Stress during pregnancy: ప్రెగ్నెన్సీలో ఒత్తిడి ? మీ బేబీకి ఈ ప్రమాదం
07 December 2022, 8:37 IST
- Stress during pregnancy: ప్రెగ్నెన్సీలో ఒత్తిడికి గురైతే పుట్టబోయే బేబీ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రెగ్నెన్సీలో ఒత్తిడికి గురైతే బేబీపై ప్రభావం
ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు తరచుగా ఒత్తిడికి లోనవుతారు. ఆత్రుత, ఆందోళన పడతారు. ప్రెగ్నెన్సీ వారిలో ఆనందాన్ని తెచ్చినప్పటికీ విభిన్న అంశాలు వారిని ఒత్తిడికి లోనుచేస్తాయి. అయితే ఒత్తిడి కేవలం వారిని మాత్రమే కాదు.. వారి గర్భంలో ఉన్న శిశువును కూడా ప్రభావం చేస్తుందని విభిన్న అధ్యయనాలు చెబుతున్నాయి. విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే తల్లుల శిశువులు తరచూ కోపగించుకోవడం, ఏడవడం వంటివి చేస్తారని అధ్యయనాల్లో తేలింది.
చిన్నారి సమగ్ర ఎదుగుదల, అభివృద్ధిపై కూడా ఒత్తిడి ప్రభావం చూపుతుంది. డిప్రెషన్‌కు గురైన తల్లులకు పుట్టిన చిన్నారుల్లో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బడికి వెళ్లడానికి ముందు ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇది ఆందోళనకు, సామాజికంగా దూరంగా ఉండేలా చేస్తుంది. పిల్లలు ఒంటరితనానికి లోనవుతారు. ఇతరులతో మాట్లాడేందుకు ఇష్టపడరు.
How stress can affect the baby: బేబీపై స్ట్రెస్ చూపే ప్రభావం
ఒత్తిడి, డిప్రెషన్ మీ చిన్నారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో కన్సల్టెంట్ అబ్‌స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమా థమ్‌కే హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ‘ఒత్తిడికి లోనయ్యే ప్రెగ్నెంట్ మహిళలు, వారి చిన్నారులు స్వీయ-నియంత్రణ కోల్పోతారు. వారి వయస్సులో ఉన్న చిన్నారులతో సరైన సంబంధాలను కొనసాగించలేరు. పాఠశాలలో ఇబ్బంది పడుతుంటారు. డిప్రెషన్‌కు లోనవుతారు. ఎక్కువగా నిరాశకు లోనవుతారు. ప్రవర్తన సమస్యలతో బాధపడుతారు. ఇతర మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. పిల్లల్లో ఆందోళన, హింసాత్మక ప్రవర్తన, మొండిగా మారడం కనిపించవచ్చు. అలాగే నిరంతరం ఏడుస్తూ ఉంటారు.
Tips to de-stress during pregnancy: ప్రెగ్నెంట్ మహిళలు ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఏంచేయాలి?
· ప్రెగ్నెంట్ మహిళలు ఒత్తిడి తగ్గించుకునేందుకు డాక్టర్ ప్రతిమ పలు సూచనలు చేశారు. డీప్ బ్రీతింగ్ వ్యాయామం చాలా మేలు చేస్తుందని చెప్పారు. అయితే నిపుణులను సంప్రదించాక ఈ డీప్ బ్రీతింగ్ వ్యాయామం చేయడం మంచిదని సూచించారు. దీని వల్ల మీ గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. మిమ్మల్ని శాంతపరుస్తుంది. దీనికి తోడు నడక, ఏరోబిక్స్ లేదా యోగా కూడా ఒత్తిడి తగ్గించుకోవడంలో ఉపయోగపడుతాయి. వారంలో ఐదు రోజులు మీరు ఇలా చేయొచ్చు. అయితే మీ ఫిట్‌నెస్ సంబంధిత దినచర్యలు పాటించే ముందు మీ గైనకాలజిస్టును సంప్రదించడం మంచిదని డాక్టర్ ప్రతిమ సూచించారు.
· ప్రెగ్నెంట్ మహిళలు చాలా సంయమనంగా ఉండాలి. చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందవద్దు. మీకు నచ్చేవి మీరు చేయండి. మీ కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి. పెయింటింగ్, కుకింగ్, మ్యూజిక్ వినడం వంటివి చేయండి.
· బేబీ జన్మించాక వారితో అనుంబంధం పెంచుకోవడం కూడా తల్లుల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే తగినంత విశ్రాంతి వీరికి అవసరం.