Liver Damage Symptoms : రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ ఫెయిల్ అవుతుందని అర్థం
16 March 2024, 19:30 IST
- Liver Damage Symptoms In Telugu : కాలేయ పనితీరు సరిగా ఉంటేనే మెుత్తం ఆరోగ్యం బాగుంటుంది. అయితే రాత్రిపూట కొన్ని లక్షణాలు కనిపిస్తే మీ కాలేయం దెబ్బతింటుందని అర్థం చేసుకోవాలి.
కాలేయ ఆరోగ్య సమస్యలు
శరీరంలో అతి పెద్ద అవయవం కాలేయం. కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. కాలేయం లేకుండా మనం జీవించలేం. ఎందుకంటే ఈ కాలేయం మన శరీరంలో దాదాపు 500 రకాల పనులను నిర్వహిస్తుంది. ప్రధానంగా కాలేయం మనం తినే ఆహారంలోని మంచి, చెడులను వేరు చేసి శరీరంలోని చెడును బయటకు పంపుతుంది. అందుకే కాలేయాన్ని సరిగా చేసుకోవాలి.
కాలేయం పిత్తాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. శరీరం నుండి వ్యర్థాలు, విషాన్ని తొలగించే ముఖ్యమైన పనిని కూడా చేస్తుంది. కాలేయం ప్రధానంగా మనం తినే ఆహారాన్ని మన శరీరానికి అవసరమైనదిగా మారుస్తుంది. ఇలా ఎక్కువ పని చేయడం వల్ల లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా అధిక పని కారణంగా కాలేయ వైఫల్యం కూడా సాధ్యమే. లివర్ ఫెయిల్యూర్ అయ్యే సమయంలో తార్తిపూట కనిపించే కొన్ని లక్షణాలను చూద్దాం.
అతిగా మూత్రవిసర్జన
రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడం వివిధ ఆరోగ్య సమస్యల లక్షణం. వాటిలో ఒకటి కాలేయ వ్యాధి. ఎందుకంటే శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాలేయం సరిగా పనిచేయక, సమస్యలు ఉంటే మూత్ర ఉత్పత్తిని పెంచి రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
ఈ లక్షణాలుంటే
మీరు మూత్ర విసర్జన చేయడానికి రాత్రి సమయంలో తరచుగా లేచి కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలను అనుభవిస్తారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే ఈ లక్షణాలు కూడా లివర్ ఫెయిల్యూర్ లక్షణాలే.
శారీరక అలసట
మీరు ఎటువంటి కారణం లేకుండా అధిక శారీరక అలసటను అనుభవిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. అలా అయితే, ఇది కాలేయ వ్యాధి సాధారణ లక్షణాలలో ఒకటి. కాలేయ వ్యాధి మెుదలైనప్పుడు శరీరంలో శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. మీరు ఈ రకమైన లక్షణాలను అనుభవిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యుడి వద్దకు వెళ్లండి.
కళ్లు పసుపు రంగులోకి
కామెర్లు శరీరంలో బిలిరుబిన్ స్థాయిలు పెరగడం వల్ల చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. ఇలా చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తే కాలేయం పరిస్థితి విషమంగా ఉందని హెచ్చరిక.
అధిక దురద
కాలేయంతో సమస్యలు ఉంటే చర్మం అధిక దురదను కలిగించవచ్చు. కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల శరీరంలో పిత్త లవణాలు పేరుకుపోయి చర్మంపై చికాకు కలిగిస్తుంది. ఇటువంటి దురద ఎక్కువగా ఉంటుంది. రాత్రి నిద్రకు భంగం కలిగిస్తుంది.
రాత్రి నిద్రకు భంగం
మీరు రాత్రి నిద్రించడానికి ఇబ్బంది పడితే కాలేయంలో తీవ్రమైన సమస్యలను కలిగి ఉండవచ్చు. కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చే దురద, నొప్పి, హార్మోన్ల అసమతుల్యత వంటివి రాత్రి నిద్రకు భంగం కలిగిస్తాయి. మీరు పైన పేర్కొన్న లక్షణాలను అనుభవిస్తే, కాలేయం విఫలమైన స్థితిలో ఉందని అర్థం. పరీక్ష, చికిత్స కోసం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సొంత వైద్యం ప్రయత్నించకూడదు.