తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Navel Piercing: నాభికి రింగుతో ప్రియాంక చోప్రా, ఈ ఫ్యాషన్ ఈనాటిది కాదు, మొదట ఏ దేశంలో మొదలైందంటే

Navel Piercing: నాభికి రింగుతో ప్రియాంక చోప్రా, ఈ ఫ్యాషన్ ఈనాటిది కాదు, మొదట ఏ దేశంలో మొదలైందంటే

Haritha Chappa HT Telugu

17 October 2024, 9:32 IST

google News
    • Navel Piercing: ప్రియాంక చోప్రా అమెరికా నుంచి ముంబైలో అడుగుపెట్టింది. ఎయిర్ పోర్టులో అందరి చూపు ఆమె ధరించిన బెల్లీ రింగ్ పైనే. బొడ్డు దగ్గర రింగు ధరించిన ఆమె ఎంతో స్టైలిష్గా కనిపించింది. నిజానికి ఈ బొడ్డుకు రింగు పెట్టుకునే ఫ్యాషన్ ఈనాటిది కాదు, చాాలా పురాతనమైనది.
బెల్లీ రింగ్ తో ప్రియాంక చోప్రా
బెల్లీ రింగ్ తో ప్రియాంక చోప్రా

బెల్లీ రింగ్ తో ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా నాభికి రింగుతో ముంబై ఎయిర్ పోర్టులో అడుగుపెట్టింది. ఆమె తన స్పోర్టీ ఎయిర్ పోర్ట్ లుక్ తో సరికొత్త బెల్లీ రింగ్ ను ధరించింది. ఆమె లుక్ ఫ్యాషన్ ప్రియులకు తెగ నచ్చేసింది. గుండ్రటి నెక్లైన్, పొడవాటి స్లీవ్స్, టోన్డ్ నడుమును చూపించే క్రాప్డ్ హెమ్, రిలాక్స్డ్ ఫిట్‌తో కూడిన బ్యాగీ స్వెట్ షర్టును ఆమె ధరించింది. అన్నింట్లోకి ఆమె ధరించిన బెల్లీ రింగ్ ఎక్కువ మందిని ఆకర్షించింది.

నాభి దగ్గర ఆభరణాలు ధరించడం, చెవిపోగుల్లాగే నాభికి జ్యువెలరీ పెట్టుకోవడం అనేది ఈ తరం ఫ్యాషన్ గా ఎక్కువ మంది భావిస్తారు. నిజానికి ఇది చాలా పురాతనమైన ఫ్యాషన్ అని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మళ్ళీ యువత కొత్తగా బెల్లీ బటన్స్ పెట్టుకోవడం మొదలుపెట్టడంతో ఇది ఆధునిక ఫ్యాషన్ గా అందరూ భావిస్తున్నారు.

బెల్లీ పియర్సింగ్ చరిత్ర

బెల్లీ పియర్సింగ్ లేదా నావెల్ పియర్సింగ్ అనేది సంవత్సరాల నాటి చరిత్రను కలిగి ఉంది. ప్రాచీన ఈజిప్ట్, రోమ్ దేశాలలో ఇలా బొడ్డును కుట్టించుకునేవారు. మనదేశంలో కూడా కొన్నిచోట్ల ఈ ఆచారం పురాతన కాలంలో ఉండేదని చెప్పుకుంటారు. ఆ తర్వాత మధ్యలో వందల ఏళ్ళు ఎవరు నాభికి ఆభరణాలు ధరించలేదు. మళ్లీ 1990 చివర్లలో నాభి జ్యువెలరీ ప్రాచుర్యం పొందడం మొదలైంది. ఇప్పుడు అధికంగా పాశ్చాత్య దేశాల్లో నాభిని కుట్టించుకోవడం మొదలుపెట్టారు. దీనికోసం ప్రత్యేకమైన ఆభరణాలు తయారవుతున్నాయి.

బొడ్డు కుట్టించుకున్నాక ఇలా చేయండి

నాభిని కుట్టించుకోవాలనుకునేవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. బొడ్డు దగ్గర కుట్లు పూర్తిగా నయం అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొంతమందిలో 9 నెలల నుండి ఏడాది వరకు పట్టవచ్చు. బొడ్డు కుట్టించుకున్నాక కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. తేలికపాటి సువాసన లేని సబ్బును ఉపయోగించి రోజుకు రెండుసార్లు బొడ్డు కుట్టించుకున్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. లేదా సెలైన్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. మురికి చేతులతో కుట్లను తాకడం మంచిది కాదు. బొడ్డు కుట్టించుకున్నాక కొన్ని రోజులు పాటు వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. గాలి, కాంతి తగిలితే త్వరగా కుట్లు మానిపోయే అవకాశం ఉంది. పదేపదే బెల్లీ బటన్స్ ను మార్చడం మంచి పద్ధతి కాదు.

కొందరికి బెల్లీ బటన్స్ కుట్టించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. నొప్పి, వాపు, ద్రవాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన మందులు వాడాలి. లేకుంటే అది తీవ్రమై పెద్ద సమస్యగా మారిపోయే అవకాశం ఉంది. కొంతమందికి శరీరం ఎలాంటి వస్తువులను అంగీకరించదు. అంటే ఏవైనా వస్తువులు శరీరాన్ని తాకితే చర్మంపై కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవి అసౌకర్యంగా ఉంటాయి. అలాంటప్పుడు మీరు బెల్లీ బటన్స్ వంటివి ప్రయత్నించకూడదని అర్థం చేసుకోండి. బెల్లీ బటన్స్ దగ్గర పెట్టుకునే జువెలరీ బంగారం వంటి మంచి లోహాలతో తయారు చేసినది అయి ఉండాలి. నికెల్ వంటి లోహాలు అలర్జీలను కలిగిస్తాయి. మీకు అలెర్జీ సమస్యలు ఉంటే బెల్లీ బటన్స్ కుట్టించుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం.

చెవి కుట్టించుకున్నట్టే నాభి కూడా కుట్టించుకోవడమే కదా అనుకుంటారు ఎంతోమంది. అలా అని ఎవరు పడితే వారితో నాభి కుట్టించుకోకూడదు. చెవి ప్రదేశం వేరు, నాభి ప్రదేశం వేరు. నాభి ప్రాంతం చాలా సురక్షితంగా, శుభ్రంగా ఉండాలి. ఈ ప్రాంతంలో త్వరగా అలెర్జీ, ఇన్ఫెక్షన్స్ ప్రమాదం ఉంటుంది. కాబట్టి చెవి కుట్టించుకున్న వ్యక్తితోనే నాభి కూడా కుట్టించుకోవాలని ప్రయత్నించవద్దు. నావి కుట్టించుకోవాలనుకుంటే తగిన సుశిక్షితులైన వారినే ఎంచుకోవాలి

తదుపరి వ్యాసం