తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Pulao: ఒకసారి పొటాటో పులావ్ ఇలా చేసి చూడండి, ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ

Potato Pulao: ఒకసారి పొటాటో పులావ్ ఇలా చేసి చూడండి, ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ

Haritha Chappa HT Telugu

17 February 2024, 17:30 IST

google News
    • Potato Pulao: బంగాళదుంపలతో చేసిన వంటకాలు ఎక్కువ మందికి నచ్చుతాయి. ఒకసారి పొటాటో పులావ్ ప్రయత్నించి చూడండి. ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట డిన్నర్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
బంగాళాదుంప పులావ్ రెసిపీ
బంగాళాదుంప పులావ్ రెసిపీ (Youtube)

బంగాళాదుంప పులావ్ రెసిపీ

Potato Pulao: పనీర్ పులావ్, చికెన్ పులావ్, మటన్ పులావ్, ఎగ్ పులావ్ తిని ఉంటారు. ఒకసారి పొటాటో పులావ్ అంటే బంగాళదుంపలతో పులావ్ చేసుకుని చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా లంచ్ బాక్స్ రెసిపీ గా ఉపయోగపడుతుంది. డిన్నర్లో వేడివేడిగా తింటే రుచి అదిరిపోతుంది. పిల్లలకు బంగాళదుంపలు అంటే ఎంతో ఇష్టం. వాటితో చేసిన వంటకాలు వారికి నచ్చుతాయి. కాబట్టి వారికి లంచ్ బాక్స్ రెసిపీగా ఈ పొటాటో పులావ్ పెట్టి చూడండి.

పొటాటో పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బాస్మతి బియ్యం - రెండు కప్పులు

బంగాళదుంపలు - మూడు

బిర్యానీ ఆకులు - రెండు

లవంగాలు - రెండు

కరివేపాకు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చిమిర్చి - రెండు

జీలకర్ర - ఒక స్పూను

నీరు - తగినంత

నూనె - మూడు స్పూన్లు

యాలకులు - నాలుగు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

ఉల్లిపాయలు - రెండు

పసుపు పొడి - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు - మూడు

పచ్చి బఠానీలు - అరకప్పు

టమోటాలు - రెండు

బంగాళదుంప పులావ్ రెసిపీ

1. బియ్యాన్ని శుభ్రంగా కడిగి పొడిపొడిగా వచ్చేలా అన్నంలా వండుకోవాలి.

2. మిక్సీ జార్లో వెల్లుల్లి, టమోటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకులు, ఉల్లిపాయల తరుగు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి బాగా వేయించాలి.

5. ఉల్లిపాయల రంగు మారేవరకు ఉంచాలి.

6. కాసేపటికి కరివేపాకులను వేసి వేయించాలి.

7. ఇందులో మనం మొదటిగా చేసుకున్న వెల్లుల్లి టమోటా పేస్టును వేసి కలుపుకోవాలి.

8. అర స్పూను పసుపు పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

9. ఇప్పుడు బంగాళదుంపలను ముక్కలను, పచ్చి బఠానీలు, ఉప్పు వేసి వేయించుకోవాలి.

10. మూత పెట్టి బంగాళదుంప ముక్కలు ఉడికే వరకు ఉంచాలి.

11. బంగాళదుంపలు మెత్తగా ఉడికాక ముందుగా వండుకున్న బియ్యాన్ని ఇందులో వేసి మూత పెట్టాలి.

12. చిన్న మంట మీద ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి.

13. తర్వాత మూత తీసి పైన కొత్తిమీరను చల్లుకోవాలి. అంతే పులావ్ రెడీ అయినట్టే.

14. గరిటతో కింద నుంచి మెల్లగా కలుపుకొని మసాలా పులావ్ అంతా పరుచుకునేలా చేయాలి. దీన్ని వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా ఈ పొటాటో పులావ్ బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా దీన్ని తింటారు. దీంట్లో బంగాళదుంపను ముందుగా ఉడికించుకొని వండుకోవచ్చు లేదా నేరుగా వండుకోవచ్చు. ఉడికించుకొని వండుకుంటే ఈ పులావ్ త్వరగా అయిపోతుంది. ఎక్కువమంది పిల్లలు బంగాళదుంపలతో చేసిన వంటకాలను ఇష్టపడతారు. ఖచ్చితంగా ఈ పొటాటో పులావ్‌ను కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి వారికి పెట్టి చూడండి .ఈ పొటాటో పులావ్ రెసిపీ చాలా సులువు.

టాపిక్

తదుపరి వ్యాసం