PanasaPottu Biryani: పనస పొట్టు బిర్యానీ ఒకసారి చేసి చూడండి, మీకు నచ్చడం ఖాయం
05 April 2024, 11:40 IST
- PanasaPottu Biryani: పనస పొట్టు బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వండడం వచ్చిన వారి సంఖ్య తక్కువే. నిజానికి దీన్ని చాలా సులువుగా వండవచ్చు.
పనస పొట్టు బిర్యానీ రెసిపీ
PanasaPottu Biryani: చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాగే పనసపొట్టు బిర్యాని కూడా చాలా టేస్టీగా ఉంటుంది. శాకాహారులు చాలా ఇష్టంగా తినే బిర్యానిలలో పనసపొట్టు బిర్యాని ఒకటి. కానీ దీన్ని వండడం చాలా కష్టం అనుకుంటారు. నిజానికి దీన్ని చాలా సులువుగా వండొచ్చు. అన్ని బిర్యానీలలాగే ఇది వండడం ఈజీ. జాక్ ఫ్రూట్ బిర్యాని ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం.
పనసపొట్టు బిర్యాని రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - అరకిలో
ఉల్లిపాయలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
బిర్యాని ఆకులు - మూడు
పనసపొట్టు - 300 గ్రాములు
జీడిపప్పులు - గుప్పెడు
పసుపు పొడి - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
కారం - అర స్పూను
పచ్చిమిర్చి - నాలుగు
గరం మసాలా - రెండు స్పూన్లు
పెరుగు - ఒక కప్పు
నీరు - తగినంత
పుదీనా తరుగు - అరకప్పు
కొత్తిమీర తరుగు - అరకప్పు
బిర్యానీ మసాలా - ఒక స్పూను
పనసపొట్టు బిర్యాని రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. ఆ నూనెలో నిలువుగా తరిగిన ఉల్లిపాయలను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి.
3. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి.
4. బాస్మతి బియ్యాన్ని 70 శాతం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
5. పనసపొట్టను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేయాలి.
6. అందులో పసుపు, ఉప్పు, రెండు గ్లాసులు నీళ్లు కూడా వేసి మూత పెట్టి విజిల్ పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
7. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేయాలి.
8. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకులు, జీడిపప్పులు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, గరం మసాలా పొడి వేసి వేయించాలి.
9. అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేయాలి. ఇవన్నీ వేగాక కుక్కర్లో ఉడికించుకున్న పనసపొట్టును వేసి కలపాలి.
10. కాసేపు దాన్ని ఉడికించాక పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.
11. తర్వాత బిర్యానీ మసాలాను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దానిపై ముందుగా ఉడికించుకున్న బాస్మతి అన్నాన్ని పొరలు పొరలుగా వేసుకోవాలి.
12. అలాగే వేయించిన ఉల్లిపాయలు, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగును కూడా చల్లుకొని పైన మూత పెట్టాలి.
13. చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. అంతే పనసపొట్టు బిరియాని రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది.
పనసపొట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు పనసపొట్టును తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ పనసపట్టు వండినప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. గోదావరి జిల్లాలో పనసపొట్టు వంటకాలు అధికంగా చేస్తూ ఉంటారు. దీనిలో ప్రోటీన్, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలో చేరిన సోడియం ప్రభావాన్ని తిట్టపడుతుంది. కాబట్టి గుండె జబ్బులు వంటివి రాకుండా ఉంటాయి. అలాగే కండరాలు, ఎముకలు బలంగా మారుతాయి. నరాల పనితీరు మెరుగు పడుతుంది. సూర్యకిరణాల వల్ల గాయపడిన చర్మాలు తిరిగి జీవాన్ని పొందుతాయి. హార్మోన్ల సమస్యలను కాపాడడంలో కూడా పనసపొట్టు ఉపయోగపడుతుంది. దీనితో బిర్యానీ మాత్రమే కాదు కూరను వండుకోవచ్చు. వేపుళ్ళు కూడా చేసుకోవచ్చు.