Dhokla Recipe: స్పాంజీ ఢోక్లా రెసిపీ.. పక్కా కొలతలు, టిప్స్ తో సహా..
07 September 2023, 6:30 IST
Dhokla Recipe: ఢోక్లాలు మెత్తగా, స్పాంజీగా రావాలంటే కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాలి. లేదంటే గట్టిగా, రుచిగా ఉండవు. ఆ చిట్కాలేంటో తెలుసుకోండి.
దోక్లా రెసిపీ
ఉత్తర భారతదేశంలో అల్పాహారంలోకి ఎక్కువగా తీసుకునే ఢోక్లాలు మనం మాత్రం ఎక్కువగా బయట రెస్టారెంట్లలోనే తింటుంటాం. ఇంట్లో చేస్తే అంత మెత్తగా, స్పాంజీగా రావనిపిస్తుంది. అందుకే పక్కా కొలతలతో కొన్ని మంచి చిట్కాలతో ఢోక్లా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
ఒకటిన్నర కప్పుల శనగపిండి
3 చెంచాల సన్న రవ్వ
అరచెంచా అల్లం ముద్ద
4 పచ్చిమిర్చి, తరుగు
పావు చెంచా పసుపు
1 చెంచా పంచదార
చిటికెడు ఇంగువ
అరచెంచా ఉప్పు
1 చెంచా నిమ్మరసం
4 చెంచాల నూనె
సగం చెంచా సోడా లేదా ఫ్రూట్ సాల్ట్
సగం చెంచా ఆవాలు
సగం చెంచా జీలకర్ర
1 చెంచా నువ్వులు
1 కరివేపాకు రెబ్బ
2 చెంచాల కొబ్బరి తురుము
కొద్దిగా కొత్తిమీర తరుగు
తయారీ విధానం:
- పెద్ద గిన్నెలో శనగపిండి, రవ్వ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, పంచదార, ఇంగువ, ఉప్పు, నిమ్మరసం, చెంచా నూనె కూడా వేసుకోవాలి.
- ఇప్పుడు ఒక కప్పు నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. వంటసోడా లేదా ఫ్రూట్ సాల్ట్ కూడా ఇప్పుడే కలుపుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాస్త లోతుగా ఉన్న పాత్రలో పిండి పోసుకుని ఆవిరిమీద ఉడికించుకోవాలి. ఒక పావుగంటలో ఢోక్లా సిద్దం అవుతుంది. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఈలోపు తాలింపు సిద్ధం చేసుకోవచ్చు. ఒక కడాయిలో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేగనివ్వాలి.
- ఈ తాలింపును ఢోక్లా ముక్కల మీద పోసుకోవాలి. మీదుగా కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. దీన్ని ఏదైనా చట్నీతో లేదా టమాటా సాస్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు.
స్పాంజీ ఢోక్లా కోసం చిట్కాలు:
- పిండి కలుపుకునేటప్పుడు ఒకేసారి నీళ్లు పోసూకోకూడదు. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని పిండిని చూసుకుని మళ్లీ నీళ్లు పోసుకోవాలి. దానివల్ల పిండి మరీ పలుచగా అవ్వదు.
- స్పాంజీగా అవ్వడానికి సోడా లేదా ఫ్రూట్ సాల్ట్ వేసుకోవడం తప్పనిసరి.
- కలుపుకున్న పిండిని కనీసం అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. దానివల్ల ఢోక్లాలు స్పాంజీగా వస్తాయి.
- పిండిని వీలైనంత ఎక్కువసేపు విస్క్ చేసుకోవాలి. దానివల్ల గాలి లోపలికి పోయి ఢోక్లా మెత్తగా, స్పాంజీగా వస్తుంది.