Sunday Motivation : ఎవరికోసమో.. మీకు ఇష్టమైన వారిని దూరం చేసుకోకండి..
14 August 2022, 6:43 IST
- కొన్నిసార్లు ఇంట్లో వాళ్లకి నచ్చదనో.. లేక అవతలి వారికి మంచి జరుగుతుందనో.. మనకు చాలా ఇష్టమైన వాటిని వదిలేస్తాము. అవి మీకు ఇష్టమైన గోల్స్ అవ్వొచ్చు, ఇష్టమైన మనిషి అవ్వొచ్చు.. ఇష్టమైన వస్తువు అవ్వొచ్చు. కానీ ఎవరి గురించో ఆలోచించి.. మీకు ఇష్టమైన వాటిని వదులుకుని.. ఏదో గొప్ప త్యాగం చేసేశాము అనుకుంటాం కానీ అది అసలు విషయం కాదు. దానిగురించి మీరు జీవితాంతం బాధపడతారనేదే ముఖ్యాంశం.
కోట్ ఆఫ్ ద డే
Sunday Motivation : అవతలి టీమ్ వాళ్లు గెలవాలని.. నీ టీమ్‌లో ఉన్నవాళ్లని బాధపెట్టడం కరెక్ట్ కాదని.. ఓ సినిమాలో త్రివిక్రమ్ మంచి డైలాగ్ రాశారు. అవును నిజమే గేమ్ నీది.. టీమ్ నీది అయినప్పుడు.. అవతలి టీమ్‌లో నీకు కావాల్సిన వారే ఉన్నా.. గెలిచే అవకాశాన్ని ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు. వాళ్లు బాధపడతారని.. లేదా వాళ్లని గెలిపించాలనే తాపత్రయంలో నువ్వు చేసే త్యాగం.. నీ టీమ్‌లో ఉన్నవారిని బాధపెడుతుంది. నువ్వు ఓడిపోవడమే కాకుండా.. నీతో ఉన్నవారిని మోసం చేయడం సమంజసం కాదు. నీ పోరాటంలో నీకు తోడుగా ఉన్నవారిని.. అర్థాంతరం వదిలివేయడం క్షమించరాని నేరం.
ఇలానే చాలా విషయాల్లో మనం కాంప్రిమైజ్ అయిపోతాం. అవతలివారి గురించో లేదా ఇంకెవరి గురించి ఎక్కువ ఆలోచించి.. మీకు నచ్చిన వారిని, మిమ్మల్ని ప్రేమించేవారిని అర్థాంతరంగా గాలికి వదిలేస్తాము. ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు లేదా ఇలా వదిలేయాల్సి వస్తుందని మీకు అనిపించినప్పుడు.. మీరు వారిని కలవకపోయినా బాగుండేది. పాపం వారిలో అనవసరమైన ఫీలింగ్స్ పెంచి.. ఎటుకానీ దారిలో వారిని వదిలి వెళ్లిపోవడం అస్సలు కరెక్ట్ కాదు.
ఉన్నదే చిన్న జీవితం.. ఇప్పటికే ఎన్నో కాంప్రిమైజ్లు, కష్టాలు అనుభవించే ఉంటారు. అయినాసరే మీకున్న ఒక్కగానొక్క పాజిటివ్ హోప్‌ని ఎవరికోసమో వదలేయడం ఎంత వరకు కరెక్ట్. మీకు కావాల్సిన దానిగురించి కనీసం ప్రయత్నించకపోగా.. ఎవరో హ్యాపీగా ఉంటారని.. మీరు హ్యాపీగా ఉండే దేనినైనా మీరు త్యాగం చేస్తున్నారంటే.. అది మీ మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే మీతో ఎవరూ లైఫ్ లాంగ్ రారు. అందరూ మిమ్మల్ని జీవితం అనే సంద్రంలో నట్టేట్లో ముంచేవారే. ఆ సమయంలో మిమ్మల్ని తీరానికి చేర్చే పడవను వదిలేయడం మీకే హాని చేస్తుంది. కాస్త కఠినంగా ఉంటే.. బాగుండేదే అనిపిస్తుంది. ఆ పడవ ఉంటే తీరానికి చేరకపోయినా.. చేరుతామనే హోప్నిస్తుంది ఆ పడవ.
మీరు లైఫ్‌లో ఎవరికోసం అయితే.. మీకు నచ్చిన, ప్రేమించనవారిని వదిలేసుకున్నారో.. వారు ఎప్పుడూ ఈ విషయాలతో తృప్తి చెందుతారని అనుకోకండి. మీరు అతి గొప్ప త్యాగం ఇదే అయినా.. వారికది ఏమాత్రం కనిపించదు. కానీ మీరు మాత్రం మీరు చేసిన తప్పుకి లైఫ్‌లాంగ్ బాధపడతారు. జీవితంలో కొందరు వ్యక్తులు లేదా కొన్ని వస్తువులను ఎవరూ రిప్లేస్ చేయలేరు. అలాంటివాటిని వదులుకునే ముందు ఆలోచించండి. మీకోసం దూరం చేసుకోవడంలో ఓ అర్థముంది కానీ.. ఎవరికోసమో వాటిని దూరం చేసుకుని జీవితాన్ని విషాదంతో నింపుకోకండి.