Bra: బ్రా వేసుకోడానికి సరైన వయసు ఏది? ఎలాంటి బ్రా తో మొదలు పెట్టాలి?
Bra age: అమ్మాయిలు ఏ వయసు నుంచి బ్రా వేసుకోవడం మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారా? మొదటి బ్రా ఎలాంటిది వాడాలని ఆలోచిస్తున్నారా? ఆ సందేహాలన్నీ ఇక్కడ తెల్సుకోండి.
అమ్మాయిలు ఏ వయస్సు నుంచి బ్రా వేసుకోవడం మొదలు పెట్టాలనే సందేహం చాలా మంది అమ్మాయిల తల్లి దండ్రులకు, యుక్త వయసులోకి వచ్చిన అమ్మాయిలకూ ఉంటుంది. మొదటిసారి ఎలాంటి బ్రా ఎంచుకోవాలనే విషయంలో మీకున్న సందేహాలు, సరైన వయసు గురించి వివరంగా తెల్సుకోండి.
బ్రా వేసుకోవడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఫలానా వయసులోనే బ్రా వేసుకోవడం మొదలుపెట్టాలని ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేరు. వ్యక్తివ్యక్తికీ అది మారుతూ ఉంటుంది. సాధారణంగా 9 నుంచి 11 సంవత్సరాల మధ్యలో బ్రా వేసుకోవడం మొదలు పెట్టొచ్చు. ఆ వయస్సులోనే అమ్మాయిల శరీరంలో మార్పు రావడం మొదలు అవుతుంది. అలాగే కొన్నిసార్లు వయస్సుతో సంబంధం లేకుండా కూడా బ్రా వేసుకోవడం మొదలు పెట్టాల్సి రావచ్చు.
ఛాతీ పెరుగుదల మొదలైనప్పుడు, దేనికోసం అయినా వంగుతున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు అసౌకర్యంగా అనిపించడం, లేదంటే ఛాతీ దగ్గర సపోర్ట్ అవసరమై అసౌకర్యంగా అనిపించినప్పుడు బ్రా వేసుకోవడం మొదలు పెట్టాలి. ఈ విషయాలన్నీ పిల్లలతో తల్లి తప్పకుండా మాట్లాడి వాళ్ల అవసరాన్ని అర్థం చేసుకోగలగాలి. వాళ్లకు ఈ విషయాల మీద అవగాహన ఉండేలా ముందే చెప్పాలి.
మొదటి సారి ఎలాంటి బ్రా ఎంచుకోవాలి?
ఇదివరకటిలా షాపుకు వెళ్లి ఏదో ఒక బ్రా కొనాల్సిన పనిలేదు. బ్రా గురించి మొహమాట పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంట్లోనే బ్రా సైజు మెజరింగ్ టేపు సాయంతో తెల్సుకోవచ్చు. దాన్ని బట్టి ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టుకునే సౌకర్యమూ ఉంటోంది. అన్నింటికన్నా ముఖ్యం వాళ్లకు ఏ సైజు బ్రా సరిపోతుందీ అని. అందుకే బ్రా సైజు సరిగ్గా చూసుకుని బ్రా కొనాలి.
అలాగే మొదటిసారి టీనేజ్ బ్రా రకాన్ని ఎంచుకోవాలి. ఈ రకం బ్రాలు చాలా సౌకర్యంగా ఉంటాయి. చాలా తక్కువ ప్యాడింగ్ ఉండి మొదటిసారి వేసుకున్నప్పుడు ఏ అసౌకర్యం లేకుండా చూస్తాయి. టీనేజ్ బ్రా క్రాప్ టాప్ లాగా ఉంటుంది. హుక్స్ ఉండవు. దాంతో వాటికి తొందరగా అలవాటు పడిపోతారు.
ఇలాంటి బ్రాలు వద్దు:
అలాగే కప్స్, అండర్ వైరింగ్, లేస్ డిజైనింగ్ ఉన్న బ్రాలు మొదటిసారి ఎంచుకోవాల్సిన అవసరం లేదు. వాటివల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అవసరం తీరకపోగా, వైరింగ్ లాంటివి కుచ్చుకుని పెద్ద ఇబ్బందిలా మారుతుంది. అలాగే డిజైన్లు, ప్రింట్లు ఉన్న బ్రాలు ఎంచుకోవద్దు. న్యూడ్ రంగు బ్రాలు స్కూల్ యునిఫాం మీదకు సరిపోతాయి. అలాంటి రంగుల్నే ఎంచుకోవాలి. బ్రా తప్పకుండా వంద శాతం కాటన్‌తో చేసిందై ఉండాలని గుర్తుంచుకోండి. ఇవి ఏ కాలంలో అయినా సౌకర్యంగా ఉంటాయి.
సరైన బ్రా ఎంచుకున్నారా లేదా?
తప్పు సైజు బ్రా సైజు ప్రభావం ఎదుగుదల మీద పడటం పక్కనపెడితే.. అసౌకర్యం మాత్రం రోజంతా ఉంటుంది. అందుకే కొన్ని విషయాలు తప్పకుండా గమనించాలి. బ్రా స్ట్రాప్ జారిపోవడం, లేదా కుచ్చుకోవడం లాంటివి ఉండకూడదు. బ్రా పక్క వైపుల నుంచి ఛాతీ భాగం బయటికి వచ్చినట్టు కనిపించకూడదు. అలాగే బ్రా కింది భాగంలో ఉండే ఎలాస్టిక్ బ్యాండ్ పైకి జరగడం, ముందు నెక్ దగ్గర ఉండే ఎలాస్టిక్ కిందికి పడిపోవడం ఉండకూడదు. మంచి బ్రా వేసుకుంటే మంచి ఫిట్టింగ్ ఉన్న డ్రెస్ వేసుకున్న అనుభూతి పొందాలి. మీరు మీ పిల్లల్ని ఈ అసౌకర్యాల గురించి అడిగి తెల్సుకోండి.
టాపిక్