Potato Cheela: బంగాళదుంప చీలా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ
14 June 2024, 6:00 IST
- Potato Cheela: దోశలు, అట్లు వంటివే చీలా కూడా. నార్త్ ఇండియాలో చీలా అని అట్లును పిలుస్తారు. ఇక్కడ మేము పొటాటో చీలా ఎలా చేయాలో చెప్పాము.
బంగాళాదుంప చీలా రెసిపీ
Potato Cheela: బంగాళదుంపలతో చేసే వంటకాల్ని పిల్లలు ఇష్టంగా తింటారు. బ్రేక్ ఫాస్ట్ లో బంగాళదుంపలను భాగం చేయొచ్చు. ఒకసారి పొటాటో చీలా ప్రయత్నించి చూడండి. ఇది పొటాటోతో చేసే దోశ లేదా అట్టు అనుకోవచ్చు. అల్పాహారంగా రాత్రి భోజనంలో దీన్ని తినవచ్చు. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. క్యారెట్లు, క్యాబేజీలు వంటి కూరగాయలను జోడిస్తే రుచి అదిరిపోతుంది. రెండు చీలాలు తింటే చాలు పొట్ట నిండిపోతుంది. దీనిలో అన్నీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలనే వినియోగిస్తాము. పొటాటో చీలా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
పొటాటో చీలా రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు - రెండు
ఉల్లిపాయ - అర ముక్క
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి - ఒకటి
ధనియాల పొడి - అర స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
శెనగపిండి - ఒక స్పూను
కార్న్ ఫ్లోర్ - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక స్పూను
పొటాటో చీలా రెసిపీ
1. బంగాళాదుంపను శుభ్రంగా కడిగి బాగా తురిమి ఒక గిన్నెలో వేయాలి.
2. ఆ గిన్నెలో రెండు కప్పుల నీరు వేయాలి. ఒక పావుగంట పాటు వదిలేయాలి.
3. ఇలా చేయడం వల్ల బంగాళదుంపలోని అదనపు పిండి పదార్థం నీటిలోకి కలిసిపోతుంది.
4. ఆ బంగాళదుంపలను బయటకు తీసి చేత్తో పిండి పక్కన పెట్టుకోవాలి.
5. ఆ బంగాళదుంపలు ముక్కల్లో మరి కొంచెం నీళ్లు వేసి స్టవ్ మీద ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.
6. అరవై శాతం ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయాలి.
7. ఆ బంగాళాదుంప ముక్కల నుండి నీటిని తీసి ఆ ముక్కలను మెత్తగా స్పూన్ తోనే మెదపాలి.
8. అందులో ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సెనగపిండి కార్నఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె రాయాలి. నూనె వేడెక్కాక ఈ మిశ్రమాన్ని అట్టులా పోసుకోవాలి.
10. రెండువైపులా వేయించుకుంటే చీలా రెడీ అయిపోయినట్టే.
11. దీన్ని పుదీనా చట్నీతో తింటే టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది.
12. దీనిలో అవసరం అనుకుంటే క్యాప్సికం తరుగు, క్యాబేజీ తరుగు, క్యారెట్ తరుగు కూడా కలుపుకోవచ్చు.
13. దీన్ని పలచగా వేసుకుంటే దోశలా వస్తుంది. కాస్త మందంగా వేసుకుంటే పాన్ కేక్‌లా ఉంటుంది. మీ పిల్లల ఇష్టాన్ని బట్టి మీరు దీన్ని ట్రై చేయండి.
పిల్లలకు దీన్ని బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే కాదు రాత్రివేళ కూడా పెట్టవచ్చు. దీనిలో మరిన్ని కూరగాయలను జోడిస్తే రుచి అదిరిపోతుంది. అలాగే వారికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఒకసారి ఈ పొటాటో చీలా వండుకొని చూడండి. పిల్లలకు, పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది.
టాపిక్