Parenting tips: బెస్ట్ పేరెంట్స్ అవ్వాలని ఉందా? మీరు చేయాల్సినవి ఇవే
Parenting tips : మీ పిల్లలను సరిగ్గా తీర్చిదిద్దాలని ఉందా? అయితే ఉత్తమ తల్లిదండ్రులుగా మీరుండాలంటే కొన్ని పనులు తప్పకుండా చేయాలి. అవి మీ పిల్లల్లో సానుకూలతను పెంచుతాయి.
పిల్లల్ని పెంచడం అంటే ఆషామాషీ విషయం కాదు. పిల్లల్లో రకరకాల ప్రవర్తనలు కలిగిన వారు ఉంటారు. వారి తీరును అర్థం చేసుకుని వారికి సున్నితంగా అన్నింటినీ చెప్పడం అంటే కత్తిమీద సామే. అలాంటి సమయాల్లోనే తల్లిదండ్రుల్లో సహనం నశించిపోతూ ఉంటుంది. వారిపై అస్తమానం అరవడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.
ఇలాంటి పనుల వల్ల పిల్లల్లో అలాగే వ్యవహరించాలేమో అన్న భావన స్థిరపడిపోతుంది. దీంతో వారూ కఠినంగా ఉండేందుకు, ఇతరులను ఇబ్బంది పెట్టేందుకూ ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం వారితో ఎంత మంచిగా ఉన్నాం అన్నదాన్ని బట్టి భవిష్యత్తులో వారి ప్రవర్తన ఉంటుంది. ఆనందకరమైన పేరెంటింగ్ చిట్కాలను సూచిస్తున్నారు.
* రోజులో ఓ గంటసేపైనా పిల్లలతో క్వాలిటీ టైంని వెచ్చించడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో వారు సానుకూల దృక్ఫథంతో ఉండేలా సలహాలు ఇవ్వండి.
* పిల్లలకు మనమే రోల్ మోడల్. మనం ఎలా ఉంటే వారు అలా ఉంటారు. కాబట్టి వారికి ఉదాహరణగా నిలిచే మంచి ప్రవర్తనను కలిగి ఉండండి.
* చిన్న చిన్న విషయాలను నేర్చుకున్నా.. పిల్లలను పెద్దగా ప్రశంసించండి. మెచ్చుకోవడం అనేది వారికి ఎంతో బలాన్ని ఇస్తుంది. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది.
* ఎవరి నుంచి సహాయం తీసుకున్నా కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేయండి. అలాగే అందరికీ సాయం చేయడాన్ని నేర్పించండి.
* మధ్యాహ్నం పూట ఎలాగూ అంతా స్కూళ్లలో, ఆఫీసుల్లో ఉంటారు. కానీ సాయంత్రం పూట మాత్రం కచ్చితంగా కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేయండి. దీని వల్ల కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. అలాగే తినేప్పుడు ఆహారంలో ఉండే పోషక విలువలు, విటమిన్లు, మినరళ్ల గురించి వారికి కొద్ది కొద్దిగా చెబుతూ ఉండండి. దీంతో ఆహారంపై వారికీ అవగాహన వస్తుంది. ఏం తింటే ఏం వస్తుంది? అనేదాన్ని వారూ అర్థం చేసుకుంటారు.
* పిల్లలకు కంప్యూటర్లు, ట్యాబ్స్, ఫోన్లలో ఆటను కాకుండా, శారీరక శ్రమ కలిగించే ఆటలు ఆడటాన్ని ప్రోత్సహించండి. అలాంటి వాతావరణాన్ని కలిగించండి.
* మిగిలిన పిల్లలతో చక్కగా మాట్లాడటం, పెద్దవారితో మర్యాదపూర్వకంగా మాట్లాడటం లాంటి వాటిని కొద్ది కొద్దిగా చెబుతూ ఉండండి. అన్నీ ఒక్కసారే వచ్చేయాలని అనుకోకండి. వారు క్రమ క్రమంగా అన్నింటినీ నేర్చుకుంటారని గుర్తుంచుకోండి.
* వారితో చాలా సున్నితంగా, ప్రేమ పూర్వకంగా, అర్థమయ్యే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. కసురుకోవడం, విసుక్కోవడం చేయకండి. నీకేం రాదు, నీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావడం లేదు, నీది మట్టి బుర్ర... లాంటి నెగిటివ్ మాటల్ని వారి దగ్గర అనకండి. ఎప్పుడూ... నువ్వు మంచి వాడివి, నువ్వు అన్నీ చాలా బాగా నేర్చుకుంటావు, నువ్వు తెలివైనవాడివి... లాంటి ప్రయోగాలనే ఉపయోగించండి. ఇవన్నీ చేయడం వల్ల మీ పిల్లలు చాలా మంచి పౌరులుగా ఎదుగుతారు.
టాపిక్