Saturday Motivation: ప్రశాంతమైన జీవితానికి గౌతమ బుద్ధుడు చెప్పే బోధనలు ఇవే
18 May 2024, 5:00 IST
- Saturday Motivation: కఠినమైన పదాలను ఉపయోగించకపోవడం నుండి ఒంటరిగా జీవితంలో బతకడం వరకు మీ జీవితానికి మార్గనిర్దేశకం చేసే బుద్ధుడి బోధనలు ఎన్నో ఉన్నాయి.
గౌతమ బుద్దుని బోధనలు
బుద్ధ పూర్ణిమ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ సమాజం భక్తి శ్రద్ధలతో జరుపుకునే బుద్ధ పూర్ణిమను దేశంలోని అనేక ప్రాంతాల్లో వైశాఖ పూర్ణిమ లేదా వెసక్ అని కూడా పిలుస్తారు. బౌధ్ధ ప్రజలు ఈ పవిత్రమైన రోజును వేడుకలా నిర్వహించుకుంటారు. గౌతమ బుద్ధుని జయంతిని బుద్ధ పూర్ణిమగా నిర్వహించుకుంటారు. ఈ రోజున సిద్ధార్థ గౌతముడు బుద్ధగయలోని పవిత్ర బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారాడు.
ఈ సంవత్సరం బుద్ధ పూర్ణిమ మే 23 గురువారం నిర్వహించుకుంటారు. ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకుంటున్నప్పుడు గౌతమ బుద్ధుని బోధనలను, శాంతి, అహింస, ఆప్యాయతలతో కూడిన జీవితాన్ని ఆయన బోధనల ద్వారా నేర్చుకోవచ్చు. గౌతమ బుద్ధుడి బోధనలు జీవితంలో ఎంతో స్పూర్తిని నింపుతాయి. జీవితంపై ఆశను పెంచుతాయి. అత్యాశను తగ్గిస్తాయి.
మీ జీవితాన్ని మార్చే గౌతమ బుద్ధుని బోధనలు
ఈ విశ్వంలో ఏదీ కోల్పోలేదు: గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రకారం మనం చేసిన పని ఫలితం తిరిగి మనకే వస్తుంది. కాబట్టి, ఏ పని అయినా శ్రద్ధా, ప్రేమతో చేయాలి. జీవితాన్ని ఆనందంగా గడపాలి.
ప్రతిదీ మారుతుంది: మార్పు ఈ ప్రపంచంలో స్థిరంగా ఉంటుంది. మీ చుట్టూ పరిస్థితులు ఎలా మారినా మీరు దానిని స్వీకరించడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా జీవించగలరు.
వర్తమానంలో జీవించండి: గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కంటే వర్తమానంపై దృష్టి పెట్టాలని బుద్ధుడు ప్రజలను కోరారు.
సత్యాన్ని దాచలేం: సూర్యచంద్రుల మాదిరిగానే సత్యాన్ని కూడా కంటికి కనిపించకుండా దాచలేమని వివరిస్తున్న గౌతమ బుద్ధుడు. నిజం కాస్త ఆలస్యమైనా కచ్చితంగా బయటికి వస్తుంది.
పాజిటివ్ గా ఆలోచించండి: మనస్సు ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. సానుకూల జీవితాన్ని పొందడానికి మీరు మనస్సును సానుకూల ఆలోచనలతో నింపాలి.
వదులుకోవద్దు: మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా మీపై మీకు శ్రద్ధను, ఇష్టాన్ని వదులు కోవద్దు. అదే జీవితానికి చుక్కానిలాంటిది.
ఒంటరిగా నడవండి: కొన్నిసార్లు మనం సత్యమార్గంలో నడిచినప్పుడు తోడు ఎవరూ రాకపోవచ్చు. అయినా సరే ఒంటరిగానే నడవాలి కానీ… సత్య మార్గాన్ని వదలకూడదు.
కఠినమైన పదాలు వద్దు: నాలుక ఎంతటి మాటనైనా సులువుగా అనేస్తుంది. ఒక వ్యక్తిని బాధపెడుతుంది . మీరు మాట్లాడే మాట పొదుపుగా ఉండాలి. పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.
శరీరమే మన ఆస్తి: మన శరీరమే మన గొప్ప ఆస్తి. దాన్ని మనం శ్రద్ధగా, ప్రేమగా చూసుకోవాలి.
మీ కోపాన్ని నియంత్రించుకోండి: మన కోపం మన స్వభావానికి విరుద్ధమైన పనులు చేసేలా చేస్తుంది. దాన్ని మీరు నియంత్రించుకోవాలి.
గతాన్ని ఎన్నడూ గుర్తుంచుకోవద్దు: గతం గడిచి పోయింది. దాన్ని విడిచిపెట్టాలి. వర్తమానంలోనే జీవిస్తూ ముందుకు నడవాలి.
సంతృప్తి: సంతోషంగా జీవించేందుకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి. లేని దాని కోసం బాధపడే కన్నా… ఉన్నదాన్ని చూసి ఆనందించడం వల్ల ఎంతో ఆనందం దక్కుతుంది.