Mixed Vegetable Soup Recipe : టెస్టీ, హెల్తీ మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్.. మధుమేహం ఉన్నవారికి కూడా..
04 November 2022, 6:54 IST
- Mixed Vegetable Soup Recipe : మధుమేహం ఉన్నవారికి ఏ ఆహారం పెట్టాలన్నా కాస్త సంకోచించాల్సి వస్తుంది. ఇది వారికి సెట్ అవుతుందో లేదో అని. అలా అని వాళ్లకోసం చేసింది మనము తినలేము. కానీ ఇప్పుడు మనం నేర్చుకునే రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు.. మధుమేహం ఉన్నా లేకున్నా ఆరోగ్య ప్రయోజనాల కోసం తమ డైట్లో ఈ రెసిపీని యాడ్ చేసుకోవచ్చు.
మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్
Mixed Vegetable Soup Recipe : ఉదయాన్నే హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు కచ్చితంగా ఫుడ్ విషయంలో ఆలోచించి తీసుకోవాలి. మీ ఇంట్లో మధుమేహం ఉన్నవారు ఉన్నా.. వారితో పాటు మీకు ఓ మంచి హెల్తీ, టేస్టీ రెసిపీ చేయాలనుకుంటే.. మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్ తయారు చేయండి. దీనిని ఎలా చేయాలనుకుంటున్నారా? దీని తయారీకోసం కావాల్సిన పదార్థాలు ఏమిటో? ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* ఉప్పు - రుచికి తగినంత
* టమోటా - 1
* క్యారెట్ - 1
* బఠాణీలు - 3 స్పూన్స్
* ఫ్రెంచ్ బీన్స్ - 5
* నీళ్లు రెండు కప్పులు
* నూనె - కొంచెం
* కరివేపాకు - 5 రెబ్బలు
* జీలకర్ర పొడి - రుచికి తగినంత
* మిరియాల పొడి - రుచికి తగినంత
తయారీ విధానం
పైన పేర్కొన్న అన్ని కూరగాయలను కట్ చేసి ప్రెషర్ కుక్కర్‌లో వేసి.. 2 కప్పుల నీరు పోయండి. దీనిని బాగా ఉడికించండి. అంటే ఓ 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచండి. బాగా ఉడికిన తర్వాత వాటిని బ్లెండర్‌లో కలపండి. ఇప్పుడు ముతక స్ట్రైనర్ తీసుకుని.. దానితో వడకట్టండి. దానిలో ఒక చెంచా నూనె, కరివేపాకు తాలింపును వేయండి. రుచికోసం ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపండి. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహం ఉన్నవారే కాదు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎవరైనా దీనిని తాగవచ్చు.