Sunday Motivation: ప్రతిరోజును ఇలా సానుకూలంగా ప్రారంభించండి, ఆ రోజంతా ఆనందంగానే సాగిపోతుంది
Sunday Motivation: రోజును ఎంత పాజిటివిటీతో ప్రారంభిస్తారు. ఆ రోజంతా కూడా అదే సానుకూలత మీలో ప్రవహిస్తూ ఉంటుంది. రోజును సానుకూలంగా ప్రారంభించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
Sunday Motivation: ఉదయం లేవగానే మీరు ఏం పని చేస్తారు? ఫోను పట్టుకుని మెయిల్స్ చెక్ చేస్తారా? మెసేజ్లు చూస్తారా? లేక స్నేహితులతో చాటింగ్ మొదలు పెట్టేస్తారా? ఇలాంటివన్నీ చేస్తే మీరు ఆరోజు అంతా గందరగోళంగానే ఉంటారు. ఉదయాన మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నిటికీ ఒక గంట సేపు సెలవ్ ఇచ్చేయండి. మీ రోజున సానుకూలంగా మార్చుకోవాలంటే కొన్ని పనులు చేయాలి. కొత్త రోజు, కొత్త బాధ్యతలతో పాటు కొత్త ఆశలు కలలను తెస్తుంది. మీరు మీ ఉదయాన్ని ప్రారంభించే విధానాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మీ మనోబలాన్ని పెంచేదిగా మిమ్మల్ని మరింత ఉత్తేజ పరిచేదిగా ఆ రోజు గడవాలంటే మీరు కొన్ని పనులు చేయాలి.
ఉదయం లేవగానే ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ముట్టుకోకండి. వాటి జోలికి కూడా వెళ్ళకండి. కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. మీలోనే మీరు కాసేపు గడపండి.
చాలామంది నిద్ర నుంచి లేవడానికి అలారం పెట్టుకుంటారు. ఆ అలారం సౌండ్ కూడా భయపెట్టేదిలా కాకుండా చాలా సున్నితంగా ఉండేలా చూసుకోండి. కొన్ని అలారం టోన్లు చాలా ఓదార్పుగా అనిపిస్తాయి. మనసుకు శాంతిని ఇస్తాయి. అలాంటి వాటిని పెట్టుకోండి. అవి వింటూ నిద్ర లేవడం వల్ల మనస్సు, మెదడు ఉత్తేజతమవుతాయి.
ఉదయాన్నే యోగా చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరాన్ని, మనస్సును ఉత్తేజపరుస్తుంది. మీ ఇంద్రియాలను మేల్కొల్పుతుంది. శరీరనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. ఈ యోగా సాధన జీవక్రియను పెంచుతుంది. నిద్రా విధానాన్ని నియంత్రిస్తుంది. మీ శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. దీని వల్ల మీరు చాలా సానుకూలంగా ఆరోగ్యంగా ఉంటారు.
ఉదయం లేవగానే న్యూస్ పేపర్ పట్టుకొని క్రైమ్ న్యూస్ లు, రాజకీయ వార్తలు చదవకుండా ఏదైనా ఒక సానుకూలమైన అందమైన వార్తను చదవండి. అది చదివితే జీవితం మీద సానుకూల ప్రభావం పడేలా ఉండాలి. సానుకూలమైన కోట్స్ చదివినా మంచిదే.
ఆ తర్వాత కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్‌ను చేయండి. ఎప్పుడూ కూడా బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. ఒక రోజులో మనం తినే ఆరోగ్యకరమైన ఆహారం బ్రేక్ ఫాస్ట్. ఇది రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. ఈ బ్రేక్ ఫాస్ట్ ను చాలా ప్రశాంతంగా తినడం అలవాటు చేసుకోండి. ఇది మీకు ఏకాగ్రతను, రోజంతా పనిచేసే శక్తిని అందిస్తుంది.
మీ ఇంట్లో మొక్కలు ఉంటే కాసేపు ఆ మొక్కల దగ్గర కూర్చోండి. ఆ మొక్కలకు నీళ్లు పోయడం వాటిని పరిశుభ్రంగా ఉంచడం వంటి పనులు చేయండి. ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది. మొక్కలకు ఉదయాన్నే నీళ్లు పోయడం వల్ల మీలో సానుకూల సానుకూల ఆలోచనలు పెరుగుతాయి.
కృతజ్ఞతా భావాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మీకు మీ జీవితంలో ఎక్కువగా హెల్ప్ సాయం చేసిన వ్యక్తులను ఒకసారి తలుచుకోండి. మీ ముఖంపై తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. మీ కుటుంబాన్ని ప్రేమగా పలకరించండి. చిన్నపిల్లలను కౌగిలించుకొని గుడ్ మార్నింగ్ చెప్పండి. దేవునికి నమస్కరించుకొని ఇక పనులు మొదలు పెట్టండి. ఇప్పుడు మీ ఫోన్ ముట్టుకొని మెయిల్స్, మెసేజ్లు చెక్ చేసుకోండి. అప్పటివరకు ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లకి దగ్గరికి పోకుండా ఉండడంవల్ల మీకు ఆ రోజంతా చాలా సానుకూలంగా ఉంటుంది. ఇలా కొన్ని రోజులు చేసి చూడండి. ప్రభావం మీకు స్పష్టంగా తెలుస్తుంది.