Chilli Mushroom: స్పైసీ చిల్లీ మష్రూమ్.. చిల్లీ సాస్‌తో సహా ఇంట్లోనే ఇలా చేసేయండి..-know how to make chilli mushroom at home in easy way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chilli Mushroom: స్పైసీ చిల్లీ మష్రూమ్.. చిల్లీ సాస్‌తో సహా ఇంట్లోనే ఇలా చేసేయండి..

Chilli Mushroom: స్పైసీ చిల్లీ మష్రూమ్.. చిల్లీ సాస్‌తో సహా ఇంట్లోనే ఇలా చేసేయండి..

Koutik Pranaya Sree HT Telugu
Jun 28, 2024 03:30 PM IST

రెస్టారెంట్ స్టైల్ చిల్లీ మష్రూమ్ ఇంట్లో చేసుకోవడం సులభం. ఎన్ని చేసినా ఇష్టంగా తింటారు. పిల్లలూ, పెద్దలు తినే ఈ స్టార్టర్ లేదా స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి.

చిల్లీ మష్రూమ్ రెసిపీ
చిల్లీ మష్రూమ్ రెసిపీ

చిల్లీ మష్రూమ్ రెస్టారెంట్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా తింటాం. కానీ ఇంట్లో చేసుకుంటే ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. ఫుడ్ కలర్, ఇతర సాస్‌లు కలిపారో ఏమోనని బయట వీటిని ఎక్కువగా తినలేం. ఇంట్లో చేసుకుని ఆస్వాదించేయండి.

చిల్లీ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

పావు కేజీ పుట్టగొడుగులు

పావు కప్పు కార్న్ స్టార్చ్

2 చెంచాల మైదా

తగినంత ఉప్పు

1 చెంచా కారం

వంటనూనె

చిల్లీసాస్ కోసం:

4 ఎండుమిర్చి

2 చెంచాల టమాటా సాస్

పావు కప్పు సన్నటి ఉల్లిపాయ ముక్కలు

1 చెంచా అల్లం ముక్కలు

1 చెంచా వెల్లుల్లి ముక్కలు

గ్రేవీ కోసం:

2 చెంచాల నూనె

1 చెంచా అల్లం వెల్లుల్లి ముక్కలు

3 ఎండుమిర్చి

1 ఉల్లిపాయ, పెద్ద ముక్కలు

1 క్యాప్సికం, పెద్ద ముక్కలు (అందుబాటులో ఉంటే రెడ్, ఎల్లో క్యాప్సికం ముక్కలు వేసుకోవచ్చు)

1 చెంచా వైట్ వెనిగర్

1 చెంచా సోయాసాస్

2 చెంచాల కార్న్ ఫ్లోర్

చిల్లీ మష్రూమ్ తయారీ విధానం:

1. ముందుగా పుట్టగొడుగుల్ని రెండు ముక్కలు చేసుకోవాలి. మరీ చిన్నగా ముక్కలు ఉండకూడదు. ఈ ముక్కల్ని వెడల్పాటి బౌల్ లో తీసుకోవాలి.

2. మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, చెంచా నూనె వేసుకుని ఒకసారి కలపాలి. దాంట్లో చెంచా నీళ్లు పోసుకుని పిండి పుట్ట గొడుగులకి అంటుకునేలా కలుపుకోవాలి.

3. కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి. వేడెక్కాక పుట్టగొడుగుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక బయటకు తీసుకోవాలి.

4. ఇప్పుడు చిల్లీసాస్ తయారు చేసుకోవాలి. మీరు మార్కెట్లో రెడీమేడ్ గా దొరికే చిల్లీ సాస్ వాడాలనుకుంటే ఇది వదిలేయొచ్చు.

5. ముందుగా ఎండుమిర్చిని వేడినీళ్లలో నానబెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఎండుమిర్చి మెత్తబడతాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా సాస్, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. అంతే.. చిల్లీ సాస్ రెడీ అయినట్లే.

6. ఇప్పుడు సాస్ కోసం రెండు చెంచాల కార్న్ ఫ్లోర్‌ను పావుకప్పు నీళ్లలో కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని ఒక నిమిషం వేయించాలి. తర్వాత కాస్త పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వెంటనే క్యాప్సికం ముక్కలు కూడా వేసుకుని పెద్ద మంట మీద ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి.

8. దాంట్లోనే వెనిగర్, సోయా సాస్, మనం తయారు చేసి పెట్టుకున్న చిల్లీ సాస్ వేసుకుని కలుపుకోవాలి. సన్నం మంట మీద ఉడకనివ్వాలి. కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.

9. ఇప్పుడు ముందుగా నీళ్లలో కలిపి పెట్టుకున్న కార్న్ స్టార్చ్ కూడా కలుపుకుంటే గ్రేవీ చిక్కగా అవుతుంది. అది వేసుకున్నాక కలుపుతూ ఉండాలి.

10. గ్రేవీ చిక్కబడుతుంటే.. ముందుగా వేయించి పెట్టుకున్న పుట్టగొడుగులు వేసుకోవాలి. స్టవ్ కట్టేసుకోవాలి.

11. చివరగా ఉల్లి కాడలతో అలంకరించి సర్వ్ చేసుకుంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్ లో ఉండే చిల్లీ మష్రూమ్ రెడీ. వీటిని స్టార్టర్ లాగా సర్వ్ చేయొచ్చు. లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు సైడ్ డిష్ గా చేయొచ్చు.

Whats_app_banner