Unhealthy Food Combos । ఇవి అనారోగ్యకరమైన ఆహార కలయికలు.. ఇలా తింటే నష్టమే!
10 January 2023, 21:16 IST
- Unhealthy Food Combos: కొన్ని ఆహార కలయికలు అనారోగ్యకరమైనవి, వాటిని కలిపి తింటే నష్టమే తప్ప, ఎలాంటి ప్రయోజనం ఉండదు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
Unhealthy Food Combos
Unhealthy Food Combos: మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కొన్ని రకాల ఆహార పదార్థాలను, వేరే పదార్థాలతో కలిపి తీసుకోకూడదు అని. ఉదాహారణకు చేపల కూరతో పాటుగా పెరుగు తినకూడదని చెబుతారు. ఒక్క పెరుగే కాదు పాలు, మజ్జిగ, తేనె, మినపపప్పు, మొలకెత్తిన ధాన్యాలు కూడా చేపలతో తినకూడదు. ఇలా తింటే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇలాగే మరికొన్ని ఆహార కలయికలు ఉన్నాయి. అవి జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి, కడుపు pH ను దెబ్బతీస్తాయి. కానీ చాలా మంది ఇది తెలియక అలాగే తినడం కొనసాగిస్తున్నారు. అలా తిన్నరోజు వారికి కడుపులో అసౌకర్యం ఉంటుంది, కానీ అలా ఎందుకు జరిగిందో కారణం తెలియకపోవచ్చు.
ఈ రోజుల్లో మనం ఎక్కువగా తింటున్న, తాగుతున్న అలాంటి కొన్ని చెడు ఫుడ్ కాంబినేషన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. మీరు అలా తింటున్న వారైతే వెంటనే ఆ అలవాటును మానుకోవడం మంచిది.
పాలకూరతో కాఫీ, టీలు
చాలా మంది ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ సమయంలో పాలకూర చపాతీలు లేదా పాలక్ పరాఠా తింటూ కాఫీ, టీలు తాగుతుండవచ్చు. కానీ ఇది మంచి కాంబినేషన్ కాకపోవచ్చు. ఎందుకంటే పాలకూర ఐరన్ అధికంగా ఉండే ఆహారం. టీ- కాఫీల లోని పాలీఫెనాల్స్, టానిన్లు, కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్స్ ఐరన్ శోషణను తగ్గిస్తుంది. దీని వల్ల ఆహారం తీసుకున్నా ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా ఈ కలయిక గ్యాస్ట్రిక్ సమస్యలను ప్రేరేపిస్తుంది.
బ్రెడ్ - జామ్
బ్రెడ్- జామ్ అనేది పాపులర్ బ్రేక్ ఫాస్ట్ కాంబినేషన్. తినడానికి ఏమి లేనపుడు లేదా సమయం లేనపుడు. బ్రెడ్ ముక్కలపై జామ్ రాసుకొని బ్రేక్ ఫాస్ట్ చేసేస్తారు. కానీ, అది శరీరానికి హానికరం. ఎందుకంటే బ్రెడ్‌లో ప్రోటీన్, కొవ్వు తక్కువగా ఉంటుంది. సాధారణ పిండి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. జామ్‌లో చక్కెర అధికంగా ఉంటుంది, ఇది వెంటనే శక్తిని ఇస్తుంది. అంటే ఈ రెండూ తింటే కొంత కాలం వరకు కోరికలు తీరినట్లే. కానీ ఒక గంట తర్వాత తీవ్రంగా ఆకలిని కలిగిస్తుంది. అలాగే, రక్తంలో చక్కెరను పెంచుతుంది, జీవక్రియను నెమ్మదిస్తుంది, కడుపు సమస్యలను కలిగిస్తుంది.
పిజ్జాతో కూల్ డ్రింక్స్
పిజ్జాతో పాటు సోడా, కోక్ లేదా ఏ రకమైన శీతల పానీయాలు తాగడం మంచిది కాదు. పిజ్జాలో సంతృప్త కొవ్వు ఉంటుంది, సోడా ఉప్పుతో నిండి ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను దెబ్బతీస్తుంది, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా, మన జీర్ణవ్యవస్థ పిజ్జాను జీర్ణం చేయడానికి కష్టపడుతుంది, ఇది ఉబ్బరం, ఇతర కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
పాలతో సిట్రస్ పండ్లు
పాలు తాగటం మంచిదే, పండ్లు తీసుకోవడం ఆరోగ్యకరమే. రోగనిరోధక శక్తికి సిట్రస్ పండ్లు చాలా మంచివి. కానీ ఈ పాలు- పండ్ల కలయిక ఏమాత్రం మంచిది కాదు. ఇలా కొంతమంది స్మూతీస్ తాగడానికి ఇష్టపడతారు. కానీ ఈ కాంబినేషన్ మీ పొట్టను కలవరపెడుతుంది. ఇది అజీర్ణానికి కారణమవుతుంది.