Black Pepper Tea । చలికాలంలో బ్లాక్ పెప్పర్ టీ తాగితే చాలా మంచిది, ప్రయోజనాలు ఇవే!
10 November 2022, 18:06 IST
- Black Pepper Tea: ఈ చలికాలంలో నల్లమిరియాలతో చాయ్ కాచుకొని తాగితే ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఈ టీ గ్రీన్ టీ కంటే రుచిగా ఉంటుంది, సులభంగా చేసుకోవచ్చు.
Black Pepper Tea
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకునే ఆహారపానీయాలలో మార్పు రావాలి. కాలానుగుణ ఇన్ఫెక్షన్లను శరీరం ఎదుర్కొనేందుకు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. చలికాలంలో బ్లాక్ పెప్పర్ టీ జలుబు, దగ్గుల నుండి తక్షణ ఉపశమమనం అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, బ్లాక్ పెప్పర్ టీ తాగుతూ ఉండటం వలన వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బ్లాక్ పెప్పర్ టీ చేసుకునేందుకు మనకు ప్రధానంగా నల్లమిరియాలు అవసరం. ఈ నల్లమిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది . జీర్ణక్రియకు సహకరిస్తుంది. తద్వారా ఇది శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడాన్ని నివారిస్తుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి బ్లాక్ పెప్పర్ టీ కూడా ఒక మంచి ప్రత్యామ్నాయం. గ్రీన్ టీ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ బ్లాక్ పెప్పర్ టీ ఎంతో రుచిగా ఉంటుంది, ఆరోగ్యకరం కూడా.
నల్ల మిరియాలు యాంటీ బాక్టీరియల్, యాంటీబయాటిక్ గుణాలను కలిగి ఉంటుంది. కొద్ది మోతాదులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవన్నీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
బ్లాక్ పెప్పర్ టీ తాగినపుడు రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులోని పైపెరిన్ మెదడును ప్రేరేపిస్తుంది, ఇది డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది.
మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు బ్లాక్ పెప్పర్ టీ తాగకుండా ఎందుకు ఉండాలి? అయితే చాయ్ తయారు చేసుకోవడం చాలా తేలిక. మన వాడుక భాషలో చెప్పాలంటే ఇది మిరియాల డికాక్షన్ లేదా మిరియాల చాయ్. అయితే ఇక్కడ మనం టీ పొడి ఉపయోగించడం లేదు. ఎలా తయారు చేసుకోవాలో రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Black Pepper Tea Recipe
-కావలసిన పదార్థాలు
- 2-3 కప్పుల నీరు
- 1 టీస్పూన్ నల్లమిరియాలు
- 1 టీస్పూన్ తేనె
- 1 టీస్పూన్ నిమ్మరసం
- 1 అంగుళం అల్లం తురుము
- తయారీ విధానం
- ముందుగా గిన్నెలో నీరు వేడి చేసి అందులో నల్లమిరియాలను కొద్దిగా దంచి వేయండి.
- అలాగే అల్లం తురుమును కూడా వేసి 5-6 నిమిషాల పాటు మరిగించండి.
- ఇప్పుడు ఈ నీటిని కప్పులో వడకట్టండి. ఒక రెండు నిమిషాల పాటు ఉంచి నిమ్మరసం, తేనే కలుపుకోండి.
అంతే, బ్లాక్ పెప్పర్ టీ రెడీ. గోరువెచ్చగా ఆస్వాదించండి.
టాపిక్