Parenting Tips : పిల్లలను అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు పంపండి.. ఎన్నో నేర్చుకుంటారు
24 March 2024, 19:00 IST
- Parenting Tips In Telugu : పిల్లలను ఎప్పుడూ తల్లిదండ్రులతోనే ఉంచుకోవడం కూడా తప్పే. అమ్మమ్మ తాతయ్యల దగ్గర కూడా పెంచనివ్వాలి.
తల్లిదండ్రులకు చిట్కాలు
ఒకప్పుడు అందరూ ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. ఎంతో బాగుండేది ఆ సమయంలోనే. ఇప్పుడంతా అభివృద్ధి చెందుతూ కుటుంబాలు దూరం అవుతూ ఉన్నాయి. అప్పట్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా.. పెంచడం పెద్ద కష్టమేమీ కాకుండా ఉండేది. తల్లితండ్రులు ఇంటిపనులు, వ్యవసాయ పనులు చేసినా పిల్లలను తాతయ్యలే చూసుకునేవారు. పొద్దున తల్లిదండ్రులు పనులకు వెళితే. అమ్మమ్మలు తాతయ్యలు పిల్లలను బాగా చూసుకునేవారు. దీనితో వారికి లోక జ్ఞానం పెరిగేది. పిల్లలకు చాలా విషయాలు తెలిసేవి.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అంతా మారిపోయాయి. అమ్మమ్మ తాతయ్యలు గ్రామాల్లో ఉంటున్నారు. తల్లిదండ్రులు నగరాల్లో పిల్లలతో కలిసి బతుకును వెళ్లదీస్తున్నారు. దీనివల్ల పెద్దవారి ప్రేమను పిల్లలు పొందలేకపోతున్నారు. అయితే పిల్లల పెంపకంలో అమ్మమ్మ తాతయ్యల పాత్ర తప్పక ఉండాలి.
పిల్లలకు అమ్మమ్మ తాతయ్యలతో బంధం తప్పనిసరి. వారితో ఉంటేనే మంచి విలువలు తెలుసుకుంటారు. ఇరువైపుల నుంచి ప్రేమను పొందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా వారికి తెలుస్తుంది. పెద్దవారు బంధాల గురించి పిల్లలకు నేర్పిస్తారు. ఏ బంధంతో ఎలా వ్యవహరించాలో వివరిస్తారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసినప్పుడూ ప్రవర్తించే విధానం గురించి పెద్దలు పిల్లలకు చెబుతారు.
తల్లితండ్రులు తమ పిల్లలను ఎంతగా ప్రేమిస్తారో, అమ్మమ్మ తాతయ్యలు కూడా వారిని అంతే ప్రేమిస్తారు. పిల్లలు వారి నుండి మానసిక మద్దతు పొందుతారు. వారికి మంచి భద్రత ఉంటుంది. ఇది పిల్లల భావోద్వేగ మేధస్సును పెంపొందించడానికి సహాయపడుతుంది. వారి దగ్గర పెరిగితే మీ పిల్లలకు చాలా విషయాలు అర్థమవుతాయి. మాట్లాడే విధానంలోనూ మార్పు వస్తుంది.
తల్లిదండ్రులు ఈ కాలంలో చాలా బిజీగా ఉంటారు. వారి పనులు చేసుకునేందుకు వారికే టైమ్ సరిపోతుంది. అమ్మమ్మ తాతయ్యలు పిల్లలకు బాగా బోధిస్తారు. మన కర్తవ్యాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పిల్లలకు వివరించగలిగేది వారే. ఎలాంటి పండుగ సమయంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి. దేవుడికి పూజించేటప్పుడు ఏం చేయాలనేది పిల్లలకు పెద్దలు పూస గుచ్చినట్టుగా చెబుతారు. మన సంప్రదాయాలు తెలుసుకునేందుకు ఇది పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
తల్లిదండ్రులు ఆఫీసు పనుల్లో బిజీ అయి పిల్లలతో గడపలేకపోతున్నారు. అయితే తాతయ్యలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. అవి మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి. వారు తమ అనుభవాలను పంచుకుంటారు. వారు భవిష్యత్తులో పిల్లలకు చాలా సహాయం చేస్తారు. చిన్న వయసులో పిల్లలకు అనుభవాల గురించి నేర్పిస్తే.. వారు పెరిగే క్రమంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
తల్లితండ్రులు ఎంత సరదాపడినా ఏదో ఒక సమయంలో తమ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. కానీ అమ్మమ్మలు తాతలు అలా కాదు. వారు ఎల్లప్పుడూ పిల్లలను అలరించాలని, వారిని నవ్వించాలని, అవసరమైతే వారితో ఆడుకోవాలని చూస్తారు.
పిల్లలు తమ పెద్దల నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు తెలియని ఎన్నో సంప్రదాయ వంటకాలు అమ్మమ్మలకు మాత్రమే తెలుసు. అంతే కాకుండా తాతయ్యలు పిల్లలకు గార్డెనింగ్ వంటి ఎన్నో విషయాలు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విషయాలు తెలియాలంటే, ప్రపంచాన్ని వేరే కోణంలో చూడాలంటే అన్నీ నేర్చుకోవాలంటే పెద్దల దగ్గర పెరగాలి.
అమ్మమ్మ తాతయ్యలు మన పురాణాల గురించి కూడా పిల్లలకు చెబుతారు. దీనితో వారికి ఎంతో కొంత జ్ఞానం వస్తుంది. నీతి కథలతో పిల్లల మానసికంగా బలంగా తయారవుతారు. కుటుంబ విలువలు తెలియాలంటే కచ్చితంగా పిల్లలను ఊర్లకు పంపించండి.