Roti Noodles: మిగిలిన చపాతీలతో నోరూరించే నూడుల్స్, ఇలా చేస్తే తృప్తిగా తినేస్తారు
04 October 2024, 6:30 IST
Roti Noodles: మిగిలిపోయిన చపాతీలతో, అప్పుడే చేసిన చపాతీలతోనూ ఈ రోటీ నూడుల్స్ చేసుకోవచ్చు. కూరగాయలు కలిపి చేసే ఈ రెసిపీ ఉదయాన్నే, సాయంత్రం పూట డిన్నర్ లోకీ తినేయొచ్చు.
రోటీ నూడుల్స్
రోటీ నూడుల్స్
మిగిలిన చపాతీలతో రుచికరమైన నూడుల్స్ చేయొచ్చు. మీకిష్టమైన కూరగాయ ముక్కలు కలిపి వేయించి చపాతీతో నూడుల్స్ డిష్ రెడీ చేయొచ్చు. కనీసం రెండు చపాతీలు పిల్లల చేత తినిపించడానికి ఇది బెస్ట్ రెసిపీ.
రోటీ నూడుల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
4 నుంచి 5 చపాతీలు
1 చెంచాడు నూనె
అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
అరచెంచాడు పచ్చిమిర్చి ముద్ద
1 పెద్ద ఉల్లిపాయ, పొడవాటి ముక్కల తరుగు
1 క్యారట్ , పొడవాటి ముక్కల తరుగు
1 కప్పు క్యాప్సికం ముక్కలు
రుచికి సరిపోయేంత ఉప్పు
1 చెంచాడు టమాటా కెచప్
1 చెంచాడు సోయా సాస్
1 చెంచాడు చిల్లీ సాస్
రోటీ నూడుల్స్ తయారీ విధానం:
- ముందుగా చపాతీలను చాకు సాయంతో పొడవాటి ముక్కలుగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. నూడుల్స్ లాగా పొడవుగా ఉండేలా చూసుకోండి.
- ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. వేడెక్కాక అల్లం, వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద కూడా వేసుకోవాలి.
- కాస్త వేగిపోయాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పొడవాటి క్యారట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకుని వేయించుకోవాలి.
- కాస్త పెద్ద మంట మీద రెండు మూడు నిమిషాలు ఈ కూరగాయలన్నీ వేయించండి.
- మీకిష్టమైన మరింకేమైనా కూరగాయలు కూడా వీటిలో వేసుకోవచ్చు.
- తర్వాత ఉప్పు, మిరియాల పొడి, సాస్‌లు వేసి కలుపుకోండి.
- అందులో నూడుల్స్ లాగా కట్ చేసుకున్న చపాతీ ముక్కలు వేసుకోండి. సాస్ బాగా అంటుకునేలా కలుపుకోండి. అంతే.. చపాతీ నూడుల్స్ రెడీ అయినట్లే.