Jagityal Fake Notes: జగిత్యాల జిల్లాలో నకిలీ 500 నోట్లు కలకలం.. చిరు వ్యాపారులకు నకిలీ నోట్లు అంటగట్టిన కేటుగాళ్లు-fake 500 notes in jagityala district petty traders cheated by unknown persons ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagityal Fake Notes: జగిత్యాల జిల్లాలో నకిలీ 500 నోట్లు కలకలం.. చిరు వ్యాపారులకు నకిలీ నోట్లు అంటగట్టిన కేటుగాళ్లు

Jagityal Fake Notes: జగిత్యాల జిల్లాలో నకిలీ 500 నోట్లు కలకలం.. చిరు వ్యాపారులకు నకిలీ నోట్లు అంటగట్టిన కేటుగాళ్లు

HT Telugu Desk HT Telugu
Sep 30, 2024 06:33 AM IST

Jagityal Fake Notes:జగిత్యాల జిల్లాలో నకిలీ 500 నోటు కలకలం సృష్టిస్తున్నాయి. చిరు వ్యాపారులు అమాయక ప్రజలే లక్ష్యంగా కేటుగాళ్లు నకిలీ నోట్లు చలామని చేస్తున్నారు. అసలు నకిలీ తేడా తెలియని అమాయకులు మోసపోయి ఆందోళన చెపుతున్నారు.

నకిలీనోట్లను చూపుతున్న బాధితుడు
నకిలీనోట్లను చూపుతున్న బాధితుడు

Jagityal Fake Notes: కోరుట్ల పట్టణంలో గత రెండు రోజుల్లో మూడు చోట్ల నకిలీ ఐదు వందల నోటు తీసుకుని మోసపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులకు నకిలీ 500 నోట్లు అంటగడుతున్నారు. చిరువ్యాపారులే లక్ష్యంగా నకిలీ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. కోరుట్ల పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద కొబ్బరి బొండాల వ్యాపారి, పండ్ల దుకాణందారున్ని ఒకే రోజు గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేశారు.‌

పండ్ల వ్యాపారికి కేటు గాడు నకిలీ 500 రూపాయల నోట్లు ఇచ్చి 50 రూపాయల పండ్లు తీసుకుని 450 చిల్లర తీసుకుని పోయాడు. రెండు రోజుల క్రితం ఆర్టీవో కార్యాలయం వద్ద ఉన్న రొట్టెలు అమ్ముకునే మహిళ వద్ద రొట్టెను తీసుకొని నకిలీ 500 రూపాయల నోటు ఇచ్చి చిల్లర తీసుకుని పోయాడు. నకిలీ నోటి ఇచ్చి చిల్లర తీసుకుని వెళ్లిపోయాక అమాయకులు గుర్తించి లబోదిబోమ్మంటున్నారు. ఇలా రోజుకోచోట కేటుగాళ్లు నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు.

నకిలీ నోటును గుర్తించిన పండ్ల వ్యాపారి...

పండ్ల వ్యాపారి 500 నోటు నకిలీదని గుర్తించాడు. అప్పటికే ఆ నోటు ఇచ్చిన వ్యక్తి వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా నకిలీ కేటుగాడు గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్క్ ధరించాడు. సిసి ఫుటేజ్ ఆధారంగా మోసపోయిన బాదితులు పోలీసులకు పిర్యాదు చేశారు. సి సి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిఘా పెట్టి నకిలీ కేటుగాళ్ళను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

రూ.25 లక్షల విలువ చేసే 106.6 కిలోల గంజాయి దగ్దం

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 43 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన నిషేధిత 106.6 కిలోల గంజాయిని పోలీసులు దగ్దం చేశారు. NDPS చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటిస్తూ గంజాయిని దగ్దం చేశామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

అక్రమార్జన లో భాగంగా కొందరు గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని తెలిపారు. అలాంటి వారిపై నిఘా పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ప్రకటించారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)