తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Exams Health Tips : పరీక్షల సమయంలో విద్యార్థులు ఈ హెల్త్ టిప్స్ పాటించండి

Exams Health Tips : పరీక్షల సమయంలో విద్యార్థులు ఈ హెల్త్ టిప్స్ పాటించండి

Anand Sai HT Telugu

17 March 2024, 18:30 IST

google News
    • Health Tips In Exams Time : పదో తరగతి పరీక్షలు వచ్చేశాయి. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సమయంలో కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలను కచ్చితంగా పాటించాలి.
ఎగ్జామ్స్ హెల్త్ టిప్స్
ఎగ్జామ్స్ హెల్త్ టిప్స్ (Unsplash)

ఎగ్జామ్స్ హెల్త్ టిప్స్

ఇప్పుడు పరీక్షల కాలం. తెలంగాణలో ఎస్ఎస్‌సీ పరీక్షలు మెుదలవుతున్నాయి. మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు. పరీక్ష రాగానే పిల్లల్లో ఒకరకమైన ఆందోళన, మార్కుల గురించి భయపడుతూ ఉంటారు. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే నిద్ర లేక సరిగ్గా తినకుండా చదువుకుంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. నిద్రపోకుండా చదువుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఆరోగ్యం బాగోలేకపోతే పరీక్ష రాయలేం. నేర్చుకున్నది మర్చిపోయే అవకాశం ఉంది. పరీక్షల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

అతిగా తినకండి, నిద్ర వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొద్దికొద్దిగా తినండి. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఎక్కువసేపు చదివేందుకు ఇది ఉపయోగపడుతుంది. కొంతమంది పిల్లలు చదువుకునేటప్పుడు బబుల్ గమ్ లాంటివి తింటారు. ఇలా చేయకండి. ఏకాగ్రత ఉండదు. నూనెతో కూడిన ఆహారానికి కూడా దూరంగా ఉండండి.

ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తినండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయకండి. ఎందుకంటే మీరు ఉదయం అల్పాహారం తీసుకోకపోతే అలిసిపోయి బాగా చదవడం లేదా పరీక్ష రాయడం కష్టం అవుతుంది. మీరు ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి.

ముందే చెప్పినట్లు కరకరలాడే స్నాక్స్ తినకండి. బదులుగా డ్రై ఫ్రూట్స్ లేదా తాజా పండ్లు, తాజా పండ్ల రసాలు తీసుకోండి. పెరుగు, లస్సీ తాగండి.

తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రొటీన్లు, ఒమేగా 3 ఫ్యాట్‌లు ఉండేలా చూడాలి. ఇవి మెదడు చురుకుగా ఉండేలా చేస్తాయి. పాల ఉత్పత్తులు, గింజలు, గుడ్లు, చేపలు తింటే మంచిది.

రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. మీరు నీరు మాత్రమే తాగకూడదనుకుంటే, తాజా పండ్ల రసం లేదా నిమ్మరసం తాగవచ్చు.

గ్యాప్ లేకుండా చదవడం కొనసాగించవద్దు. అది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. మీరు చదవడం నుండి అలసిపోయినట్లు అనిపించినప్పుడు విరామం తీసుకోండి. మధ్యాహ్నం పూట కునుకు తీస్తే ఫ్రెష్‌గా ఉంటారు.

కష్టమైన సబ్జెక్ట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. శారీరక శ్రమపై కూడా శ్రద్ధ వహించండి. అంటే ఒకే చోట కూర్చోకుండా, నడక, ధ్యానం చేయండి. సంగీతం వినండి, ఇవన్నీ విశ్రాంతి అనుభూతిని అందిస్తాయి.

పరీక్షలకు చదువు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. 8 గంటలు నిద్రపోండి. నిద్ర తక్కువగా ఉంటే నేర్చుకున్నది మరచిపోయే అవకాశం ఉంది. బాగా నిద్రపోయి బాగా చదవండి.

పరీక్షలనే భయంతో విద్యార్థులు ఒత్తిడికి గురికాకూడదు. జీవితంలో పరీక్షలు మాత్రమే మిమ్మల్ని నిర్ణయించలేవు. ఇంకా చాలా విషయాలు మిమ్మల్ని డిసైడ్ చేస్తాయి. అందుకే భయంతో ఒత్తిడిని పెంచుకోకూడదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు. పరీక్షల సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే చదివేందుకు ఆస్కారం ఉంటుంది. చదివింది మైండ్‌కు ఎక్కుతుంది. అప్పుడే పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటారు. సరైన ఆహారంతోపాటుగా నిద్ర మీ మెుత్తం శ్రేయస్సును డిసైడ్ చేస్తుంది.

తదుపరి వ్యాసం