తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Renault Festive Limited Edition। కిగర్, ట్రైబర్, క్విడ్‌లలో ప్రత్యేక ఎడిషన్స్!

Renault Festive Limited Edition। కిగర్, ట్రైబర్, క్విడ్‌లలో ప్రత్యేక ఎడిషన్స్!

HT Telugu Desk HT Telugu

01 September 2022, 21:21 IST

google News
    • రెనాల్ట్ కంపెనీ కిగర్, ట్రైబర్, క్విడ్ లలో లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది. Renault Festive Limited Edition పేరుతో విడుదలైన ఈ కార్లలో ఏం కొత్త అప్‌డేట్‌లు వచ్చాయో తెలుసుకోండి.
Renault Festive Limited Edition
Renault Festive Limited Edition

Renault Festive Limited Edition

పండుగ సీజన్‌లో కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్ తమ కాంపాక్ట్ SUV మోడల్ కార్లు అయినటువంటి కిగర్, ట్రైబర్, క్విడ్ లలో లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌ను రెనాల్ట్ ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ (LE) అనే పేరుతో పిలుస్తోంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ కార్లకు సెప్టెంబర్ 2, 2022 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతున్నాయి.

రెనాల్ట్ అనేది భారత మార్కెట్లో మంచి మార్కెట్ కలిగిన యూరోపియన్ బ్రాండ్. ఈ కంపెనీ తొలుత మహీంద్రా సహకారంతో లోగాన్‌ను విడుదల చేసింది, ఆ తర్వాత డస్టర్‌ను విడుదల చేసి తన మార్కెట్ ను సుస్థిరం చేసుకుంది. తర్వాతి కాలంలో ఎంట్రీలెవెల్ రెనాల్ట్ క్విడ్ కార్లు దేశంలో భారీగా అమ్ముడయ్యాయి. వీటితో బ్రాండ్ దేశవ్యాప్తంగా సుపరిచితమైంది. అయితే ఇటీవల కాలంలో రెనాల్ట్ మార్కెట్ డల్ అయింది, సేల్స్ భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే పరిమిత ఎడిషన్‌లను విడుదల చేసి మళ్లీ పూర్వవైభవం పొందాలని రెనాల్ట్ భావిస్తోంది.

Renault Festive Limited Edition

మరి రెనాల్ట్ తీసుకొస్తున్న ఈ ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఏం మారుతున్నాయి అంటే? ఇవి కేవలం సౌందర్యానికి మాత్రమే పరిమితం. మెకానికల్స్ పరంగా ప్రతీ కారు వాటి పాత వేరియంట్‌లకు సమానంగా ఉంటాయి. కిగర్, క్విడ్, ట్రైబర్ కార్లు వాటి RXZ వేరియంట్ ఆధారంగా కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను మాత్రమే పొందుతాయి. ఇవి డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో రాబోతున్నాయి. అంటే ఈ కార్లు ఐస్ వైట్ వైట్ కలర్‌లో పైభాగం మిస్టరీ బ్లాక్ రూఫ్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక ఎడిషన్ కార్ల కోసం కంపెనీ ప్రత్యేకంగా ఛార్జ్ చేయడం లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న ధరలకే వీటి విక్రయాలు చేపడుతున్నారు. సాధారణం ఈ కార్లు ఎక్స్-షోరూం వద్ద రూ. 4.5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఉంటాయి.

ఫెస్టివల్ ఎడిషన్ లోని అన్ని మోడళ్లను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే, ఈ కింది విధంగా మార్పులు ఉండబోతున్నాయి.

రెనాల్ట్ కిగర్

రెనాల్ట్ కిగర్ కాంట్రాస్టింగ్ బ్లాక్ రూఫ్‌తో తెల్లటి బాహ్య షేడ్‌లో ఉంటుంది. సిల్వర్‌స్టోన్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్‌లు ఉంటాయి. అదనంగా, రెడ్ యాక్సెంట్‌ ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్ యూనిట్లు, డోర్‌లపై కూడా మార్పులు కనిపిస్తాయి. ఈ కార్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

రెనాల్ట్ ట్రైబర్

ట్రైబర్ MPV కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ రంగులలో అందిస్తున్నారు. ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్ లపై ఎరుపు రంగు యాక్సెంట్‌లు స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. అలాగే వీల్ కవర్‌లు, డోర్ హ్యాండిల్స్ గ్లోస్ బ్లాక్‌లో ఇవ్వడం వలన ఈ కార్ విజువల్ అప్పీల్‌ మరింత పెరిగింది.

రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ క్విడ్ కూడా మిగిలిన రెండు మోడళ్ల మాదిరిగానే డ్యూయల్-టోన్ పెయింట్‌ను పొందుతుంది. దీని డిజైన్ క్లైంబర్ ఎడిషన్ ఆధారంగా ఉంటుంది. ముందు, వెనుక స్కిడ్ ప్లేట్లు, రూఫ్ రెయిలింగ్లపై ఎరుపు రంగు ఇన్సర్ట్‌లు, సి-పిల్లర్‌పై ఎరుపు రంగు 'క్లైంబర్' అలంకరణలు ఉన్నాయి. ఇంకా, వీల్ కవర్‌లు, ORVMలపై గ్లోస్ బ్లాక్ ఇన్‌సర్ట్‌లు కాంట్రాస్టింగ్ రూఫ్‌తో అందంగా కనిపిస్తుంది.

తదుపరి వ్యాసం