Protein deficiency: ప్రొటీన్ లోపంతో ఈ వ్యాధులొస్తాయంటే ఊహించలేరు, గుర్తించి ఆహారం మారిస్తే చాలు
16 September 2024, 6:30 IST
Protein deficiency symptoms: ప్రొటీన్ లోపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య వల్ల శరీరంలో మీరు ఊహించని వ్యాధులు రావచ్చు. కొన్నింటికి ప్రొటీన్ లోపం కారణం అని కూడా తెలీదు. అలాంటి సమస్యలేంటో చూడండి.
ప్రొటీన్ లోపం లక్షణాలు
శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే కొన్ని లక్షణాలు, ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తించాలి. ఆహారంలో మీ శరీరానికి సరిపడా ప్రొటీన్ చేర్చుకుంటే ఈ వ్యాధుల నుంచి బయటపడొచ్చు. ప్రోటీన్ లోపం వల్ల కనిపించే లక్షణాలు, దాని వల్ల వచ్చే వ్యాధులు ఏంటో తెలుసుకోండి.
ఫ్యాటీ లివర్
ఫ్యాటీ లివర్ ప్రోటీన్ లోపాన్ని సూచిస్తుంది. ఈ వ్యాధిలో కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. పేగుల్లో ఉండే బ్యాక్టీరియా, కణాలలో మార్పుల కారణంగా లిపో ప్రొటీన్లు లేదా కొవ్వును రవాణా చేసే ప్రోటీన్లు సరిగా పనిచేయవని పరిశోధనలో తేలింది. దీనివల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ప్రొటీన్ లోపం వల్లే ఈ సమస్య మొదలవుతుంది.
వాపు
ప్రోటీన్ లోపం వల్ల, చర్మంలో వాపు వస్తుంది. దీనిని ఎడెమా అని కూడా అంటారు. కొన్నిసార్లు మహిళల్లో చేతులు, కాళ్ల వాపు కనిపిస్తుంది. శరీర కణజాలంలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. రక్తం ప్లాస్మాలో ఉండే ప్రోటీన్ అయిన అల్బుమిన్ తక్కువ మొత్తంలో ఉండటమే దీనికి కారణం. ఆల్బూమిన్ రక్త నాళాల నుంచి ద్రవాలు బయటకు పోకుండా కాపాడుతుంది. ఈ ప్రొటీన్ తగ్గినప్పుడు కణజాలాల్లోకి ద్రవాలు చేరి పాదాలు, మోకాళ్లు, చేతుల్లో వాపు కనిపిస్తుంది.
చర్మం, జుట్టు
ప్రోటీన్ లేకపోవడం వల్ల చర్మం, జుట్టు, గోళ్లలో సమస్యలు మొదలవుతాయి. ప్రోటీన్ లేకపోవడం వల్ల, జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. వాటి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. చర్మం పొడిబారడం, పొరలుగా చర్మం ఊడటం, మచ్చలు, ఎరుపు, మచ్చలు వంటివన్నీ ప్రోటీన్ లోపాన్ని సూచిస్తాయి.
బలహీనత
శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు, శరీరం కండరాల నుండి ప్రోటీన్ తీసుకోవడం ప్రారంభిస్తుంది. దీనివల్ల సన్నబడటంతో పాటూ, బలహీనత ఏర్పడుతుంది. శక్తి కావాలంటే శరీరంలో ప్రోటీన్ పరిమాణం తగినంతగా ఉండాలి.
ఎముకల ఆరోగ్యం
ప్రోటీన్ లేకపోవడం వల్ల, ఎముకలలో బలహీనత ఉంటుంది. దీంతో సులువుగా ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. 2021 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ తీసుకునే వ్యక్తుల్లో తక్కువ ప్రోటీన్ తినే వారి కంటే తుంటి, వెన్నెముకలో సాంద్రత 6 శాతం ఎక్కువగా ఉందని తేలింది. అంటే వారి ఎముకలు సులభంగా విరిగే అవకాశాలు కూడా తక్కువే.
పిల్లల ఎదుగుదల
ప్రోటీన్ లోపం వల్ల పిల్లల శరీర ఎదుగుదల ఆగిపోతుంది లేదా నెమ్మదిస్తుంది. ప్రోటీన్ లేకపోవడం వల్ల ఆకలి పెరిగి కేలరీలు ఎక్కువగా తీసుకుంటారు. మీరు తక్కువ మొత్తంలో ప్రోటీన్ తింటే శరీరం దాన్ని నిల్వచేసుకుని మీరు ఎక్కువ పరిమాణంలో తినేలా ప్రేరేపిస్తుంది. దీంతో తరచూ ఏదైనా తినాలనిపిస్తుంది. ఊబకాయం సమస్య వచ్చేస్తుంది.