శర్మ పేరుతో 10 ఏళ్లుగా భారత్‌లో నివసిస్తున్న పాకిస్థానీ కుటుంబం.. బెంగళూరు దగ్గరలో అరెస్టు-pakistani family living in india for 10 years under sharma name arrested near bengaluru jigani ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  శర్మ పేరుతో 10 ఏళ్లుగా భారత్‌లో నివసిస్తున్న పాకిస్థానీ కుటుంబం.. బెంగళూరు దగ్గరలో అరెస్టు

శర్మ పేరుతో 10 ఏళ్లుగా భారత్‌లో నివసిస్తున్న పాకిస్థానీ కుటుంబం.. బెంగళూరు దగ్గరలో అరెస్టు

Anand Sai HT Telugu
Sep 30, 2024 10:14 PM IST

Pakistani Family In India : శర్మ అనే పేరుతో, తప్పుడు పత్రాలతో భారత్‌లో నివసిస్తున్న పాకిస్థానీ కుటుంబాన్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా బెంగళూరు సమీపంలో నివసిస్తున్నారు. తాజాగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తప్పుడు పత్రాలు, నకిలీ పేరుతో భారతదేశంలో నివసిస్తున్న పాకిస్థాని కుటుంబాన్ని బెంగళూరు సమీపంలో అరెస్టు చేశారు. ఈ కుటుంబం 2014లో దిల్లీకి వచ్చి బెంగళూరుకు వెళ్లారు. ఇంతకు ముందు ఆ కుటుంబం బంగ్లాదేశ్‌లోని ఢాకాలో నివసించేది.

అరెస్టు చేసిన వారిని రషీద్ అలీ సిద్ధిఖీ (48), అతని భార్య అయేషా (38), ఆమె తల్లిదండ్రులు హనీఫ్ మహ్మద్ (73), రుబీనా (61)గా పోలీసులు గుర్తించారు. ఈ కుటుంబం రాజాపుర గ్రామంలో శంకర్ శర్మ, ఆశా రాణి, రామ్ బాబు శర్మ, రాణి శర్మ అనే మారుపేర్లతో నివసిస్తున్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

ప్రాథమిక విచారణ ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి భార్య బంగ్లాదేశ్‌లో నివసిస్తుండేది. అయితే ఈ జంట ఢాకాలో వివాహం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ అధికారుల ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆదివారం బెంగళూరు శివార్లలోని జిగానిలో తనిఖీలు చేశారు పోలీసులు. తరువాత వారిని అదుపులోకి తీసుకున్నారు.

'జిగాని ఇన్‌స్పెక్టర్ ఒక విషయంపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మోసపూరిత పత్రాలతో ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. కేసు నమోదు చేసి, ఆ నలుగురిని విచారిస్తున్నారు. విచారణ ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.' అని ఓ సీనియర్ పోలీసు అధికారి పీటీఐకి తెలిపారు.

నకిలీ పత్రాలు సంపాదించి ఆ కుటుంబం జిగానిలో అద్దెకు ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. ఓ గ్యారేజీకి మెటీరియల్‌ను సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నారని, వారి నెట్‌వర్క్, ఇతర కార్యకలాపాలపై ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

'మేం వారి గురించి వివరాలను సేకరించాం. కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఒక గ్యారేజీకి మెటీరియల్స్ సరఫరా చేస్తున్నారు. అయితే ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది.' అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.