PonnamPrabhakar: ప్రభుత్వ పథకాలన్నింటికి ప్రామాణికంగా డిజిటల్ కార్డు, కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి పొన్నం
PonnamPrabhakar: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ప్రామాణికంగా, బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా రూపొందించిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పంపిణీ చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు
PonnamPrabhakar:కరీంనగర్‌లో ఫ్యామిలీ కార్డుల పంపిణీ పైలెట్ ప్రాజెక్టును మంత్రి పొన్నం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని 13 గ్రామాలు, 15 మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీ చేపట్టారు.
ఆధార్ కార్డు మాదిరి ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అందుకు కరీంనగర్ కలెక్టర్ ప్రమీల సత్పతి తో కలిసి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తహేర్ కొండాపూర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పలు ఇళ్ళకు వెళ్లి వివరాలు నమోదు చేశారు. కుటుంబ ఆస్తుల వివరాలతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యుల సంఖ్య గుర్తింపు ఫోటో వివరాలు సేకరించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామం, మునిసిపాలిటీలో ఒక వార్డును ఎంపిక చేసుకోవడం జరిగిందని తెలిపారు. డిజిటల్ కార్డు.. రేషన్ కార్డు, హెల్త్ కార్డు , పింఛను ఇలా ప్రభుత్వ పథకాలన్నింటికి ప్రామాణికం కానున్నదని స్పష్టం చేశారు. డిజిటల్ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా వినియోగించుకోవచ్చని తెలిపారు.
డిజిటల్ గుర్తింపు కార్డు ఫ్యామిలీ పెద్దగా మహిళా పేరు మీదనే వస్తుందని...ఈ కార్డు ద్వారానే ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు పొందవచ్చని తెలిపారు. కర్ణాటక హర్యానా లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే డిజిటల్ కార్డులు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు
గత ప్రభుత్వం బిఆర్ఎస్ పదేళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రజా పాలన చేపట్టి రేషన్ కార్డు లేని వారందరి నుంచి దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని, త్వరలోనే రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
రేషన్ కార్డులతో పాటు ప్రస్తుతం ఇచ్చే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రభుత్వ పథకాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 2 లక్షల పైగా పంట రుణం ఉన్న రైతులకు దసరా లోపు మాఫీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారని పొన్నం తెలిపారు. అర్హత ఉండి ఎక్కడైనా రుణమాఫీ కాకపోతే అధికారులకు వివరాలు ఇవ్వాలని కోరారు.
వందశాతం సబ్సిడీ తో చేపపిల్లల పంపిణీ- మంత్రి పొన్నం
తెలంగాణ వ్యాప్తంగా 29వేల చెరువుల్లో చేప పిల్ల వదిలి మత్స్యకారుల ఉపాధిని మెరుగుపరుస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బిల్లుల చెల్లింపుల జాప్యంతో ఈసారి చేప పిల్లల పంపిణీ ఆలస్యమైందని స్పష్టం చేశారు.
కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్ లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కమిషనర్ ప్రియాంక ఆలా, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి పొన్నం చేప పిల్లలను విడుదల చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా చేప పిల్లలు పంపిణీ చేసిన వారికి బకాయిలు చెల్లించాల్సి ఉండడంతో పరస్పర పిర్యాదులు విచారణ వల్ల చేప పిల్లల పంపిణీ లేట్ అయిందన్నారు.
గత ప్రభుత్వం బిఆర్ఎస్ 75 వేల కోట్లు పనులు మంజూరు చేసి 40 వేల కోట్లు పెండింగ్ లో పెట్టిందని తెలిపారు. బలహీన వర్గాల మంత్రిగా సీఎంతో మాట్లాడి బకాయిలన్నీ క్లియర్ చేసి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29వేల చెరువులలో త్వరలోనే చేప పిల్లలు విడుదల చేస్తామన్నారు. మానేర్ డ్యామ్ లో గతంలో 30 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయగా ఈసారి 60 లక్షల చేప పిల్లల విడుదల చేయనున్నామని చెప్పారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)