Digital Arrest : డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఈ స్కామ్‌లను ఎలా చేస్తున్నారు?
Digital Arrest Scam : ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. మీ ప్రమేయం లేని విషయాల్లోనూ మోసగాళ్లు మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారు. మీ దగ్గర నుంచి డబ్బులు దండుకుంటారు. అలాంటిదే డిజిటల్ అరెస్టు. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం..
మీరు ఏదో పనిలో బిజీగా ఉంటారు. ఆకస్మాత్తుగా కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. మీరు కాల్ లిఫ్ట్ చేయగానే ప్రభుత్వ సంస్థలోని అధికారిగా మీతో పరిచయం అవుతారు. ఆ తర్వాత వారి ప్లానింగ్ మెుదలుపెడతారు. ఇక మీరు చట్టపరమైన ఇబ్బందుల్లో ఉన్నారని మీ మైండ్ మెుత్తం ట్యూన్ చేస్తారు. తర్వాత ఏంటి ఇది అసలు అనుకునేలోపే మెుత్తం మీరు తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యేలా చేస్తారు.
డిజిటల్ అరెస్టు అంటే
ఉదాహరణకు మీ పేరు మీద డ్రగ్స్, తప్పుడు పాస్‌పోర్టులు, నిషేధిత వస్తువులు వచ్చినట్టుగా చెబుతారు. ఒకవేళ మీరు అసలు నేను ఎలాంటివి ఆర్డర్ పెట్టలేదు అని వారితో అరిచి చెప్పినా.. వినరు. లేదు మీ పేరు మీద వచ్చింది కాబట్టి మీరే బాధ్యులు అవుతారు. చట్టపరంగా చిక్కుల్లో పడతారని మీకు చెబుతారు. ఈ విషయాన్ని మీరు నమ్మేలా చేస్తారు. కేసు డీల్ చేసి సెటిల్‌మెంట్ చేసేందుకు డబ్బులు అడుగుతారు. ఇదే డిజిటల్ అరెస్ట్ అంటే. ఇందుకోసం వారు సీబీఐ, కస్టమ్, ఈడీ అధికారులమని మీతో చెప్పుకుంటారు. ఇలాంటి మోసాలను నమ్మకూడదని కేంద్రం చెబుతుంది. తాజాగా సూచనలు కూడా చేసింది.
డిజిటల్ అరెస్టులు ఉండవు
భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాల కేసులకు సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పబ్లిక్ అడ్వైజరీ కూడా జారీ చేసింది. సీబీఐ, పోలీస్, కస్టమ్స్, ఈడీ లేదా న్యాయమూర్తులు వంటి చట్టాన్ని అమలు చేసే సంస్థలు వీడియో కాల్‌ల ద్వారా అరెస్టులు చేయవు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
చాలా మంది మోసపోయారు
అయితే ఇలా చెబితే మోసపోయేది ఎవరు అని మీరు అనుకోవచ్చు. డిజిటల్ అరెస్టులకు సంబంధించిన కేసులు ఇప్పటికే ఇండియాలో చాలా నమోదు అయ్యాయి. గత నెలలో నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(NBCC)లోని ఒక సీనియర్ అధికారి డిజిటల్ అరెస్ట్ కేసులో రూ. 55 లక్షల మోసపోయారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 నుండి అధికారి అని చెప్పుకుంటూ ఓ మహిళ కూడా ఇలానే మోసం చేసింది. నోయిడాకు చెందిన ప్రముఖ వైద్యురాలు పూజా గోయెల్ 60 లక్షల రూపాయలు మోసపోయారు. ఇలా పదుల సంఖ్యలో డిజిటల్ అరెస్టు కేసులు ఉన్నాయి.
హెల్ప్‌లైన్ నంబర్
వాట్సాప్, స్కైప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. యూజర్ల భద్రతను పెంచేందుకు తాము ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలతో సహకరిస్తున్నట్లు వాట్సాప్, స్కైప్ గతంలో పేర్కొన్నాయి. అలాంటి నేరాలను హెల్ప్‌లైన్ నంబర్ 1930కు చెప్పాలని, సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో కంప్లైంట్ చేయాలని కేంద్రం చెబుతోంది.
ఇదో టెక్నిక్
తెలియని వ్యక్తులపై డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ క్రైమ్ టెక్నిక్. ఇక్కడ మోసగాళ్ళు ఎస్ఎంఎస్‌లు పంపడం లేదా వ్యక్తులకు వీడియో కాల్‌లు చేయడం, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల నుండి చట్టాన్ని అమలు చేసే అధికారులుగా నటిస్తారు. ఇటువంటి సందర్భాల్లో వ్యక్తి లేదా వారి సన్నిహిత కుటుంబ సభ్యులు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా మనీలాండరింగ్ వంటి నేర కార్యకలాపాలలో పాలుపంచుకున్నారని, అందువల్ల వారిని వీడియో కాల్‌ల ద్వారా అరెస్టు చేస్తున్నామని తప్పుగా చెబుతారు. నమ్మితే లక్షలు పోతాయి. అందుకే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.