YS Sharmila Security : 1 + 1 నుంచి 2 + 2... వైఎస్ షర్మిల భద్రత పెంపు
YS Sharmila Security News: వైఎస్ షర్మిల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ పోలీసులు. ప్రస్తుతం ఉన్న భద్రతను 2 + 2కి పెంచుతున్నట్లు కడప జిల్లా ఎస్పీ తెలిపారు.
YS Sharmila Security : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల… రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే తన భద్రత విషయంలో కూడా వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నాయకులు కూడా షర్మిల భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… వైఎస్ షర్మిల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ పోలీస్ శాఖ. ప్రస్తుతం ఉన్న భద్రతను పెంచింది. ఈ వివరాలను కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు.
వైఎస్ షర్మిల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ భద్రతను టూ ప్లస్ టూ గా మార్చినట్లు కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. భద్రతా ప్రమాణాల(స్కేల్) మేరకు భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని… వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం వారు ఇచ్చే సిఫారసు(సెక్యూరిటీ రివ్యూ కమిటీ) నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా భద్రతను అడిగితే వివరాలను పరిశీలించి… ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇటీవలే డీజీపీకి లేఖ…
తన భద్రతకు సంబంధించి ఇటీవలే రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు వైఎస్ షర్మిల. ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ భద్రతను ఫోర్ ప్లస్ ఫోర్‌కు పెంచాలని కోరారు. ఎస్కార్ట్ వెహికల్‌ను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందించి తగిన భద్రతను కేటాయించాలని కోరారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోవటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న నేపథ్యంలో… భద్రతను కల్పించాలని కోరారు. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో…. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదే సమయంలో షర్మిల భద్రతపై ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా స్పందిస్తూ వచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలే కాకుండా… తెలుగుదేశం పార్టీ నేతలు రకరకాల కామెంట్లు చేశారు. షర్మిలకు ఏదైనా జరగవచ్చంటూ మాట్లాడారు. వీరే కాకుండా తాజాగా షర్మిల కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతకు కల్పించే భద్రత ఇదేనా అంటూ మాట్లాడారు. భద్రత పెంచాలని అడిగాను కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. బహుశా నాకు ఏమనా జరగాలని కోరుకుంటున్నారేమో అంటూ కామెంట్స్ చేశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో… డీజీపీ ఆదేశాలతో కడప జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న భద్రతను పెంచినట్లు ప్రకటించారు.