Smart Phones Affect on Child: పిల్లలు మారాం చేస్తున్నారని ఫోన్ చేతికిస్తున్నారా? డేంజర్ జోన్‌లో ఐప్యాడ్ కిడ్స్
09 October 2024, 12:16 IST
Smartphones Affect Childhood: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్న విద్యార్థుల మానసిక పరిస్థితిపై కాలిఫోర్నియా యూనివర్సిటీ చేసిన సర్వేలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. సాధారణ పిల్లల కంటే.. ఫోన్ చూస్తున్న విద్యార్థుల్లో కొన్ని ప్రమాదకర లక్షణాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఐప్యాడ్ కిడ్
ఈరోజుల్లో తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లల అలక, కోపాన్ని తగ్గించడానికి ఫోన్లు చేతికి ఇస్తున్నారు. కానీ.. ఇది వారికి తెలియకుండానే వారి పిల్లల మానసిక ఆరోగ్యం క్షీణించడానికి దారితీస్తోంది. 2010 తర్వాత పుట్టిన పిల్లలను ఐప్యాడ్ కిడ్ అని పిలుస్తుంటారు. ఈ డిజిటల్ యుగంలో పిల్లలను ఫోన్‌లు చూడనివ్వకుండా ఆపడం కత్తిమీద సామే.
స్కూల్ నుంచి రాగానే మొదలు
సాధారణంగా ఇప్పుడు చాలా ఇళ్లల్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫోన్లు తీసుకుని గేమ్స్ ఆడటం లేదా యూట్యూబ్, రీల్స్ చూడటం చేస్తుంటారు. ఒకవేళ కోప్పడి వారి నుంచి మనం ఫోన్ తీసుకున్నా.. వాళ్లు తల్లిదండ్రులపై కోప్పడటం లేదా ఏడవడం లాంటివి చేస్తుంటారు. దాంతో వారి ఏడుపుని చూడలేక మళ్లీ మనం ఫోన్‌ని ఇచ్చేస్తుంటాం.
కాలక్రమేణా పిల్లలకి ఫోన్ అలవాటుగా మారిపోతోంది. ఎంతలా అంటే.. ఇప్పుడు చాలా ఇళ్లల్లోని పిల్లలు అన్నం తినాలన్నా చేతిలో ఫోన్ తప్పనిసరిగా మారిపోయింది. కానీ.. ఎక్కువ రోజులు ఇదే పంథా కొనసాగితే.. పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని తాజాగా కాలిఫోర్నియా యూనివర్సిటీ సర్వే తేల్చింది.
కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో చిన్న పిల్లలలో స్క్రీన్ సమయం.. వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తేలింది. 9-10 ఏళ్ల పిల్లలలో స్క్రీన్ సమయం పెరిగేకొద్దీ మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.
స్క్రీన్ టైమ్‌తో పిల్లల్లో దూకుడు
కాలిఫోర్నియా యూనివర్సిటీ దాదాపు రెండేళ్ల పాటు 9,500 మంది చిన్నారులపై ఈ అధ్యయనం చేసి తేల్చింది ఏంటంటే.. అధిక స్క్రీన్ సమయం ఉన్న పిల్లల్లో నిరాశ, ఆందోళన, అశ్రద్ధ, దూకుడు తదితర ప్రమాద లక్షణాలు కనిపించాయట. ఇది వాళ్లు పెరిగే కొద్దీ ప్రమాద స్థాయిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకసారి అలవాటు అయిన తర్వాత పిల్లలు మొబైల్‌ను చూడకుండా కట్టడి చేయడం కష్టమే. స్కూల్‌ని నుంచి రాగానే కాసేపు రిలాక్స్ అవ్వనీలే అని చాలా మంది తల్లిదండ్రులు చూసీ చూడనట్లు ఉండిపోతున్నారు. కానీ ఇది డేంజర్ అని తాజాగా సర్వేలో తేలింది.
కట్టడి చేయడం ఎలా?
పిల్లలు ఫోన్ చూడకుండా స్కూల్ నుంచి రాగానే వాళ్లు ఫిజికల్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. ఇంటి చుట్టు పక్కల ఉన్న పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోవడాన్ని తల్లిదండ్రులు అనుమతించాలి. ఫిజికల్ గేమ్స్‌తో పాటు చెస్, క్యారమ్స్ లాంటివి ఆడిస్తే మంచిది. ఈ ఆటలు ఆడేటప్పుడు వారి మనసు ఫోన్ వైపు వెళ్లకపోవచ్చు.
కోవిడ్-19 తర్వాత చిన్న పిల్లలలో డిజిటల్ వినియోగం ప్రమాదకర స్థాయిలో పెరిగినట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ సర్వేలో తేల్చింది. ఎంతలా అంటే కరోనా తర్వాత 42% మంది హైస్కూల్ స్థాయి విద్యార్థులు అతిగా మొబైల్‌ను చూస్తున్నారట. దానికి కారణం.. రెండేళ్ల పాటు లాక్ డౌన్ పరిస్థితులు.. ఇంట్లోని ఉండి ఫోన్ చూడటం అలవాటుగా మారడమేనని సర్వేలో తేలింది.