Google 2024: 2024లో భారతీయులు గూగుల్ లో సెర్చ్ చేసిన టాప్ 10 వంటకాలు ఇవే
13 December 2024, 9:30 IST
- Google 2024: ప్రతి సంవత్సరం చివరిలో గూగుల్ ఏ కేటగిరీలో వేటి గురించి ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేశారో ఆ జాబితాను విడుదల చేస్తుంది. 2024 లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన వంటకాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ వంటకాల రెసిపీల కోసం ఇండియన్స్ వెతికారట.
గూగుల్ లో అధికంగా వెతికిన రెసిపీలు
భారతీయులు ఆహార ప్రియులు. మన దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వేలాది వంటకాలను టేస్టీగా వండుకుంటారు. అలాగే వారు కొత్త వంటకాలు నేర్చుకునేందుకు కూడా ప్రయత్నిస్తారు. అలాగే వింతైన వంటకాల గురించి, విదేశీ వంటకాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా 2024లో గూగుల్ మనవాళ్లు ఏ వంటకాల రెసిపీలను అధికంగా శోధించారో ఓ జాబితాను విడుదల చేసింది. అందులో మన వంటకాలతో పాటూ విదేశీ వంటకాలు కూడా ఎన్నో ఉన్నాయి.
పోర్న్‌స్టార్ మార్టిని
లండన్ ల్యాబ్ బార్ కోసం ఈ పానీయాన్ని ప్రత్యేకంగా తయారుచేశారు. భారతీయులు వెతికిన ఆహార వంటకాల జాబితాలో ఈ కాక్ టెయిల్ అగ్రస్థానంలో ఉంది. దీనిని వెనిల్లా, వోడ్కా, ఫ్రూట్ లిక్కర్, వెనీలా షుగర్ కలిపి తయారుచేస్తారు. దీన్ని మొదట 1999 లో తయారు చేశారు.
మామిడికాయ పచ్చడి
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మామిడి ఊరగాయ గురించి ఈ సంవత్సరం ఎక్కువగా శోధించారు. ఊరగాయలు లేకుండా భారతీయ భోజనం పూర్తి కాదు. చాలా మందికి ఇష్టమైన మామిడి ఊరగాయ ఈ సంవత్సరం టాప్ సెర్చ్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.haritha
ధనియా పంజిరి
పంజిరి అనేక విధాలుగా తయారుచేసే వంటకం. శీతాకాలంలో దీనిని ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఆయుర్వేదంలో 'పంచ' అంటే ఐదు, 'జిరాకా' అంటే మూలికా పదార్థాలు అని అర్థం. ధనియా పంజిరీని సాధారణంగా జన్మాష్టమి ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది ధనియాలు, బెల్లం, నెయ్యి, నట్స్ కలిపి దీన్ని తయారుచేస్తారు.
ఉగాది పచ్చడి
ఉగాది పండుగకు చేసే ప్రత్యేక వంటకం ఉగాది పచ్చడి. 2024లో గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన రెసిపీలలో ఇది ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో తయారవుతుంది. దీనిని మామిడి, చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి, చేదు వేపతో తయారుచేస్తారు.
పంచామృతం
పంచామృతాన్ని హిందూ దేవతలకు నైవేద్యంగా పెడతారు. అలాగే సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. దీనిలో తేనె, నెయ్యి, పాలు, పెరుగు, అరటి పండు కలిపి చేస్తారు. పంచామృతానికి ఆయుర్వేదంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఈమా దత్షి
ఇది ప్రత్యేకమైన భూటాన్ వంటకం. భారతీయులు ఈ రెసిపీ గురించి ఎక్కువగానే వెతికారు. బాలీవుడ్ నటులు ఈ వంటకాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ వంటకం భూటాన్ జాతీయ వంటకంగా పేరు తెచ్చుకుంది. బంగాళాదుంపలు, పచ్చిమిర్చి కలిపి చేసే వంటకం ఇది.
ఫ్లాట్ వైట్
ఇది ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ కు చెందిన కాఫీ. కేపుచినో లాగా కనిపించే ఈ కాఫీ దానికి కాస్త భిన్నంగా ఉంటుంది.
కంజీ
ఇది కూడా భారతీయ సంతతికి చెందిన పానీయం. దీనిని ఎక్కువగా హోలీ సమయంలో తయారుచేస్తారు. దీనిని నీరు, నల్ల క్యారెట్లు, బీట్ రూట్, ఆవాలు కలిపి చేస్తారు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
శంకరపోలి
శంకరపోలిని మైదా పిండితో తయారు చేస్తారు. ఇది ఒక క్రంచీ స్నాక్స్. సాయంత్రం పూట తినేందుకు బావుంటుంది. ఇది కూడా భారతీయులు ఎక్కువగా వెతికిన వంటకాల జాబితాలో చేరింది. ఇది భారతదేశంలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాలలో వివిధ రుచులలో తయారుచేసే వంటకం. ఇది తీపి, కారం, ఉప్పగా ఉండే రుచిని కలిగి ఉంటుంది.
చామంతి
ఇది కొబ్బరి తురుముతో చేసిన వంటకం. తెలుగులో కొబ్బరి కారం పొడి అనుకోవనచ్చు. ఇది చట్నీ పొడి లాగా ఉంటుంది. ఇది తురిమిన కొబ్బరి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు, ఉప్పు కలిపి నీరు లేకుండా గ్రైండ్ చేసే వంటకం. ఇది కర్ణాటక తీర ప్రాంతాల్లో కూడా తయారు చేస్తారు. అన్నంతో తింటే బాగుంటుంది.
ఇది కూడా చదవండి:
టాపిక్