Umbilical cord care: శిశువు బొడ్డుతాడు ఎప్పుడు ఊడుతుంది? ఈ తప్పులు చేస్తే ఇన్ఫెక్షన్లు రావచ్చు..
Umbilical cord care:పుట్టిన పసికందులకుండే బొడ్డుతాడు సహజంగానే ఊడిపోతుంది. అయితే దాని విషయంలో కొన్ని తప్పులు చేస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
తల్లి కడుపు నుంచి బయటికి వచ్చిన శిశువుకు బొడ్డు త్రాడు అవసరం ఇక లేనట్లే. కానీ శిశువు శరీరం నుంచి దానికదే ఊడిపోవడానికి కాస్త సమయం పడుతుంది. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉన్నా, కొన్ని అపోహలు నమ్మినా కూడా శిశువు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ బొడ్డు తాడు ఎప్పుడు ఊడుతుంది? దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెల్సుకోండి.
బొడ్డు తాడు అంటే ఏమిటి?
పొట్టలో ఉన్నప్పుడు శిశువుకు ఇది ఒక ప్రాణదాత లాంటిది. మావితో శిశువును కలిపేది ఇదే. తల్లి శరీరం నుంచి ఆక్సీజెన్, పోషకాలను బిడ్డకు చేరవేస్తుంది. శిశువు పుట్టగానే ఇక దాని అవసరం లేదు కాబట్టి దీన్ని కత్తిరించేస్తారు. అయినా కొన్ని రోజుల పాటూ అది శిశువు శరీరానికి అతుక్కునే ఉంటుంది. శిశువు బొడ్డు దగ్గర పచ్చిదనం తగ్గి పూర్తిగా నయమయ్యాకే ఈ బొడ్డు తాడు ఊడిపోతుంది.
బొడ్డు తాడు విషయంలో జాగ్రత్తలు:
పెద్దవాళ్లంతా బొడ్డు తాడు ఊడిపోవడానికి ఏవేవో రాయమని చెబుతారు. కొంతమంది నూనె చుక్కలు కూడా వేస్తారు. కానీ వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతే కాక బొడ్డు తాడు సహజంగా ఊడిపోయేలా చేసే మంచి బ్యాక్టీరియా దీనివల్ల నశిస్తుంది. నయం అవ్వడం ఇంకా ఆలస్యం అవుతుంది.
అందుకే వైద్య శాస్త్రం చెబుతున్న నియమాలు పాటించడం ఉత్తమం. గాలి తగిలేలా బొడ్డుతాడు వదిలేస్తే సరిపోతుంది. పొడిగా ఉంటే అతి తొందరగా నయం అవుతుంది.
బొడ్డుతాడు సంరక్షణ:
- బొడ్డు తాడు ఊడిపోయేవరకు స్నానం పోయకూడదు. స్పాంజి బాత్ చేయించొచ్చు. అంటే తడి గుడ్డతో శిశువు శరీరం తుడిస్తే సరిపోతుంది.
- డైపర్ వేసేటప్పుడు బొడ్డుతాడుకుండే స్టంప్ కవర్ అవ్వకుండా చూడండి. కాస్త కిందికి డైపర్ వేయండి. అప్పుడే పుట్టిన పిల్లలకు వాడే డైపర్లకు U ఆకారం నాచ్ ఉంటుంది. ఇది బొడ్డుతాడుకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి. వాటిని వాడొచ్చు. శిశువు మలం తాకినా, ఇంకేవైనా ఇన్ఫెక్షన్ కలగజేసేవి బొడ్డుతాడుకు తగిలితేనే దాన్ని కాస్త శుభ్రం చేయండి. అది కూడా నీటితో మాత్రమే. తర్వాత పూర్తిగా ఆరేలా చూడాలి.
- బొడ్డు తాడు దానికదే ఊడిపోవాలి. కాస్త ఊడినట్లు కనిపిస్తే దాన్ని లాగేయడం లాంటివి చేయకూడదు.
బొడ్డుత్రాడు ఎప్పుడు ఊడుతుంది?
శిశువు పుట్టిన పది నుంచి 14 రోజుల మధ్యలో బొడ్డుతాడు ఊడిపోతుంది. అలాగే ఈ సమయంలో ఒకవేళ ఊడకపోయినా కంగారు పడక్కర్లేదు. కొన్నిసార్లు మూడు వారాల సమయం కూడా పట్టొచ్చు. కానీ అంతక మించి సమయం పడితే వైద్యులని సంప్రదించాలి. ఊడిన వెంటనే బొడ్డు దగ్గర కాస్త తడి గుడ్డతో తుడిచేసి బాగా ఆరనివ్వాలి.
ఇన్ఫెక్షన్ సంకేతాలు:
బొడ్డుతాడు స్టంప్ ఊడినప్పుడు చాలా తక్కువ రక్తం కనిపించొచ్చు. కానీ అది వెంటనే ఆగిపోతుంది. కానీ అలాగే కొనసాగితే అది ఇన్ఫెక్షన్ కు సంకేతం. దాంతో పాటే ఈ లక్షణాలు కూడా ఇన్ఫెక్షన్ ను సూచిస్తాయి.
బొడ్డు చుట్టూ ఎరుపెక్కడం, ఉబ్బడం
బ్లీడింగ్ కనిపించడం
చీము కారడం
జ్వరం రావడం
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. కానీ చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు.