Oral Health- Pregnancy । గర్భిణీలు ప్రత్యేకమైన నోటి పరిశుభ్రతను పాటించాలి, ఎందుకంటే?!
01 March 2023, 9:54 IST
- Oral Health- Pregnancy: తల్లి కావాలనుకునే వారు, గర్భంతో ఉన్నప్పుడు నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో వారికి రుచిలో మార్పు, ఆహార కోరికలు పెరుగుతాయి. ఇలాంటపుడు ఎలా వ్యవహరించాలో చూడండి.
Oral Health- Pregnancy
Oral Health- Pregnancy: తన శరీరంలో మరొక ప్రాణాన్ని పెంచడం అనేది ఒక స్త్రీ జీవితంలో జరిగే అందమైన ఘట్టం. గర్భధారణ అనేది ఆమె జీవితంలో చేసే ఆనందకరమైన, నిరీక్షణతో నిండిన విలువైన ప్రయాణం. అయినప్పటికీ, వ్యక్తిగతంగా ఇది వారికి శారీరక, భావోద్వేగ సవాళ్లతో కూడిన సమయం. ఈ సమయంలో వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఈ సమయంలో వారికి ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినా కూడా చికిత్స విషయంలో, ఔషధాలు తీసుకునే విషయంలో పరిమితులు ఉంటాయి.
గర్భంతో ఉన్నప్పుడు దంత ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు తెలుసా? తల్లి కాబోయే చాలా మందికి ఈ విషయం గురించి అవగాహన ఉండదు. చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదంతో పాటు రుచిలో తేడా, లాలాజల ప్రవాహంలో మార్పుల, దంతక్షయం కలగడం ఇలా చాలా రకాలుగా వారి నోటి ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. అందుకే గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన నోటి అలవాట్లను అవలంబించడం చాలా అవసరం. గర్భిణీలు మంచి నోటి పరిశుభ్రత పాటించడం వల్ల, వారి ఆరోగ్యంతో పాటు, వారిలో పెరిగే శిశువు ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రోస్టోడాంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్, స్మైల్ డిజైన్ స్పెషలిస్ట్ డాక్టర్ దీక్షా బాత్రా, గర్భిణీల నోటి ఆరోగ్యానికి సంబంధించి వివిధ మార్గదర్శకాలు అందించారు. తల్లి కాబోయే వారు వారికి కలిగే పురిటి నొప్పులు, ఏవైనా అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారం ముందుగానే వైద్యులకు తెలియజేయాలి. పంటి నొప్పి చికిత్సకు కూడా పరిమితులు ఉంటాయి. మొదటి త్రైమాసికానికి ముందు కూడా పంటి నొప్పిపై త్వరిత చర్య తీసుకోవడానికి కొన్ని పరిమితుల గురించి తెలుసుకోవాలి అని డా. దీక్ష అన్నారు. తల్లి కావాలనుకుంటున్న వారు దంత చికిత్స తీసుకోవడానికి ముందు అనుసరించాల్సిన మార్గదర్శకాలు సూచించారు. అవేమిటంటే..
- పంటినొప్పికి చికిత్స చేసేటపుడు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకూడదు.
- శిశువుకు ఎటువంటి రేడియేషన్ రాకుండా ఉండటానికి ఎక్స్-రేలు తీసుకోవలసిన అవసరం లేదు,
- గర్భం, ప్రసవం, చనుబాలివ్వడం మొదలైన వాటికి సంబంధించిన మందులను జాగ్రత్తగా, సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి.
- మేజర్ అనస్థీషియా అవసరమయ్యే ఏదైనా సర్జరీ నొప్పిని ప్రేరేపించగలవు. అయినప్పటికీ చికిత్స తర్వాత నొప్పి నివారణ మందులను వాడటం గర్భం దాల్చే వరకు వాయిదా వేయాలి.
Oral Habits for Healthy Pregnancy - ముందస్తు నివారణలు
గర్భిణీలు అనుసరించాల్సిన నోటి పరిశుభ్రత అలవాట్లు, ముందస్తు నివారణలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. డెంటల్ చెకప్
గర్భం దాల్చే సమయంలో లేదా గర్భం ప్లాన్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దంత పరీక్ష చేయించుకోవడం వివేకంతో కూడిన చర్య. తద్వారా అత్యవసర పరిస్థితులను నివారించవచ్చు. ఏదైనా చురుకైన నొప్పి ఉంటే ముందస్తుగా 2వ త్రైమాసికంలోపే చికిత్స తీసుకోవాలి. ఈ సమయంలో డెంటల్ క్లీనింగ్ చేయవచ్చు. దంతాలు అరిగిపోవడం, సాధారణ కుహరం పూరించడం లాంటివి చేయవచ్చు. కానీ అత్యవసరమైతే తప్ప ప్రధాన ప్రక్రియలను వాయిదా వేయాలి.
2. దంత క్షయం నివారణ ఇలా
మంచి నోటి పరిశుభ్రతతో పాటు, మీ దంతాల కుళ్ళిపోకుండా నిరోధించడానికి ఫ్లోరైడ్ అప్లికేషన్ వంటి చికిత్సలను తీసుకోవాలి. ఈరకంగా దంతాలకు అదనపు రక్షణ పొరను కల్పించవచ్చు. తేలికైన, సురక్షితమైన ఫ్లోరైడ్‌తో కూడిన ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. అలాగే ఈ సమయంలో షుగర్ ఎక్కువగా తీసుకోవడం, నోటి పరిశుభ్రత పాటించకపోవడం వల్ల దంతాలు కుళ్లిపోయే అవకాశం ఎక్కువ.
3. మీ రక్షణకు ప్రినేటల్ విటమిన్లు
విటమిన్‌లను ఉపయోగించడం ద్వారా అనేక చిగుళ్ల పరిస్థితులను నియంత్రించవచ్చు, ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ వంటివి మంచి చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
4. ఆరోగ్యకరమైన ఆహారం
గర్భధారణ సమయంలో ఆకు కూరలు, పండ్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ దంతాలు, చిగుళ్లకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. సరిపడా నీటిని తీసుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. అప్పుడప్పుడు కలిగే ఆహార కోరికలు దంత ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవు కానీ తరచుగా ఆహార కోరికలు కలిగి, ఎక్కువ మొత్తంలో తీసుకుంటే అది మొత్తం దంత క్షీణతకు దారితీస్తుంది, దంత సమస్యలను ప్రేరేపిస్తుంది.
తల్లి కాబోయే వారు ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా చికిత్స తీసుకునే ముందుగా తప్పకుండా మీ వైద్యులను సంప్రదించాలి, మీ సమస్యలను అన్నీ వారికి వివరించిన వారి సిఫారసులను పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి చిట్కాలు, సొంత వైద్యం చేసుకోకూడదు.