అర్థం చేసుకోలేరు అనిపిస్తే ఆ విషయాన్ని దాచేయండి. అంతేతప్ప.. భాగస్వామి ముందు దాని గురించి చర్చించి పిల్లల్లో లేనిపోని అనుమానాలు, భయాల్ని రేకెత్తించొద్దండి.

టాపిక్

తదుపరి వ్యాసం