Valentine’s Destinations । వాలెంటైన్స్ వీక్‌లో ప్రేమ జంటల విహారానికి రొమాంటిక్ ప్రదేశాలు ఇవే!
31 January 2023, 20:57 IST
- Valentine’s Romantic Destinations: ప్రేమికుల రోజు సమీపిస్తోంది. మీ ప్రియమైన భాగస్వామితో చిరస్మరణీయ విహారయాత్ర చేయాలనుకుంటే కొన్ని రొమాంటిక్ ప్రదేశాలు ఇక్కడ తెలుసుకోండి.
Valentine’s Romantic Destinations
చాలా మంది ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ప్రత్యేకమైన రోజు అయినటువంటి ఫిబ్రవరి 14 - వాలంటైన్స్ డే సమీపిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రేమ పక్షులు, సింగిల్ పక్షులు ఎన్నో రకాల ప్రణాళికలను వేసుకొని ఉంటారు. తమ ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అని, తమ ప్రియమైన వారికి ఎక్కడికైనా తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలని, అలాగే ఏదైనా గొప్ప బహుమతిని ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటూ ఉండవచ్చు.
పెళ్లి అయిన వారికి పెళ్లి రోజు అంటూ ప్రత్యేకంగా జరుపుకుంటున్నట్లే. పెళ్లి కాని వారు, త్వరలో పెళ్లి చేసుకోబోయే వారు కూడా ఈ ప్రేమికుల రోజును ప్రత్యేకంగా భావిస్తారు. ఒకరినొకరు ప్రేమించుకునే భార్యాభర్తలు కూడా ఈ ప్రేమికుల రోజు కోసం ఏదైనా శృంగారభరితమైన విహారయాత్ర చేయాలని కోరుకుంటారు.
Valentine’s Romantic Destinations- ప్రేమికుల విహారానికి రొమాంటిక్ గమ్యస్థానాలు
ప్రేమ పక్షులు విహరించడానికి భారతదేశంలోని కొన్ని అద్భుతమైన రొమాంటిక్ గమ్యస్థానాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇక మీ జంట పక్షితో ఇక్కడకు ఎగిరిపోవడమే తరువాయి.
వయనాడ్, కేరళ
దేవతల స్వంత దేశంగా పిలిచే కేరళ రాష్ట్రంలో ఉన్న వయనాడ్ ప్రేమ జంటలకు కలల గమ్యస్థానంగా చెప్పవచ్చు. ఫిబ్రవరి నెలలో ఈ ప్రాంతం అంతా చల్లగా, ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయి. అనేక ఆకర్షణీయమైన జలపాతాలు, చారిత్రక గుహలు, సుగంధ తోటలు, వైల్డ్ లైఫ్ పార్కు మొదలైనవి జంటలను ఆహ్లాదపరుస్తాయి.
ఊటీ, తమిళనాడు
ప్రేమికులు ఎప్పుడూ ఊహాలోకంలో విహరిస్తారు, అలాంటి ప్రేమికులు ఊటీ వెళ్తే, వారు కలలుగన్న ఊహాలోకం కళ్లముందు సాక్షాత్కారం అవుతుంది. నిచ్చెలి చేతిలో చెయ్యి వేసి, పొగమంచు నిండిన కొండ ప్రాంతాలు, పచ్చని పరుపు పరిచినట్లు ఉండే తేయాకు తోటలు, పచ్చికబయళ్లతో తివాచీలా పరిచినటువంటి మైదానాలు, తాజా శ్వాస అందించే పిల్ల గాలులు అన్నింటిని ఆస్వాదించవచ్చు. మరి ఊటీ కన్నా రొమాంటిక్ డెస్టినేషన్ మరొకటి ఉంటుందా.
పహల్గాం, జమ్మూ - కాశ్మీర్
క్రిస్టల్ క్లియర్ సరస్సులు, హిమాలయా పర్వతాలు, రుచికరమైన ఆహారం, పక్కనే మీ తోడు. కాశ్మీర్ అందించే సుందరమైన దృశ్యాలలో మునిగిపోండి. వెచ్చని అనుభూతులను సొంతం చేసుకోండి. వాలెంటైన్స్ డే సందర్భంగా సందర్శించాల్సిన గొప్ప ప్రదేశాలలో ఇది ఒకటి.
చైల్, హిమాచల్ ప్రదేశ్
చైల్ ఒక అద్భుతమైన హిల్ టౌన్. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత ప్రశాంతమైన గమ్యస్థానాలలో ఒకటి. శృంగార విహారం కోసం కచ్చితమైన గోప్యతను అందిస్తుంది. మరపురాని జ్ఞాపకాలను పంచుతుంది. ఇది వాలెంటైన్స్ డే వేడుకలకు అనువైన ప్రాంతం.తమ కొత్త జీవితాన్ని కలిసి ప్రారంభించడానికి చూస్తున్న జంటలకు ఉత్తమ ఎంపిక.
ముస్సోరీ, ఉత్తరాఖండ్
చాలా మంది ప్రేమికులు వెళ్లాలి అనుకునే కలల గమ్యస్థానం ముస్సోరి. వాలెంటైన్స్ డే కోసం సందర్శించడానికి ముస్సోరీ గొప్ప ప్రదేశం. ఏడాది పొడవునా ప్రకృతి ప్రేమికులందరికీ ఇది ఆహ్లాదకరమైన గమ్యస్థానం. మరపురాని శృంగార వారాంతాన్ని ఆస్వాదించాలనుకుంటే, ముస్సోరీ వెళ్లండి.