Airport Lounge Access । విమానాశ్రయంలో సుదీర్ఘ నిరీక్షణలు చేస్తున్నారా? ఈ వసతుల గురించి తెలుసా?
01 June 2023, 11:15 IST
- Airport Lounge Access: విమానాశ్రయంలో సుదీర్ఘ నిరీక్షణలతో మీరు విసుగు చెందుతున్నారా. విమానాశ్రంలో ఉండేటువంటి విలాసవంతమైన లాంజ్‌లలో విశ్రాంతి తీసుకోవచ్చు, ఈ సౌకర్యాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Airport Lounge Access
Airport Lounge Access: మీరు ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తారా? అయితే మీరు విమానాశ్రయంలో మీకు లభించే వసతులను వాడుకుంటున్నారా? ఈ కథనంలో మీకు ఆ వివరాలు తెలియజేస్తున్నాం. సాధారణంగా బస్సు ప్రయాణం, రైలు ప్రయాణం చేయాలంటే సమయానికి వస్తే సరిపోతుంది. కానీ విమాన ప్రయాణం చేసేటపుడు మాత్రం విమానం టేకాఫ్ తీసుకునే కనీసం గంట ముందే అక్కడకు చేరుకోవాలి, అంతర్జాతీయ ప్రయాణాలకైతే రెండు గంటల ముందే చేరుకోవాలి. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా మీ ఫ్లైట్ ఎక్కాలంటే ఎల్లప్పుడూ మూడు నుండి నాలుగు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సలహా ఇస్తారు, తద్వారా మీకు తగినంత సమయం ఉంటుంది, మీ ఫ్లైట్ మిస్ అయిందని చింతించాల్సిన అవసరం ఉండదు.
మీరు మీ ప్రయాణానికి చాలా ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవడం ఉత్తమం. ఎందుకంటే, మీరు మీ ఫ్లైట్ ఎక్కేముందు.. వివిధ దశల సెక్యూరిటీ తనిఖీలు దాటడం, క్యూలో నిలబడి బోర్డింగ్ పాస్ తీసుకోవడం, లగేజ్ ట్యాగ్స్ తీసుకోవడం, ఇమ్మిగ్రేషన్ ఇతరత్రా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయినపుడు మాత్రమే మీరు మీ ఫ్లైట్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోగలుగుతారు.
అయినప్పటికీ, ఈ లాంఛనాలన్నీ మీరు త్వరగా పూర్తి చేసునపుడు మీ ఫ్లైట్ టేకాఫ్ తీసుకునేందుకు చాలా సమయం ఉండవచ్చు లేదా మరింత ఆలస్యం కావచ్చు. లేదా ఎక్కడైనా కొన్ని గంటలు లేఓవర్ ఉండవచ్చు. ఇలాంటపుడు చాలా సేపు వేచి ఉండాల్సి వస్తుంది. సుదీర్ఘ నిరీక్షణలతో మీరు చాలా విసుగు చెందవచ్చు. కానీ, ఇలా వేచి చూడకుండా విమానాశ్రంలో ఉండేటువంటి విలాసవంతమైన లాంజ్‌లలో విశ్రాంతి తీసుకోవచ్చు.
తక్కువ ధరకే విలాసవంతమైన సౌకర్యాలు
అనేక ప్రధాన విమానాశ్రయాలు తమ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేని సౌకర్యవంతమైన, ఆనందదాయకమైన వసతులను అందిస్తున్నాయి. అవి చాలా ఖరీదైనవేమో అనుకోవచ్చు, కానీ చాలా తక్కువ ధరకే లభిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఉచితంగా కూడా ఈ సౌకర్యాలను ఆస్వాదించవచ్చు.
ఎయిర్‌పోర్ట్ లాంజ్ అనేది మీ ఫ్లైట్ టేకాఫ్‌కు ముందు లేదా ఎక్కువసేపు లేయర్‌ల సమయంలో చల్లగా విశ్రాంతి తీసుకోవడానికి అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఒకటి. ఈ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లలో మీరు వివిధ రకాల ఆహార పదార్థాలతో కూడిన బఫే అందిస్తారు లేదా స్నాక్స్, డ్రింక్స్ ఉంటాయి. సౌకర్యవంతమైన సీటింగ్, ఉచిత Wi-Fi, స్నానానికి షవర్లు, నిద్రించటానికి స్లీపింగ్ పాడ్‌లు, రిలాక్స్ కోసం స్పా మసాజ్ సౌకర్యాలు వంటి అనేకం అందిస్తాయి. వీటిని పొందటానికి మీ వద్ద చెల్లుబాటు అయ్యే విమాన టికెట్ ఉంటే చాలు, నామమాత్రపు ధరకే ఈ సౌకర్యాలు అందుకోవచ్చు.
కొన్ని క్రెడిట్/ డెబిట్ కార్డులు, బిజినెస్ క్లాస్ లో ప్రయాణాలు చేసే వారికి, మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ స్కీంలో చేరినవారికి మరింత ప్రీమియం సేవలు ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈసారి విమాన ప్రయాణం చేసేటపుడు టేకాఫ్ కోసం ఇంకా చాలా సమయంటే, విమానాశ్రయ అథారిటీలోని లాంజ్ కోసం అన్వేషించి అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకోండి, విలాసాలను అనుభవించండి, సౌకర్యంగా సురక్షితంగా ప్రయాణించండి.