Cabbage Pachadi: స్పైసీ క్యాబేజీ పచ్చడి ఇలా చేసుకుంటే వేడివేడి అన్నంలో అదిరిపోతుంది
Cabbage Pachadi: క్యాబేజీ కూర, క్యాబేజీ వేపుడే కాదు అప్పుడప్పుడు క్యాబేజీ పచ్చడి చేసుకొని తినండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా సులువు.
Cabbage Pachadi: కచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో క్యాబేజీలు కూడా ఒకటి. దీంతో ఎక్కువమంది క్యాబేజీ వేపుడు లేదా కూరగానే వండుకుంటారు. క్యాబేజీ పచ్చడి చేసుకుంటే స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నోరూరిపోతుంది. ఈ క్యాబేజీ పచ్చడి చేయడం చాలా సులువు. ఇందులో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పదార్థాలు వేసాము. కాబట్టి క్యాబేజీ పచ్చడిని వారానికి ఒకసారి తింటే అన్ని రకాలుగా మేలే జరుగుతుంది.
క్యాబేజీ పచ్చడి రెసిపీ కావలసిన పదార్థాలు
క్యాబేజీ తరుగు - 150 గ్రాములు
జీలకర్ర - ఒక స్పూను
ధనియాలు - ఒక స్పూను
పచ్చిమిర్చి - పది
ఎండుమిర్చి - నాలుగు
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
నూనె - రెండు స్పూన్లు
చింతపండు - ఉసిరికాయ సైజులో
టమాటాలు - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు స్పూను
క్యాబేజీ పచ్చడి రెసిపీ
1. క్యాబేజీని సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. ఆ నూనెలో జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి.
3. ఆ తర్వాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
4. ఇవన్నీ బాగా వేగాక క్యాబేజీ తరుగును వేసి బాగా కలుపుకోవాలి.
5. పసుపును చల్లుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కలిపి చిన్న మంట మీద పెట్టి మూత పెట్టాలి. వేగినట్టు అవుతుంది.
6. అప్పుడు చింతపండు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
7. టమాటాలను సన్నగా తరిగి వేసుకొని బాగా కలుపుకోవాలి.
8. చిన్నమంట మీద కలుపుతూ ఉంటే టమాటాలు మెత్తగా ఉడుకుతాయి.
9. టమాటాలు మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
10. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి నూనె వేయాలి.
11. ఆ నూనెలో తాలింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు, ఎండుమిర్చి వేసి వేయించి వాటిని క్యాబేజీ పచ్చడిపై వేసుకోవాలి.
12. అంతే టేస్టీ క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
క్యాబేజీలో మనకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, ఫోలేట్, విటమిన్ b6, పీచు పుష్కలంగా ఉంటుంది. క్యాబేజీని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది. గుండె జబ్బుల నుంచి రక్షణ పొందాలంటే క్యాబేజీని తింటూ ఉండాలి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. క్యాబేజీ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
టాపిక్