తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pregnancy Care | గర్భం దాల్చిన నాటి నుంచి మాతృత్వం పొందే వరకు అమ్మకు అండగా ఇలా!

Pregnancy Care | గర్భం దాల్చిన నాటి నుంచి మాతృత్వం పొందే వరకు అమ్మకు అండగా ఇలా!

HT Telugu Desk HT Telugu

22 December 2022, 14:06 IST

    • Pregnancy Care Tips: స్త్రీకి గర్భందాల్చిన నాటి నుంచి మాతృత్వం పొందే వరకు ఎలాంటి సంరక్షణ అవసరమో ఇక్కడ తెలుసుకోండి.
Pregnancy Care-
Pregnancy Care- (Unsplash)

Pregnancy Care-

ఏ స్త్రీ అయినా గర్భం దాల్చిన దగ్గరి నుంచి మాతృత్వం పొందే వరకు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ముఖ్యంగా తొలిసారిగా అమ్మ కాబోయే స్త్రీ తనకోసం మాత్రమే కాకుండా తనకు పుట్టబోయే బిడ్డకోసం కూడా ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇందుకు కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉండాలి. గర్బాధారణ జరిగిన నాటి నుంచి ప్రసవం వరకు, ప్రసవానంతరం కూడా స్త్రీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో ఆమె అనేక శారీరక, మానసిక ఒత్తిళ్లకు గురవుతుంది. తల్లుల శరీరంలో చోటుచేసుకునే వేగవంతమైన హార్మోన్ల మార్పుల వల్ల, కొన్నిసార్లు వారి భావోద్వేగాలను నియంత్రించడం కష్టంగా మారుతుంది. ఇది వారి ఒత్తిడిని మరింత పెంచుతుంది. అదనంగా తొలిసారి తల్లి కాబోయే స్త్రీకి మనసులో చాలా రకాల భయాందోళనలు ఉంటాయి. వీటన్నింటిని ఎదుర్కొనేలా వారికి ధైర్యం చెప్పాలి, వారిని అర్థం చేసుకుంటూ వారికి అవసరం అయ్యేవన్నీ తీర్చడానికి తోడు ఉండాలి.

Pregnancy Care Tips- గర్భధారణ సంరక్షణ చిట్కాలు

తొలిసారిగా తల్లి కాబోతున్న స్త్రీలలో ఒత్తిడి నియంత్రించటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా కూడా వారికి గొప్ప ఊరటను అందించవచ్చు.

కుటుంబ సభ్యుల మద్దతు

గర్భధారణ సమయంలో స్త్రీ తన భర్తతో పాటు తల్లిదండ్రులు, అత్తమామలు, తోబుట్టువులు సహా కుటుంబ సభ్యుల అందరి నుండి మద్దతును కలిగి ఉండటం చాలా ముఖ్యం. వీరందరి సహాకారంతో స్త్రీ గర్భం నుండి మాతృత్వం వరకు తన ప్రయాణాన్ని ఒత్తిడి లేకుండా కొనసాగించవచ్చు. కుటుంబం అంతా కలిసి ఇంట్లో ఆడుకునే ఆహ్లదకరమైన ఆటలు, వనభోజనాలు, ప్రకృతి మధ్య గడపడం మొదలైన కార్యకలాపాలు వారిని మానసికంగా చాలా వరకు రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడతాయి.

తగినంత నిద్ర

కొత్తగా తల్లి కాబోతున్న స్త్రీలు ఒత్తిడిని నివారించాలంటే తగినంత నిద్రను పొందడం చాలా ముఖ్యం. అది గర్భధారణ సమయంలో లేదా గర్భధారణ తర్వాత కూడా నిండైన నిద్ర ఉండాలి. గర్భంతో ఉన్నప్పుడు, డెలివరీ అనంతర కాలంలో ఎదురయ్యే కొన్ని సాధారణ అనారోగ్య సమస్యలతో తల్లులు సతమతమవుతారు. ప్రసవానంతరం నొప్పులు, యోని స్రావాలు, నవజాత శిశువులలో జ్వరం, దగ్గు వంటివి బాధిస్తాయి. అయితే తగినంత నిద్రపోవడం ద్వారా ఆరోగ్యం త్వరగా మెరుగవుతుంది.

మంచి పోషకాహారం

కొత్తగా తల్లి కాబోయే స్త్రీ ఆరోగ్యానికి మంచి పోషకాహరం అవసరం. వైద్యుల సూచనలతో వారికి అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించండి. తృణధాన్యాలు, లేత మాంసాలు, తాజా పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, చిక్కుళ్ళు, గింజలను అందించాలి. సమతుల్యమైన ఆహారం అందించడం ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆహారం తిన్నప్పుడే తల్లికి పాలు తయారవుతాయి. అదే సమయంలో గర్భిణీలు తినకూడని ఆహారాలపై కూడా అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.

తేలికపాటి వ్యాయామం

గర్భంతో ఉన్నపుడు, ప్రసవానంతరం కూడా తల్లులకు ప్రతిరోజూ కనీసం 20-30 నిమిషాల వ్యాయామం అవసరం అవుతుంది. తేలికపాటి నడక, కొన్ని సులభమైన యోగాసనాలు గర్భిణీలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వారికి సుఖప్రసవం అయ్యేందుకు తోడ్పడతాయి. అదేవిధంగా ప్రసవానంతరం వైద్యుల సిఫారసు మేరకు సాధారణ వ్యాయామం ఉంటే మానసిక, శారీరక నొప్పుల నుంచి బయటపడవచ్చు.

బాధ్యతలను అప్పజెప్పడం

బిడ్డ పుట్టకముందే భార్యాభర్తలు అవగాహనను కలిగి ఉండటం ముఖ్యం. ముందుగానే అన్ని రకాల కుటుంబ బాధ్యతలను విభజించడం మంచిది. తల్లులకు తగినంత విశ్రాంతి ఉండాలి. బిడ్డ పుట్టిన తర్వాత కూడా తల్లికి, బిడ్డకు అనేక సపర్యలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలకు సంబంధించి అన్ని రకాలుగా తెలిసిన పెద్దలను వెంట ఉంచుకోవడం చాలా అవసరం.