తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pickle Storage: పచ్చళ్లు బూజు పట్టి రుచి మారాయా? ఈ ట్రిక్స్ తెలిస్తే చాలు

Pickle Storage: పచ్చళ్లు బూజు పట్టి రుచి మారాయా? ఈ ట్రిక్స్ తెలిస్తే చాలు

02 October 2024, 10:30 IST

google News
  • Pickle Storage: వర్షాకాలంలో పచ్చళ్లు బూజు పట్టడం, రుచిమారడం జరగొద్దంటే కొన్ని టిప్స్ పనికొస్తాయి. వీటితో పచ్చళ్ల రుచి మారదు. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. 

పచ్చళ్లు నిల్వ ఉండటానికి చిట్కాలు
పచ్చళ్లు నిల్వ ఉండటానికి చిట్కాలు

పచ్చళ్లు నిల్వ ఉండటానికి చిట్కాలు

వర్షాకాలంలో పచ్చళ్లు చాలా మంది ఇళ్లలో బూజు పట్టేస్తాయి. పచ్చడి మీద తెల్లగా, నల్లగా, పచ్చగా ఫంగస్ రావడం కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు రుచి కూడా మారి వాసన వచ్చేస్తాయి. మీకూ అదే సమస్య ఉంటే ఈ పనులు చేయండి. పచ్చళ్లు అస్సలు పాడవ్వవు.

వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ పచ్చళ్లు పాడవ్వడానికి కారణం. దాంతోనే పచ్చడి పులిసిపోయినట్లు అవుతుంది. బూజు పట్టేస్తుంది. కష్టపడి పెట్టుకున్న ఊరగాయ అలా పాడైపోతే మనసు ఉసూరుమంటుంది కదూ. కాబట్టి వర్షాకాలంలో కొన్ని టిప్స్ పాటిస్తే పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 

పచ్చళ్లు పాడవ్వకుండా ఈ చిట్కాలు పాటించండి:

నిల్వ చేసే జాడీలు:

సరైన డబ్బాల్లో పచ్చళ్లు భద్రపర్చడం ముఖ్యం. గాలి చొరవని గాజు డబ్బాలు పచ్చళ్లకు ఉత్తమం అని చెప్పొచ్చు. లేదంటే పింగానీతో చేసిన డబ్బాలైనా వాడొచ్చు. ఏ లోహంతో చేసినవి వాడకూడదు. ఎందుకంటే పచ్చళ్లలో ఉండే ఆమ్ల తత్వం లోహాలతో చర్య జరుపుతుంది. అలాగే ప్లాస్టిక్ కంటైనర్లు కూడా రంగు, వాసన తగ్గించేస్తాయి. రుచి దెబ్బతింటుంది. 

అలాగే పచ్చళ్లు వేసే ముందు డబ్బాలను ఎండలో పెట్టి బాగా ఆరనివ్వడం మర్చిపోవద్దు. అలాగే రోజూ ఎండ పడే చోట కాకుండా కాస్త చీకటిగా, తేమ తక్కువుండే చోట వీటిని భద్రపరచాలి.

నూనె:

సరైన నూనె వాడితే పచ్చళ్లు పాడవ్వవు. సాధారణంగా పచ్చళ్లకు ఆవనూనె మంచిదని చెబుతారు. ఈ నూనె ఎక్కువరోజులు పాడవ్వకుండా కాపాడుతుంది. అలాగే పచ్చళ్లలో నూనె తక్కువ వేస్తే కుదరదు. వాటిని కాపాడేదే నూనె. కాబట్టి పచ్చడి అంతా పొడిగా కాకుండా నూనె పట్టి ఉండేలా చూసుకోండి. ఇది తేమకు, గాలినుంచి అడ్డుగా ఉండి పాడవ్వకుండా చూస్తుంది. నూనె తక్కువనిపిస్తే కాస్త కలపండి. 

ఉప్పు:

ఉప్పు సహజంగా వేటినైనా నిల్వ చేయడానికి వాడే పదార్థం. ఇది బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధిని నిరోధిస్తుంది. కాబట్టి వీలైతే రుచి పాడవ్వదు అనుకుంటే పచ్చళ్లలో వర్షాకాలంలో కాస్త ఉప్పు వేసి బాగా కలపండి. వెనిగర్ కూడా వాడొచ్చు. 

ఎండలో పెట్టడం:

వర్షాకాలంలో ఎండ కొట్టినప్పుడు మూత తీయకుండానే పచ్చళ్ల జాడీని ఎండలో పెట్టండి. ఒక అరగంట నుంచి గంట పాటూ ఉంచితే తేమ తగ్గిపోతుంది. దాంతో బూజు లాంటివి రాకుండా ఉంటాయి. 

  • అలాగే తడి చేతులతో పచ్చళ్లను ఎప్పుడూ తాకకండి. 
  • పొడిగా ఉన్న చెంచాలు మాత్రమే వాడండి.
  • వర్షాకాలం అయ్యేలోపు కనీసం వారానికి ఒకసారైనా పచ్చళ్లను తీసి చూస్తూ ఉండండి.
  • ఒకవేళ పచ్చడి కొద్దిగా పాడైతే మరో శుభ్రంగా ఉన్న డబ్బాలోకి మార్చి చూడండి. మిగతాదైనా బాగుంటుంది. 

 

తదుపరి వ్యాసం