Thursday Motivation : జీవితంలో ఆ రెండూ చేస్తే.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
Thursday Thought : జీవితంలో ఎప్పుడూ ఇతరులను క్షమించడమే కాదు.. మనల్ని మనం క్షమించడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే తెలిసో.. తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తాము. అవి చేస్తున్నప్పుడు తప్పులాగా కూడా అనిపించవు. కానీ తరువాత మనం చేసింది ఎంత తప్పో అర్థమవుతుంది. అప్పుడు మనల్ని మనం క్షమించుకోలేము. కానీ ముందు మనల్ని మనం క్షమించుకోవాలి. అప్పుడే జీవితానికి ఓ అర్థం. పరమార్థం.
Thursday Motivation : మీ జీవితాన్ని రెండే రెండు మార్చగలవు. ఒకటి మిమ్మల్ని మీరు క్షమించుకోవడం. రెండవది ఆ ట్రోమా నుంచి బయటకు వచ్చి ముందుకు సాగడం. ప్రతి ఒక్కరూ ఏదొక తప్పు కచ్చితంగా చేస్తారు. అలానే మీరు కూడా తప్పులు చేసి ఉంటారు. అవి తప్పులను తెలియకా చేసి ఉండొచ్చు. తప్పించుకోలేని పరిస్థితుల్లో కూడా అవి జరిగి ఉండొచ్చు. మీ ప్రమేయం లేకుండా జరిగినా తప్పుల గురించి ఆలోచించి.. మనసును పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు. తెలియకుండా చేసినా.. తెలిసి చేసినా తప్పు తప్పే. కాదని అనడం లేదు. కానీ మనం చేసిన తప్పును మనం క్షమించుకుంటేనే.. లైఫ్‌లో ముందుకు సాగుతాం. లేదంటే అక్కడే ఆగిపోతాము.
కొన్నిసార్లు మనం మన గతంలోనే ఆగిపోతాము. వాటిని రోజూ తవ్వుకుని కుమిలిపోతాము. అయ్యో ఆ రోజు అలా చేసి ఉంటే.. ఈ రోజు ఇలా ఉండేది కాదని ఆలోచిస్తూ ఆగిపోతాము. అప్పుడు చేసింది ఏమో తెలియదు కానీ.. మీరు ఇప్పుడు చేస్తుంది మాత్రం కచ్చితంగా తప్పే. ఎందుకంటే.. గతంలో చేసింది మన ప్రమేయం లేకుండా, తెలిసీ తెలియకో జరిగిపోయి ఉండొచ్చు. కానీ దాన్ని గురించే ఆలోచిస్తూ.. ఇప్పుడున్న విలువైన కాలాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత మంచిది.
ప్రతి వ్యక్తికి గతం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. వాటినే తలచుకుంటూ ఉండిపోతే.. ఎవరైనా జీవితంలో ముందుకు ఎలా వెళ్లగలుగుతారు. కొందరు మంచి జ్ఞాపకాలను తలచుకుంటూ.. చేసిన తప్పులనుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. అంతేకాకుండా సక్సెస్ అవుతారు. కానీ కొందరు మాత్రం.. గతంలోని ఆలోచనలతో విచారం, ఒత్తిడి, ఆందోళనలో మునిగి తేలుతారు. సక్సెస్ అయిన వాళ్లని చూసి.. వాళ్లకి అదృష్టముందని.. తమకు లేదని మరింత విచారిస్తారు.
ముందు మీరు జరిగిన దానిని మార్చలేరు. ఈ విషయం గుర్తించుకోండి. కానీ మీ ఫ్యూచర్‌ని మార్చుకునే శక్తి మీకు ఉంది. మీ గతాన్ని మనసులో పెట్టుకుని కుమిలిపోతే.. ఈ క్షణం మీరు మీ ఆనందానికి దూరం అయినట్లే. గతాన్ని ఎదుర్కోవడం తప్ప మీకు ఇంకో దారి లేదు. కాబట్టి మీరు కచ్చితంగా దానిని దాటుకుని వెళ్లాల్సిందే. ఎదుర్కోలేకపోయారో.. మీరు కాదు కదా.. ఆ దేవుడు కూడా మిమ్మల్ని మార్చలేడు. మీ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోండి. వాటినుంచి బయటపడేందుకు కొంత సమయం తీసుకోండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ముందుకు వెళ్లేలా ప్రోత్సాహించుకోండి. మీ చేతిలో ఉన్న పనులపై ఏకాగ్రత ఉంచండి.
ఒకసారి మీరు మిమ్మల్ని మీరు క్షమించుకున్న తర్వాత.. మీరు జీవితంలో ముందుకు సాగడం గురించి ఆలోచించాలి. మీరు ముందుకు వెళ్లడం మాత్రమే మీ లక్ష్యంగా ఉండాలి. ఎంత త్వరగా దానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే అంత మంచిది. ముందుకు వెళ్లాలని ఆలోచించినప్పుడు.. మీరు కొన్ని వాస్తవాలను అంగీకరించాలి. రాబోయే పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ముందుకు సాగడంపై దృష్టి పెడితే.. జీవితం ఎంత అందంగా ఉంటుందో మీకు తెలుస్తుంది.
సంబంధిత కథనం