తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pudina Rasam: పుదీనా చారు ఇలా చేశారంటే చలికాలంలో నోరూరించేలా ఉంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

Pudina Rasam: పుదీనా చారు ఇలా చేశారంటే చలికాలంలో నోరూరించేలా ఉంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

Haritha Chappa HT Telugu

12 December 2024, 11:32 IST

google News
    • Pudina Rasam: పుదీనా వాసన చూస్తేనే ఉత్తేజితంగా అనిపిస్తుంది. ఇక పుదీనాతో చేసే వంటలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక్కడ మేము పుదీనా చారు రెసిపీ ఇచ్చాము. పుదీనాతో పెట్టుకున్న రసం వేడివేడిగా అన్నంతో తింటే అదిరిపోవడం ఖాయం.
పుదీనా రసం రెసిపీ
పుదీనా రసం రెసిపీ

పుదీనా రసం రెసిపీ

పుదీనాను వాడడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలే జరుగుతుంది. ముఖ్యంగా మాంసాహారం వంటకాలకు పుదీనా ఎంతో రుచిని అందిస్తుంది. బిర్యానీలో పుదీనా పడితేనే ఘుమఘుమలాడే వాసన వచ్చేది. పుదీనాను వాసనను పీల్చడం వల్ల కూడా మెదడు రిఫ్రెష్మెంట్ పొందుతుంది. ఇక్కడ మేము పుదీనా చారు లేదా పుదీనా రసం రెసిపీని ఇచ్చాము. చలికాలంలో ఈ పుదీనా చారును చేసుకుని తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగ్గా అవుతుంది. డిప్రెషన్, ఒత్తిడి వంటి వాటితో బాధపడుతున్నవారు పుదీనా చారును తరచూ తినాలి. పుదీనా చారు నుంచి వచ్చే ఆ వాసన మెదడుకు ఎంతో నచ్చుతుంది. పుదీనా చారు రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పుదీనా చారు రెసిపీకి కావలసిన పదార్థాలు

కందిపప్పు - అరకప్పు

పుదీనా తరుగు - అరకప్పు

పసుపు - పావు స్పూను

నీళ్లు - తగినన్ని

శెనగ పప్పు - ఒక స్పూను

చింతపండు - నిమ్మకాయ సైజులో

నెయ్యి - రెండు స్పూన్లు

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - రెండు స్పూన్లు

ఇంగువ - చిటికెడు

ఎండుమిర్చి - ఆరు

ధనియాలు - ఒక స్పూను

నల్ల మిరియాలు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పుదీనా చారు రెసిపీ

1. పుదీనా చారును తయారు చేసేందుకు ముందుగా చారు పొడిని తయారు చేసుకోవాలి.

2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, శెనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

3. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చారు పొడి రెడీ అయినట్టే.

4. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు, నీళ్లు వేసి నానబెట్టుకోవాలి.

5. చింతపండును నానబెట్టాక చేత్తోనే చింతపండును పిసికి గుజ్జును వేరు చేయాలి.

6. ఆ చింతపండు గుజ్జులో నీళ్లను పోసి బాగా కలుపుకోవాలి.

7. అలాగే పసుపు, ఉప్పు వేసి కూడా కలుపుకోవాలి.

8. ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న చారు పొడిని కూడా వేసి బాగా కలపాలి.

9. మీకు రసం ఎంత మొత్తంలో కావాలో అంత మొత్తంలో నీటిని కలుపుకోండి.

10. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఒక పొంగు వచ్చేదాకా మూత పెట్టి మరిగించాలి.

11. మరోపక్క కుక్కర్లో కందిపప్పు మెత్తగా ఉడకబెట్టుకోవాలి.

12. ఇప్పుడు చారులో మెత్తగా ఉడకబెట్టుకున్న కందిపప్పును, పుదీనా తరుగును వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని అరగంట పాటు ఉడికించుకోవాలి.

13. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

14. ఆ నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకోవాలి.

15. దీన్ని చారుపైన తాలింపు లాగా పోసుకోవాలి. అంతే టేస్టీ పుదీనా చారు రెడీ అయినట్టే.

16. దీనిలో మనం పప్పు కూడా వేసాము కాబట్టి పోషకాలు రెట్టింపు అవుతాయి.

17. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఇడ్లీలో కూడా దీన్ని తినవచ్చు. ఇడ్లీ. పుదీనా చారు కాంబినేషన్ ఎంతో టేస్టీగా ఉంటుంది

పుదీనా ఉపయోగాలు

పుదీనాలో ఉండే పోషకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు మంట, సైనస్ ఇన్ఫెక్షన్లు, శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. అందుకే చలికాలంలో పుదీనాను అధికంగా తింటూ ఉండాలి. గొంతు వాపును తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. పుదీనాను అధికంగా తినడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చేస్తుంది. ఇంకా వాయు కాలుష్యం వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని తీర్చడంలో పుదీనా ఆకులు ముందుంటాయి. ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. వీడిని తినడం వల్ల మొటిమలు వచ్చే సమస్య చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి అప్పుడప్పుడు పుదీనా ఆకులతో రకరకాల రెసిపీలు చేసుకుని తినేందుకు ప్రయత్నించండి.

తదుపరి వ్యాసం