Avoid foods with Curd: పెరుగుతో కలిపి ఈ పదార్థాలను తినకూడదు, తెలియక తినేస్తున్నాం
11 September 2024, 17:30 IST
- Avoid foods with Curd: పెరుగు తిననిదే ఆరోజు భోజనం పూర్తికాదు. కచ్చితంగా భోజనం చివర్లో పెరుగుతో తింటేనే సంపూర్ణ భోజనం చేసినట్టు. పెరుగుతో తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి.
పెరుగుతో కలిపి వీటిని తినకూడదు
Avoid foods with Curd: తెలుగిళ్లల్లో భోజనం అంటే పప్పు, కూర, చారు, చివర్లో పెరుగు ఉండాల్సిందే. చివరలో ఓ రెండు ముద్దలు పెరుగన్నం తింటేనే పొట్టకు ప్రశాంతంగా ఉంటుంది. భారతీయ వంటకాలలో పెరుగుకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆరోగ్యానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోబయోటిక్ లక్షణాలు ఎన్నో ఉంటాయి. అయితే పెరుగుతో కలిపి తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. కానీ మనకు తెలియక వాటిని తినేస్తున్నాం. మనకు తెలియకుండానే కొన్నిసార్లు అనారోగ్యాల బారిన పడుతున్నాం.
పుల్లని పండ్లు
నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీలు, కివి వంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే అవి పుల్లగా ఉంటాయి. అయితే చాలామందికి తెలియక ఆ పండ్ల ముక్కలను పెరుగులో వేసుకుని చక్కగా తింటున్నారు. అలా తినడం అనేది బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్. ఇది జీర్ణ అసౌకర్యానికి దారితీస్తుంది. పెరుగులో క్యాల్షియం ఉంటుంది. ఆ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఈ రెండూ కూడా ఒకదానికొకటి సరిపడవు. కాల్షియాన్ని శరీరం శోషించుకోకుండా విటమిన్ సి అడ్డుకునే అవకాశం ఎక్కువ.
కొవ్వు పదార్థాలు
నూనెలో వేయించిన ఆహారాలలో కొవ్వు అధికంగా ఉంటుంది. వాటిని పెరుగులో ముంచుకొని తినేవారు ఎక్కువ. ఈ పద్ధతి ఏ మాత్రం మంచిది కాదు. అధిక కొవ్వు పదార్ధం పొట్టను త్వరగా నింపేస్తుంది. ఆ సమయంలో పెరుగును కూడా తినడం వల్ల అది కడుపు ఉబ్బరానికి, అజీర్ణానికి కారణం అవుతుంది. కాబట్టి కొవ్వు అధికంగా ఉండే, ఆయిల్ నిండిన ఆహారాలను తిన్నప్పుడు పెరుగును తినకండి.
స్నాక్స్
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఉప్పు వేసి వేయించిన నట్స్ వంటి సాల్టీ స్నాక్స్ ను పెరుగుతో పాటు తినకూడదు. ఇది కూడా జీర్ణవ్యవస్థలో అసౌకర్యానికి దారితీస్తుంది. ఈ స్నాక్స్ లో అధిక సోడియం కంటెంట్ ఉంటుంది. ఇది శరీరంలో నీటిని నిలిచిపోయేలా చేస్తుంది. ఇది కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. అదనంగా పెరుగులోని ప్రోబయోటిక్స్ కూడా శరీరంలో చేరితే నీరు నిలుపుదల మరింతగా పెరిగిపోతుంది. కాబట్టి సాల్టీ స్నాక్స్ పెరుగుతో పాటు తినటం మంచిది కాదు. అలాగే పెరుగులో ఉప్పు వేసుకుని తినడం కూడా మంచి పద్ధతి కాదు.
టీ లేదా కాఫీ
ఎంతోమందికి భోజనం చేశాక టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. పెరుగన్నం తిన్నాక ఒక రెండు గంటల పాటు టీ లేదా కాఫీ తాగకూడదు. ఇది జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. టీ లో లేదా కాఫీలో ట్యానిన్లు, కెఫీన్లు ఉంటాయి. ఇవి పెరుగులో ఉన్న పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటాయి. పొట్టలో పీహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీనివల్ల పెరుగులోని ప్రోబయోటిక్స్ శరీరానికి అందవు.
స్పైసీ ఫుడ్స్
స్పైసీ ఫుడ్స్ తినేటప్పుడు ఆ కారాన్ని తగ్గించుకోవడం కోసం పెరుగును తింటూ ఉంటారు. ఇది చాలా తప్పు పద్ధతి. ఇలా స్పైసీ ఫుడ్స్ తో పాటు పెరుగును తినడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా చికాకు కలుగుతుంది. దీనివల్ల యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ వంటి పరిస్థితులు తీవ్రంగా మారుతాయి. పొట్టలో యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోతుంది. పెరుగుతో ఆ యాసిడ్లు విభేదిస్తాయి. దీనివల్ల గుండెల్లో మంట మొదలవుతుంది. కాబట్టి స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు పెరుగును దూరంగా పెట్టండి.
తియ్యటి ఆహారాలు
కొన్ని రకాల డిజర్ట్‌లు చక్కెరతో తయారు చేస్తాము. అలా చక్కెరతో చేసిన ఏ పదార్థం తిన్నాక అయినా పెరుగును తినకూడదు. అలాగే చక్కెరతో చేసిన పదార్థాలతో పాటు పెరుగును తినడం చాలా ప్రమాదం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగేలా చేస్తాయి. ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచేస్తాయి. చక్కెర కంటెంట్ పొట్టలోని మంచి బ్యాక్టీరియా అసమతుల్యతను కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో పెరుగు పొట్టలో చేరడం వల్ల అందులో ఉండే ప్రోబయోటిక్ ప్రయోజనాలను పేగులు తీసుకోవు. కాబట్టి చక్కెర, పెరుగు కలయిక అనేది మంచిది కాదు. అవి త్వరగా బరువును కూడా పెంచేస్తుంది.
టాపిక్