Wrong size bra: తప్పు సైజు బ్రా వేసుకుంటున్నారా.. ఈ నొప్పులు, అసౌకర్యానికి కారణం అదే
28 August 2024, 19:00 IST
- Wrong size bra: సరైన బ్రా వేసుకోకపోవడం వల్ల మీకు తెలీకుండానే కొన్ని నొప్పులు, సమస్యలు వస్తాయి. అవి తప్పు బ్రా ఫిట్టింగ్ వల్లే వచ్చినట్లు కూడా చాలా మందికి తెలీదు. ఆ సమస్యలు, తప్పు సైజ్ బ్రా అంటే ఎలా ఉంటుందో తెల్సుకోండి.
తప్పు సైజు బ్రా
తప్పు సైజు లేదా మీకు నప్పని బ్రా వేసుకోవడం వల్ల అసౌకర్యంతో పాటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. సరైన బ్రా వేసుకుంటే మంచి ఫిట్టింగ్ ఉన్న డ్రెస్ వేసుకున్నట్లు అనిపించాలి. అంతేకానీ తరచూ దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం, లేదా దాని గురించే ఆలోచన, అసౌకర్యం ఉంటే సరైన బ్రా వేసుకోవట్లేదనే అర్థం. తప్పు సైజు బ్రా వేసుకుంటే ఎలాంటి అసౌకర్యాలు ఉంటాయో తెల్సుకోండి.
చాతీలో నొప్పి:
మీకు నప్పే సైజుకన్నా బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే అది చాతీని ఒత్తిపట్టి నొప్పికి కారణం అవుతుంది. వదులుగా ఉండే బ్రా వేసుకోవడం వల్ల రొమ్ముకు కావాల్సిన మద్దతివ్వదు. దాంతోనూ చాతీలో నొప్పి మొదలవ్వొచ్చు. కాబట్టి చాతీలో నొప్పి ఉంటే మీ బ్రా సైజు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
మెడ, భుజాల నొప్పి:
తప్పు సైజు బ్రా వేసుకోవడం వల్ల మెడలు, భుజాలు, నడుము దగ్గర నొప్పి రావచ్చు. బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ముల్లో నొప్పి వస్తుంది. ఛాతీ పరిమాణం ఎక్కువగా ఉన్నవాళ్లు వదులుగా ఉన్న బ్రా వేసుకుంటే మెడ, నడుములో నొప్పి వస్తుంది.
భుజాల మీద అచ్చులు:
కొంతమందిలో బ్రా స్ట్రాప్ వేసుకునే చోట లోతుగా అచ్చు పడినట్లు అవుతుంది. ఇది మీరు వేసుకునే బ్రా సైజు తప్పు అని తెలియజేస్తుంది. మీకు నప్పే సైజుకున్నా బిగుతు బ్రా వేసుకోవడం దీనికి కారణం. బ్రా కప్స్ నుంచి కాకుండా భుజాలను బ్రా సపోర్ట్ గా తీసుకుంటుంది. కాబట్టి బ్రా సైజ్ ఒకసారి మార్చిచూడటం మంచిది.
కూర్చునే స్థితి:
బిగుతు బ్రా వేసుకోవడం వల్ల సౌకర్యంగా కూర్చోలేరు. నొప్పి, అసౌకర్యం తగ్గించుకోడానికి కాస్త నడుమును ముందుకు వంచి కూర్చోవడమో, భుజాలను ముందుకు వంచడమో చేయాల్సి వస్తుంది. దీనివల్ల మీరు కూర్చునే స్థితితో పాటే.. భుజాల్లో, నడుములో నొప్పి వస్తుంది.
తప్పు సైజ్ బ్రా అని ఎలా తెలుస్తుంది?
- పైన చెప్పిన సమస్యలతో పాటే ఫిట్టింగ్ కూడా సరిగ్గా ఉండదు. బ్రా పక్కల నుంచి చాతీ భాగం బయటకు కనిపిస్తుంది.
- బ్రా స్ట్రాప్స్ జారిపోతున్నా, మరీ బిగుతుగా ఉన్నా కూడా మీరు వేసుకునేది సరైన బ్రా కానట్లే.
- బ్రా హుక్స్ పెట్టుకునే దగ్గర బిగుతుగా ఉండి, కింది భాగంలో కొవ్వు పేరుకుపోయినట్లు అనిపించినా అది సరైన బ్రా కాదనే అర్థం.
- అలాగే బ్రా కింది భాగంలో ఉండే బ్యాండ్ లేదా ఎలాస్టిక్ వల్ల చర్మం మీద అచ్చులు పడకూడదు. బిగుతుగా అనిపించకూడదు. దానివల్ల రొమ్ముకు తగిన మద్దతు లభించాలి.
టాపిక్