Milind Soman Fitness Secrets : వయసు 57 కానీ.. ఫిట్‌నెస్‌లో 27.. ఒప్పుకోవాల్సిందే
04 November 2022, 8:34 IST
- Milind Soman Fitness Secrets : మిలింద్ సోమన్ అనగానే.. యాక్టర్ కన్నా.. సూపర్ మోడల్ అనే కన్నా.. ఫిట్‌నెస్ విషయంలోనే ఎక్కువ గుర్తొస్తారు. వయసు మీద పడుతున్న.. ఫిట్‌నెస్‌కు ఆయన ఇచ్చే ప్రాముఖ్యత అంత ఇంతా కాదు. 60 ఏళ్లకు దగ్గరగా ఉన్న మిలింద్ ఇప్పటికీ తన వర్క్అవుట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. మరి అతని బర్త్‌డేరోజు ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏమిటో తెలుసుకుందామా?
మిలింద్ సోమన్ ఫిట్‌నెస్ సీక్రెట్స్
Milind Soman Fitness Secrets : దేశంలోనే అత్యంత స్పూర్తిదాయకమైన ఫిట్‌నెస్ చిహ్నాలలో మిలింద్ సోమన్ ఒకరని చెప్పవచ్చు. సూపర్ మోడల్‌గా, నటుడు, నిర్మాతగా వ్యవహరిస్తున్న మిలింద్.. తన ఫిట్నెస్తోనే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతనే కాదు.. తన తల్లి, భార్య కూడా ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి రాజీపడరు. తల్లి మీద అమితమైన ప్రేమతో.. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు కూడా మిలింద్ ఉషా సోమన్‌గా పెట్టుకున్నాడు. అయితే ఇన్‌స్టాలో.. తన ఆరోగ్యకరమైన జీవనశైలిని పంచుకుంటూ.. అభిమానులను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూ ఉంటాడు.
నిజానికి అతని జీవన శైలిని మనం కూడా అనుకరిస్తే.. అంతే ఫిట్‌గా మారిపోవచ్చు. ఈరోజు 57వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ ఫిట్‌నెస్ అంబాసిడర్.. డైట్, వ్యాయామ, దినచర్యల గురించి తెలుసుకుని.. మనం కూడా ఫాలో అయిపోదాం.
వ్యాయామం
సోమన్ ప్రతిరోజు కనీసం 15-20 నిమిషాలు వర్కవుట్ చేస్తాడు. ఈ విషయాన్ని అతను చాలా సార్లు వెల్లడించాడు. సహజ కదలికలు, నియంత్రణ, క్రమబద్ధతపై దృష్టి పెడతాడు. 30 సెకన్ల నుంచి రెండు నిమిషాల వరకు మైక్రో వర్కౌట్‌లు చేస్తాడు. అదనంగా ప్రతిరోజూ ఏడు నిమిషాలలో 30 రౌండ్లు సూర్య నమస్కారం చేస్తాడు. సోమన్ నిమిషంలో 60 పుష్-అప్‌లు కూడా చేస్తాడు. ఈ ఏజ్‌లో ఇవన్నీ చేయగలుగుతున్నానంటే.. ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత ఇవి సాధ్యమయ్యాని సోమన్ చెప్తున్నాడు.
సైక్లింగ్
సోమన్ ఫిట్‌గా ఉండేందుకు ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తుంటాడు. సైకిల్ తొక్కడం మన ఫిట్‌నెస్ పెంచడంలో మేజర్ పాత్ర పోషిస్తుందని మిలింద్ తెలిపారు. వ్యాయాయం ముగింపులో.. ఒక నిమిషం హెడ్‌స్టాండ్ చేస్తాడు. అతను తన భంగిమను మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా పుల్-అప్‌లను కూడా అభ్యసిస్తానని తెలిపాడు. రోయింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ మొదలైన వివిధ బహిరంగ కార్యకలాపాలను మిలింద్ ఎక్కువగా ఇష్టపడతాడు.
వ్యాయామ దినచర్య
సోమన్ రోజులోని వేర్వేరు సమయాల్లో నాలుగు నుంచి ఐదు వ్యాయామాల సెట్‌ను చేస్తాడు. వ్యాయామాలలో ఐదు నిమిషాల ప్లాంక్, 50 పుషప్‌ల సెట్, పుల్-అప్ బార్‌లో ఒక సెట్, సమాంతర బార్‌పై మరొక సెట్ ఉన్నాయి. రెండు నిమిషాలు ముగ్దాల్‌ను ఊపడం లేదా కెటిల్‌బెల్ విసరడం కూడా చేస్తాడు. ఎక్కువగా పరిగెత్తుతూ ఉంటాడు. మారథాన్లలో పాల్గొన్ని అందరినీ ప్రేరేపిస్తాడు.
డైట్
తాను శాఖాహారం ఫుడ్‌నే తీసుకుంటానని.. మిలింద్ సోమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అల్పాహారం కోసం.. సీడ్స్, ఒక బొప్పాయి, ఒక పుచ్చకాయ, ఏదైనా కాలానుగుణ పండ్లను తీసుకుంటాడు. మధ్యాహ్న భోజనం కోసం కూరగాయలు, అన్నం, నెయ్యితో చేసిన దాల్ ఖిచ్డీని తీసుకుంటాడు. సాయంత్రం బెల్లంతో చేసిన బ్లాక్ టీ తీసుకుంటాడు. డిన్నర్లో ఒక ప్లేట్ కూరగాయలు లేదా ఖిచ్డీ తీసుకుంటాడు. నిద్రపోయే ముందు పసుపు, బెల్లం కలిపిన వేడినీళ్లు తాగుతాడు.