తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prawns Pepper Fry: రొయ్యల పెప్పర్ ఫ్రై రెసిపీ, దీన్ని తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది

Prawns Pepper Fry: రొయ్యల పెప్పర్ ఫ్రై రెసిపీ, దీన్ని తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది

Haritha Chappa HT Telugu

08 June 2024, 11:38 IST

google News
    • Prawns Pepper Fry: ప్రజలతో చేసే రెసిపీలు చాలా టేస్టీగా ఉంటాయి. అందులో ప్రాన్స్ పెప్పర్ ఫ్రై ఒకటి. మిరియాల పొడి వేసి చేసే ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది.
రొయ్యల పెప్పర్ వేపుడు
రొయ్యల పెప్పర్ వేపుడు

రొయ్యల పెప్పర్ వేపుడు

Prawns Pepper Fry: రొయ్యలు అంటే ఇష్టపడేవారు ఒకసారి ప్రాన్స్ పెప్పర్ ఫ్రై రెసిపీని ప్రయత్నించండి. రొయ్యల్లో మిరియాల పొడి వేసి ఈ రెసిపీని చేస్తారు. తింటున్న కొద్దీ ఇది తినాలనిపిస్తుంది. చూస్తేనే నోరూరిపోతుంది. రొయ్యలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలే జరుగుతుంది. కాబట్టి ఈ రెసిపీని చక్కగా తినవచ్చు. ఇందులో వేసే మిరియాల పొడి ఎంతో ఆరోగ్యకరమైనది. ఒకసారి ప్రాన్స్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూడండి.

ప్రాన్స్ పెప్పర్ ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు

రొయ్యలు - అరకిలో

కరివేపాకులు - గుప్పెడు

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

మిరియాల పొడి - ఒక స్పూను

నెయ్యి - మూడు స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి

చింతపండు - నిమ్మకాయ సైజులో

ఉప్పు - రుచికి సరిపడా

ఎండుమిర్చి - రెండు

జీలకర్ర - ఒక స్పూను

సోంపు - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

అనాసపువ్వు - ఒకటి

మిరియాలు - ఒక స్పూను

రొయ్యల పెప్పర్ ఫ్రై రెసిపీ

1. ముందుగా మసాలా పొడిని రెడీ చేసుకోవాలి.

2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, సోంపు, అనాస పువ్వు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.

3. ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

4. ఆ పొడిని తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండును కాస్త నీరు వేసి గుజ్జులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో కరివేపాకులు వేసి వేయించాలి.

6. అలాగే వెల్లుల్లి తరుగును వేసి వేయించాలి. సన్నగా నిలువుగా కోసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి.

7. ఆ మిశ్రమంలోనే ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

8. ఇప్పుడు చింతపండు గుజ్జును పిండి అందులో వేయాలి. రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.

9. ఇది చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు ముందుగా శుభ్రం చేసి పట్టుకున్న రొయ్యల్ని వేయాలి.

10. చిన్న మంట మీద వీటిని వేయించాలి.

11. మసాలా రొయ్యలకు పట్టే వరకు ఉంచి పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ రొయ్యల పెప్పర్ ఫ్రై రెడీ అయినట్టే. దీన్ని వండుతున్నప్పుడే నోరూరిపోతుంది.

రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. మన శరీరానికి అత్యవసరమైన పోషకాలలో విటమిన్ బి12. ఈ విటమిన్ లోపిస్తే బలహీనంగా మారిపోతారు. తీవ్ర అలసటగా అనిపిస్తుంది. డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి విటమిన్ బి12 కోసం ప్రతి ఒక్కరూ రొయ్యలను తినాలి. రొయ్యలు ఎన్ని తిన్నా బరువు పెరగరు. ఎందుకంటే దీనిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. పోషకాలు మాత్రం అధికంగా ఉంటాయి. రొయ్యల్లో సెలీనియం లభిస్తుంది. ఇది మన శరీరానికి అత్యవసరమైనది. శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి కూడా రొయ్యలకు ఉంది. కాబట్టి రొయ్యలను అప్పుడప్పుడు ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం.

తదుపరి వ్యాసం